టీబీ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కోసం ప్రతి నెలా 500 చొప్పున 6 నెలల పాటు, ఎండీఆర్ టీబీ నిర్ధారణ అయితే రెండేళ్ల దాకా అందిస్తున్నది. ఇంకా అదనంగా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో దాతలు ముందుకురావాలని పిలుపునిచ్చింది. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో టీబీని 2025 నాటికి అంతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ నియంత్రణకు ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నది.
ప్రాణాంతక అంటువ్యాధుల్లో క్షయ వ్యాధి(టీబీ) ఒకటి. మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ బాక్టీరియా ద్వారా వస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత టీబీ వ్యాధికారకం ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. దగ్గు, జ్వరంతో ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కొన్ని సార్లు ఎముకలు, నాడీమండలం, మెదడు, మూత్రపిండాలు, పేగులపై కూడా ప్రభావం చూపుతుంది. వ్యాధి తీవ్రతను బట్టి ప్రాణాంతకంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే క్రమం తప్పకుండా కనీసం ఆరు నెలల పాటు కోర్సు మందులను వాడుతూ.. పౌష్టికాహారం తీసుకుంటే టీబీని నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
యాక్టివ్ కేసు ఫైండింగ్ సర్వే…
టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు పెద్దపల్లి జిల్లాలోని 18 పీహెచ్సీ, 6 యూపీహెచ్సీ పరిధిలో యాక్టివ్ కేసు ఫైండింగ్ సర్వే కొనసాగుతున్నది. ఒక్కో ఏఎన్ం నెలలో కనీసం 5 శాంపిల్స్ సేకరించాల్సి ఉంటుంది. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ, టీబీ వ్యాధి, నియంత్రణపై అవగాహన కల్పిస్తూ, టీబీ లక్షణాలున్న వారిని పీహెచ్సీలకు తీసుకవెళ్లి పరీక్షలు చేయిస్తున్నారు. 14 పీహెచ్సీలో టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లా ప్రధాన దవాఖాన, మంథని ప్రభుత్వ దవాఖానలో ట్రూనాట్ మిషన్లు, గోదావరిఖని ఏరియా దవాఖానలో సీబీ నాట్ మిషన్ అందుబాటులో ఉంచారు.
పెద్దపల్లి జిల్లాలో 1016 టీబీ కేసులు 
జిల్లాలో 1016 టీబీ కేసులను గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితులకు ప్రతి నెలా ఉచితంగా మందులు అందిస్తూ, నిక్షయ్ పోషణ యోజన కింద 2018 ఏప్రిల్ నుంచి పోషకాహారం కోసం 500 చొప్పున నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నది. టీబీ రోగులు మందులను క్రమం తప్పకుండా కోర్సుగా వాడితే నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి రకం, తీవ్రత మీద ఆధారపడి చికిత్స 6 నెలల నుంచి 3 ఏండ్ల దాకా కోర్సు ఉంటుంది.
ముందుకు వస్తున్న దాతలు..
రాష్ట్ర సర్కారు పిలుపు మేరకు క్షయ వ్యాధి నియంత్రణకు దాతలు, ఎన్జీవోల ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. తమవంతు సహాయ సహకారాలు, ఆర్థిక సాయం చేస్తున్నారు. పెద్దపల్లి లయన్స్ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సంయుక్తంగా జిల్లాలోని 437 మంది క్షయ రోగులకు 6 నెలల పాటు అదనపు పౌష్టికాహారం అందిస్తామని ముందుకు వచ్చారు. గత నెల 27వ తేదీన కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల వారీగా రోగులను గుర్తించి పౌష్టికాహార కిట్లను అందిస్తున్నారు. ఇప్పటి వరకు 85 మంది టీబీ పేషెంట్లకు పంపిణీ చేశారు.
లక్షణాలు..
వ్యాధి తీవ్రతను బట్టి నాలుగు రకాలు
వ్యాధి తీవ్రతను రహస్య అంటువ్యాధి, యాక్టివ్ పల్మనరీ అంటువ్యాధి, అదనపు పల్మనరీ అంటువ్యాధి, డ్రగ్ – రెసిస్టెంట్ అంటువ్యాధిగా ఉంటాయి.
రహస్య అంటువ్యాధి : ఆరు నెలల పాటు కోర్సుగా ఒకే మందుతో చికిత్స అందిస్తారు.
