దళిత బంధు లక్ష్యం నెరవేరుతున్నది. దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న జీవితాల్లో వెలుగులు నింపాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా చేపట్టిన బృహత్తర దళిత బంధు పథకం దళితుల కష్టాలు, కన్నీళ్లను దూరం చేస్తూ బతుకుబాట చూపుతున్నది. అందుకు హుజూరాబాద్ పట్టణంలోని దళితబిడ్డల జీవితమే నిదర్శనంగా నిలుస్తున్నది. ఒకప్పుడు దొరికిన పని చేసి.. మరొకరి వద్ద డ్రైవర్లుగా బతుకీడ్చిన వారిని యజమానులుగా మార్చింది. పథకం కింద టిప్పర్లు ఇవ్వడంతో రోజంతా పనిచేసుకుంటూ వారు సంతోషంగా బతుకుతున్నారు. నెలకు 40నుంచి 60వేల ఆదాయం పొందడమే కాదు, మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. తమకు బతుకు చూపిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 14 : ఇన్నాళ్లూ కాయకష్టం చేసుకుని ఎల్లదీసిన బతుకులవి. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకున్నా రూపాయి వెనకేసుకునే పరిస్థితి లేని జీవితాలవి. కూలీ నాలీ చేసుకుని బతికే దళితులపై సీఎం కేసీఆర్ చూపుతున్న ఆదరణతో వాళ్ల జీవితాలే మారిపోతున్నాయి. ప్రతిష్టాత్మకంగా తెచ్చిన దళితబంధుతో కొత్త వెలుగులు నిండుతున్నాయి. ఇన్నాళ్లూ కూలీలుగా, డ్రైవర్లుగా పనిచేసిన వాళ్లు ఇపుడు ఓనర్లవుతున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లు, ఎక్స్కవేటర్లు, హార్వెస్టర్లు కొనుక్కొని మంచి ఉపాధి పొందుతున్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో దాదాపు 20 మంది దళిత బంధు కింద టిప్పర్లు తీసుకున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో డ్రైవర్లను నియమించుకొని ఉపాధి పొందుతున్నారు. నెలకు 40 వేల నుంచి 60 వేల దాకా సంపాదిస్తున్నామని, డ్రైవర్ జీతం 18వేలు, ఇంకా మెయింటనెన్స్ ఖర్చులు పోను నెలకు 30వేల దాకా మిగులుతున్నాయని లబ్ధిదారులు సంతోషంగా చెబుతున్నారు.
బతుకుదెరువు దొరికింది..
నేను మొన్నటిదాకా తాపీ మేస్త్రీ పని చేసుకుంటూ బతికిన. పని ఉన్నప్పుడు చేసేది లేదంటే ఖాళీగానే ఉండేది. కుటుంబాన్ని నెట్టుకొచ్చుడు చాలా కష్టమైతుండె. ఈ జీవితం ఇంతేనా అని అనుకున్న. కానీ సీఎం కేసీఆర్ సార్ ఒకసారిగా దేవునోలె దళిత బంధు పథకాన్ని తెచ్చి అందరి బతుకులు మార్చిండు. జూన్ 19న టిప్పర్ తీసుకున్న. ఓ డ్రైవర్‌ను పనికి పెట్టుకుని అతనికి నెలకు 18 వేల జీతం చెల్లిస్తూ కొత్తపల్లెగుట్ట నుంచి క్రషర్ డస్ట్, కంకర, మొరం టిప్పర్ ద్వారా సరఫరా చేస్తూ నెలకు 40 వేల నుంచి 50 వేలు సంపాదిస్తున్న. టిప్పర్‌తో నాకు బతుకుదెరువు దొరికింది. ఈ రోజు మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి రుణపడి ఉంట.
– చందమల్ల మొగిలి, ముకపల్లి (హుజూరాబాద్‌టౌన్)
టిప్పర్‌కు ఓనరైన
నేను ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ కంపెనీలో చిరుద్యోగిగా పనిచేసేవాన్ని. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ద్వారా అందించిన టిప్పర్‌తో ఓనరైన. కొందరికి నేనే ఉపాధి చూపుతున్న. టిప్పర్‌ను నడిపేందుకు ఓ డ్రైవర్‌ను పెట్టుకొని అతనికి నెలకు 18 వేల జీతం ఇస్తున్న. నేను నెలకు 50వేల నుంచి 60 వేలు సంపాదిస్తున్న. నిత్యం నా టిప్పర్ ద్వారా నూతన గృహ నిర్మాణదారులకు మొరం, కంకర, క్రషర్ డస్ట్ సరఫరా చేస్తున్న. గిరాకీ బాగానే ఉంది. మా కుటుంబానికి టిప్పర్ అందించి ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటుంది.
– మునిగంటి రాజేందర్, దళిత బంధు టిప్పర్
ఓనర్స్ అసోసియేషన్ కోశాధికారి, ముకపల్లి (హుజూరాబాద్)
రంది లేకుంట బతుకుతున్న
నేను ఇంతకుముందు ఒకరి వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడిని. నాకు భార్య సరస్వతి, ముగ్గురు పిల్లలు ఉన్నరు. తల్లిదండ్రులూ నాపైనే ఆధారపడి ఉన్నరు. అచ్చీరాని సంపాదనతో కుటుంబానికి నెట్టుకొచ్చేవాన్ని. కానీ దళితబంధు నా జీవితాన్నే మార్చివేసింది. గత మేలో ప్రభుత్వం దళితబంధు కింద టిప్పర్ కొనిచ్చింది. మొన్నటిదాకా జీతగాడిగా పనిచేసిన నేను ఒక్కసారిగా ఓనరైన. నెలకు 50వేల నుంచి 60వేలు సంపాదిస్తున్న. ఇప్పుడు నాకు రంది లేదు. చేతి నిండా పనిదొరుకుతున్నది.
– బత్తుల సతీశ్, మంథనిపల్లి గ్రామం (హుజూరాబాద్ మండలం)
నెలకు 60 వేలు దొరుకుతున్నయ్..
ఓ సీడ్ కంపెనీలో ప్రొడక్షన్ ఆఫీసర్‌గా పనిచేసేవాన్ని. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా గత జూన్ 19న టిప్పర్ వచ్చింది. మార్కెట్లో టిప్పర్లకు గిరాకీ బాగానే ఉండడంతో చేతినిండా పని దొరుకుతున్నది. నెలకు 60వేల నుంచి 70వేలు సంపాదిస్తున్న. డ్రైవర్‌కు నెలకు 18వేలు జీతం ఇస్తున్న. మెయింటనెన్స్ ఖర్చులు పోను నెలకు 30వేల నుంచి 40 వేలు మిగిలుతున్నయ్. నా భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకోవడమేకాదు మరో ముగ్గురు నలుగురికి ఉపాధి చూపుతున్న. మా లాంటి పేదలు గొప్పగా బతికేందుకు గొప్ప అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటం.
– చౌడమల్ల రాజు, టిప్పర్ లబ్ధిదారుడు (హుజూరాబాద్‌టౌన్)