సిరిసిల్ల / సిరిసిల్ల టౌన్/ కలెక్టరేట్/ వేములవాడ రూరల్, నవంబర్ 29 : ‘మీ స్కూల్ చాలా బాగుంది. సౌలత్లు బాగున్నాయి’ అంటూ ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ కితాబిచ్చారు. మంగళవారం సాయంత్రం వేములవాడ మండలం అగ్రహారంలోని చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీలోని మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు బాగున్నాయని కితాబిచ్చారు. ‘మన ఊరు-మన బడి’ ద్వారా జడ్పీహెచ్ఎస్లో 40.91 లక్షలు, ఎంపీపీఎస్‌లో 27.27 లక్షలతో పనులు చేపట్టినట్లు డీఈవో ధనాలకోట రాధాకిషన్ మంత్రికి తెలిపారు. ఎలక్ట్రిసిటీ, కిచెన్ షెడ్, ప్రహరీ, సంప్, ఫ్యాన్లు, పెయింటింగ్ పనులు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరుతోపాటు వారు తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పిస్తున్నదన్నారు.