యాక్టివ్ పల్మనరీ అంటు వ్యాధి: దీనికి ఆరు నుంచి తొమ్మిది నెలల దాకా మిశ్రమ చికిత్స ఉంటుంది.
అదనపు పల్మనరీ అంటువ్యాధి: వ్యాధి తీవ్రత తీవ్రంగా ఉంటుంది ఆరు నుంచి తొమ్మిది నెలలపాటు బహుళ సమ్మేళనాలు ఉపయోగించిన తర్వాత మరో మూడు నెలల పాటు ఒకే మందును కోర్సుగా వాడాలి.
డ్రగ్ – రెసిస్టెంట్ అంటువ్యాధి (ఎండీఆర్ టీబీ, ఎక్స్డీఆర్ టీబీ): దీనికి 18 నెలల నుంచి 3 ఏండ్ల దాకా కోర్సుగా వాడాలి.
6 నెలల దాకా 32 మందికి కిట్లు అందిస్తా..
పెద్దపల్లి లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు టీబీ పేంషెట్లకు సహకారం అందించాలని కోరారు. వారి కోరిక మేరకు టీబీ ముక్త్ భారత్లో భాగంగా పెద్దపల్లి మండలం రాఘవపూర్ పీహెచ్సీ పరిధిలోని 32 మంది టీబీ రోగులకు 6 నెలల దాకా పౌష్టికాహార కిట్లను అందిస్తా. ఒక్కో కిట్టుకు 450 అవుతుంది. 32 మంది క్షయ రోగులకు నెలకు 14,400 వెచ్చిస్తా. క్షయ రోగులకు ఆర్థిక సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది.
– ఎరబాటి వెంకటేశ్వర్ రావు, లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గ్లోబల్ కాజెస్ కన్వీనర్
దాతలు ముందుకు రావాలి
క్షయ వ్యాధిగ్రస్తులకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు దాతలు ముందుకు రావాలి. పెద్దపల్లి లయన్స్ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలోని 437 మంది క్షయ రోగులకు 6 నెలల పాటు అదనపు పౌష్టికాహారం అందించాలని అనుకున్నాం. పలువురి దాతల ఆర్థిక సాయంతో 85 మందికి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశాం. 450 విలువ చేసే ఈ కిట్టులో కిలో గోధుమ పిండి, కిలో కందిపప్పు, అరకిలో రాగుల పిండి, అరకిలో నూనె, 30 గుడ్లు ఉంటాయి. దాతల పేర్లును నిక్షయ్ పోషణ యోజన పోర్టల్ నమోదు చేస్తాం. లయన్స్ క్లబ్ సభ్యులు ఎరబాటి వెంకటేశ్వర్ రావు, బండ బాబూరావు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేశారు. స్ఫూర్తితో ఇంకా కొందరు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. 2025 నాటికి టీబీని అంతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో దాతలు భాగస్వాములు కావడం శుభపరిణామం.
-కావేటి రాజగోపాల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు, రెడ్ క్రాస్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్
సమతుల పోషకాహారం తీసుకోవాలి
టీబీ వ్యాధిగ్రస్తులు బలవర్థ్ధకమైన సమతుల పోషకాహారం తీసుకోవాలి. పోషకాహార లోపం, బరువు తకువ లేకుండా చూసుకోవాలి. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం లాంటివి టీబీ లక్షణాలని, వ్యాధి సోకిందో లేదో తెలుసుకునేందుకు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. జిల్లాలోని 18 పీహెచ్సీలు, 6 ఆర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. జిల్లా కేంద్ర ప్రధాన దవాఖాన, మంథని ప్రభుత్వ దవాఖానలో ట్రూనాట్ మిషన్లు, గోదావరిఖని ఏరియా దవాఖానలో సీబీ నాట్ మిషన్ ఉందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 1016 టీబీ కేసులు నమోదయ్యాయి. టీబీ వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు జిల్లాలో 18 పీహెచ్సీ, 6 యూపీహెచ్సీ పరిధిలో యాక్టివ్ కేసు ఫైండింగ్ సర్వే కొనసాగుతున్నది. ఒక్కో ఏఎన్ఎం నెలలో కనీసం 5 శాంపిల్స్ సేకరించాల్సి ఉంటుంది.
– కే ప్రమోద్ కుమార్, డీఎంహెచ్వో (పెద్దపల్లి)