చిగురుమామిడి, డిసెంబర్ 6: ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఓటు హకు కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మండలంలో కొత్తగా ఓటు హకు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. బీఎల్వోలు, తహసీల్ కార్యాలయం, ఆన్లైన్, మీ సేవ ద్రాలో ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండినవారి కోసం ఎన్నికల సంఘం ఏటా ఓటరు నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా మండలంలో గత నెల 26, 27, ఈ నెల 3,4 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 17 గ్రామాలకు గాను 230 మంది ఓటు హకు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల మరణించిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లను తొలగించారు. 15 మంది జాబితాలో చేర్పులు, మార్పులకు దరఖాస్తు చేసుకున్నారు. మండలంలో 40 ఎలక్షన్ బూత్‌లను ఏర్పాటు చేసి బీఎల్వోలను నియమించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
ఓటరు నమోదు పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేకాధికారిగా తహసీల్దార్ ముబీన్ అహ్మద్ వ్యవహరిస్తున్నారు. మండలంలోని అన్ని పోలింగ్ బూత్‌లకు వెళ్లి బీఎల్వోల పనితీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ఓటు హకుపై అవగాహన కల్పించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారిని జనవరి 5న వెలువడే తుది ఓటరు జాబితాలో చేరుస్తారు.
ఓటరుగా నమోదు చేసుకోవాలి
18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటు హక్కు కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఓటు నమోదుపై ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత అవగాహన కల్పించాలి.
-ముబీన్ అహ్మద్, తహసీల్దార్
ఓటు వజ్రాయుధం
ఓటు వజ్రాయుధం లాంటిది. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటు హకు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఓటు హకు కలిగిన వారందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేయాలి.
-నీల భరత్, ఓటర్, రేకొండ