హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 9: దళితబంధు పథకం ద్వారా నెలకొల్పిన యూనిట్లను మంచిగా నడుపుకుంటూ ఆర్థికంగా బలోపేతమవడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలో దళిత బంధు పథకం కింద గ్రౌండింగ్ చేసిన యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. పట్టణ కేంద్రంలోని సుహాస్ ఏజెన్సీస్, ఏషియన్ పెయింట్స్, చంద్రకళ స్టీల్ అండ్ ఎంటర్ప్రైజెస్, పోచయ్య హోటల్, టిఫిన్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో యూనిట్ల అభివృద్ధి , లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదటి దశలో యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు సగం డబ్బులు ఇచ్చామని, మిగిలిన మొత్తం వెంటనే మంజూరు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు.
సుహాస్ ఏజెన్సీస్ ఏషియన్ పెయింట్స్ లబ్ధిదారుడితో మాట్లాడుతూ పెయింట్స్‌ను అమ్మడంతో పాటు కాంటాక్ట్ పద్ధతిలో కొందరిని నియమించుకొని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, కార్యాలయాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పెయింటింగ్స్ వేసి ఆదాయం పొంది ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. పోచయ్య హోటల్లో నిర్వాహకుడితో మాట్లాడుతూ టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్ అమ్మడంతో పాటు క్యాటరింగ్ చేసి అధిక లాభాలు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఆర్డీవో బీ హరిసింగ్, ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి సురేశ్, ఈడీ నాగార్జున, హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎస్ సమ్మయ్య, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.