కరీంనగర్ డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జగిత్యాల (నమస్తే తెలంగాణ)/ కలెక్టరేట్/ రాయికల్/ జగిత్యాల రూరల్/ అర్బన్/ మల్యాల/ మెట్పల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల పర్యటనలో బుధవారం వరాల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ ప్రారంభం, మెడికల్ కాలేజీ శంకుస్థాపన, సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత కాన్ఫరెన్స్ హాలులో మాట్లాడారు. అనంతరం భారీ బహిరంగ సభ వేదికగా రాష్ట్ర సాధన, ఉద్యమ అనుభవాలు, జగిత్యాల జిల్లా ప్రశస్తి, ప్రాధాన్యతలు, పుష్కరాల సందర్భంలో ఎదురైన అనుభవాలు, వరద కాలువ ముచ్చట్లు, ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ తనదైన శైలిలో ప్రసంగించారు.
అలాగే, నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ఏర్పాటు చేసుకోవడమేకాదు అద్భుతంగా కలెక్టరేట్‌ను నిర్మించుకొని తనతో శంకుస్థాపన చేసుకున్నందుకు జగిత్యాల జిల్లా ప్రజలను అభినందిస్తున్నానని తెలిపారు. జగిత్యాల గతంలో జిల్లా అయితదని కలలో కూడా అనుకోలేదని, తెలంగాణ వచ్చింది కాబట్టే జగిత్యాల జిల్లా సాధ్యమైందన్నారు. ఉద్యమ సమయంలో చాలాసార్లు ధర్మపురికి వచ్చానని, ఆరోజు గోదావరి నది తెలంగాణలో మొదట ప్రవహిస్తే ఇక్కడ పుష్కరాలు ఎందుకు చేయరని అడిగానని గుర్తు చేశారు.
మళ్లీ పుష్కరాల నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించి మళ్లీ ఇక్కడ పుష్కరస్నానం చేస్తానని మొక్కుకున్నానని, రాష్ట్రం సాధించిన తర్వాత ధర్మపత్నితో వచ్చానని చెప్పారు. స్వామివారి దయతో తెలంగాణ వచ్చిందని, స్వరాష్ట్రంలో గోదావరి పుష్కరాలు వైభవంగా జరుపుకున్నామని, లక్షలాది మంది మన రాష్ట్రంతోపాటు పక్క రాష్ట్రం నుంచి ధర్మపురికి వచ్చారన్నారు. ఆనాడు మంత్రి హరీశ్‌రావు ట్రాఫిక్ పోలీస్‌లా పనిచేశారని గుర్తుచేశారు. వరదకాలువ గురించి రాస్తే రామాయణం అవుతుందని, చెప్తే భాగవతం అవుతుందన్నారు. గతంలో ఉన్న సమస్యలు, ఇప్పటి పరిస్థితులపై ఒక నవల రాయొచ్చని చమత్కరించారు.
వరదకాలువను ఒక రిజర్వాయర్‌గా, ఒక జీవనదిగా మార్చుకున్నామని, వందలాది చెరువులు నింపుకున్నామన్నారు. జగిత్యాల జిల్లాలో అద్భుత పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి నర్సింహస్వామి ఉన్నాడని చెప్పారు. మాహిమాన్విత క్షేత్రం కొండగట్టు క్షేత్రానికి 100 కోట్లు మంజూరు చేస్తున్నానని, స్వయంగా స్థపతులను తీసుకొచ్చి దేశంలోనే అద్భుత ఆలయంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. హనుమాన్ భక్తులు వేల నుంచి లక్షలాదిగా వస్తున్నారని చెప్పారు. దేవస్థానానికి 20 ఎకరాలు ఉండ గా 384 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చానని వెల్లడించారు.
