న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విదేశీ పర్యటనలకు తరుచూ వెళ్తుంటారు. అయితే గత పదేళ్లలో అంటే 2015 నుంచి 2025 వరకు ప్రధాని మోదీ విదేశీ టూర్ల కోసం సుమారు 762 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. కేంద్ర విదేశాంగ శాఖ ఈ విషయాన్ని శుక్రవారం లోక్‌సభలో వెల్లడించింది. దీనిపై ఆ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రధాని విదేశీ టూర్లకు అయిన ఖర్చు వివరాలను ఆ సమాధానంలో చెప్పింది. ప్రధాని మోదీతో పాటు వెళ్లిన ప్రతినిధుల సమాచారాన్ని కూడా రిలీజ్ చేసింది. ప్రతి ఏడాది విదేశీ ట్రిప్‌లకు అయిన ఖర్చులో తేడా కనిపించింది. 2020లో కోవిడ్ వల్ల ఆంక్షల కారణంగా ప్రధాని మోదీ ఎక్కువగా విదేశీ టూర్లకు వెళ్లలేదు. కానీ 2021 నుంచి మళ్లీ విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చు పెరుగుతూ పోయింది. 2024 నుంచి సగటున ఏడాది ఖర్చు వంద కోట్లు దాటింది. 2025లో సుమారు 175 కోట్లు విదేశీ పర్యటనలకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. యూరోప్, అమెరికా, ఆఫ్రికా, ఈస్ట్ ఆసియా లాంటి ప్రదేశాలకు వెళ్లడం వల్ల ప్రధాని ట్రిప్ ఖర్చులు పెరిగాయి.
విదేశీ పర్యటనల సమయంలో ప్రధానిని ఆ దేశం ఓ అతిథిగా ఆహ్వానిస్తుంది. ఆ దేశమే ఆతిథ్యం ఖర్చులు భరిస్తుంది. అయితే భారతీయ ప్రతినిధులకు, భద్రతా ఏర్పాట్లకు, మీడియా బృందానికి, లాజిస్టిక్ సపోర్టు ఖర్చులన్నీ ఇండియానే భరించాల్సి ఉంటుంది. 2014 నుంచి ప్రధానితో పర్యటించిన విదేశీ బృందాల్లో కనీసం 27 నుంచి 72 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. 2025లో అయిదు దేశాల్లో పర్యటించిన సమయంలో అప్పుడు భారత బృందంలో సుమారు 95 మంది ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ఆరంభం దశలో ఖర్చు తక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత శిఖరాగ్ర సదస్సులకు వెళ్తున్న కారణంగా ఖర్చు పెరిగినట్లు తెలిసింది. ఎన్ని దేశాలు విజిట్ చేస్తున్నారు.. ఎంత దూరం ప్రయాణిస్తున్నారు.. భద్రతా అవసరాలు, బృందాల సామర్థ్యంపై ఖర్చు ఆధారపడి ఉంటుంది.
గత ప్రధానుల పర్యటనకు చెందిన ఖర్చు వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. 2011లో అప్పటి ప్రధాని అమెరికా వెళ్లిన సమయంలో 10.74 కోట్లు ఖర్చు అయ్యింది. 2013లో రష్యా ట్రిప్‌కు 9.95 కోట్లు, 2011లో ఫ్రాన్స్‌కు వెళ్లినప్పుడు 8.33 కోట్లు, 2013లో జర్మనీ వెళ్లినప్పుడు 6.02 కోట్లు ఖర్చు అయినట్లు ప్రభుత్వం చెప్పింది.