ఇప్పటికే వేములవాడ దేవాలయ అభివృద్ధికి 34ఎకరాల స్థలం కొనుగోలు చేసి ఇచ్చామని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో కలిసి బండలింగాపూర్‌కు వెళ్లానని, అక్కడే పల్లె నిద్రచేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే, ఇప్పుడు విద్యాసాగర్ రావు బండలింగాపూర్ మండలం చేయాలని కోరుతున్నారని, అందుకే బండలింగాపూర్‌ను మండలంగా ప్రకటిస్తున్నాని చెప్పారు. వేములవాడ నియోజకవర్గాలో కథలాపూర్, భీమారం మండలాలకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని, వాటికి కూడా వరద కాలువ ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇచ్చే చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.
మల్యాల మండలం మద్దుట్లలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నానని చెప్పారు. ఇదే సమయంలో నారాయణపూర్, పోతారం రిజర్వాయర్‌ను పూర్తిచేసి సాగనీటి రంగాన్ని తీర్చిదిద్దుకుందామన్నారు. జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే రోళ్ల వాగు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కోరిక మేరకు కరీంనగర్, జగిత్యాల నియోజకవర్గాల అభివృద్ధికి 10కోట్ల చొప్పున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
వరద కాలువ వరదాయినిగానే కాదు సజీవనదిగా మార్చామని చెప్పిన సీఎం, ఆ వరదకాలువకు కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని పలు ప్రాం తాల్లో తూములు ఏర్పాటుచేసి వందలాది చెరువులు నింపుతున్నామని చెప్పారు. వరదకాలువపై 13 వేల మో ట ర్లు నడుపుకుంటూ.. రైతులు పంటలు పండించుకుంటున్నారని, ఇది తెలంగాణ రావడం వల్లే మాత్రమే సాధ్యమైందన్నారు. సమైక్య రాష్ట్రంలో మోటర్లు పెడితే రైతులను అనేక రకాలుగా తిప్పులు పెట్టారని, కరెంటు తీగలు కోసి పారేశారని, గత్యంతరం లేని పరిస్థితుల్లో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. వరదకాలువకు మోటర్లుపెడితే.. ఇప్పుడెవరన్నా వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారా..?అంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు జిల్లా కు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు.. అలాగే సభావేదికగా సీఎం వరాల జల్లులపై ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
పునర్జీవంతో జలకళ
ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకంమెట్ట ప్రాంతాలైన మల్యాల, కొడిమ్యాల ప్రాంతాలకు జీవం పోసినట్లు అయ్యింది. మండలం నుంచే ఎస్ఆర్ఎస్పీ కాలువ వెళ్తున్నప్పటికీ సాగు నీటికి అరిగోసపడ్డా మా ప్రాంతాలనికి పు నర్జీవం వల్ల జలకళ వచ్చింది. దీంతో ఏండ్లుగా బీడువారిన భూములు సాగులోకి వచ్చాయి. బీడువారిన భూములు పచ్చని మాగానులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే సొంతం.
– పందిరి శేఖర్, ఒబులాపూర్ (మల్యాల మండలం)
మా కల నెరవేరింది
బండలింగాపూర్ కేంద్రంగా మండలం కావాలని ఎన్నో ఏండ్లుగా కంటున్న కల నెరవేరింది. ప్రజల అభీష్టానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ బండలింగాపూర్‌ను మండలంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. మేజర్ గ్రామపంచాయతీ అయిన బండలింగాపూర్ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు పాలన మరింత దగ్గర కానుంది. మండల కేంద్రంగా బండలింగాపూర్‌ను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– రేండ్ల రమేశ్, బండలింగాపూర్
ఏండ్ల నాటి కల సాకారం..
నేను ఏండ్ల సంది ఆలయానికి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాను. అయితే ఇక్కడ గుట్టపై సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడేవాళ్లు. ఈ రోజు జగిత్యాలకు అచ్చిన ముఖ్యమంత్రి సారు ఆలయానికి రూ. 100 కోట్లు ఇస్తానని, అద్భుత క్షేత్రంగా తయారుచేస్తానని ప్రకటించడం గొప్ప విషయం. ఈ నిధులతో ఆలయం అభివృద్ధి చెందనున్నది. ఏండ్ల నాటి భక్తుల కల సాకారం కానున్నది.
– ఇట్టిరెడ్డి అంజిరెడ్డి, గుడిపేట గ్రామం, (మల్యాల)
ప్రగతి పథంలో గ్రామాలు
ఒకప్పుడు గ్రామాల్లో కనీస మౌలిక వసతు లు లేక ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించా రు. తెలంగాణ రాష్ట్రం వచ్చి, సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల రూ పురేఖలు మారిపోయాయి. గ్రామాల్లో మౌ లిక వసతుల కల్పనకు క్రమం తప్పకుండా నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నా యి. జగిత్యాల జిల్లా అయిన తర్వాత ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నారు.
– మాలోత్ బీక్యానాయక్, మెట్లచిట్టాపూర్ (మెట్‌పెల్లి మండలం)
మరో 30 ఏండ్లు ఢోకాలేదు
ఈ ఎనిమిదేండ్ల పాలనలో వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. రైతు బంధు, రైతు బీమా, సాగు నీటి ప్రాజెక్టులు, ఎస్సారెస్పీ పునర్జీవం వంటి పనుల వల్ల సాగు నీరు అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తూ రైతు బాంధవుడిగా మారారు. రైతు పక్షపాతి అయిన కేసీఆర్ అసోంటి సీఎం మరే రాష్ట్రంలోనూ లేరు. రాష్ట్రంలో మరో 30 ఏండ్ల వరకు కేసీఆర్‌కు ఢోకా లేదు.
– రౌతు భీమయ్య, గోపాల్రావుపేట
బీడీ కార్మికులకు కొండంత అండ
ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే. రోజురోజుకూ బంద్ అవుతున్న బీడీ పరిశ్రమ వల్ల కార్మికులకు ఉపాధి లేకుండా పోతున్న ది. ఈ సమయంలో ప్రతినెలా బీడీకా ర్మికులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.2వేల పిం ఛన్ నాలాంటి ఎంతో మందికి కొండంత అండ. పింఛన్లే కా కుం డా పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లకు కల్యాణ లక్ష్మిసాయం ఇస్తున్నడు.
– కట్టెకోల లహరి, గంభీర్పూర్ (కథలాపూర్ మండలం)
మరింత ఆధ్యాత్మిక శోభ
జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ కొండగట్టు హనుమాన్ ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించడం ఆనందం గా ఉన్నది. ఈ నిధులతో భక్తులకు ప్ర త్యేక కాటేజీల నిర్మాణానికి, ఆలయ ప రిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుంటుంది. దేవస్థానంగా సుందరంగా రూపుదిద్దుకొని మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నది. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నాం. అభివృద్ధి పనులకు అన్నివిధాల సహకరిస్తాం.
-బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచ్, ముత్యంపేట-కొండగట్టు, మల్యాల మండలం.
జిల్లా ఏర్పాటుతో సత్వర సేవలు
జగిత్యాల జిల్లాగా ఏర్పడటంతో ప్రజలందికీ ప్రభుత్వ సేవలు స త్వరమే అందుతున్నాయి. ఉమ్మ డి జిల్లాలో ఉన్నప్పడు గొల్లపెల్లి నుంచి కరీంనగర్ వెల్లాలంటే ఒక రోజు మొత్తం గడుపాల్సిన పరిస్థి తి ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేయడంతో జిల్లా కేం ద్రం చేరువవడంతో పాటు అందరు జిల్లా అధికారులు అందుబాటులో ఉండడంతో సమస్యలు సత్వరమే పరిష్కారమవుతున్నాయి. దశాబ్దాల కల అయిన జిల్లాకు ప్ర భుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడం వైద్య పరం గా జిల్లా వాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
-చాడ వెంకటరమణ, గొల్లపెల్లి మండలం