మంథని, సెప్టెంబర్ 10: 75 ఏండ్ల స్వాతంత్య్రంలో 40 ఏండ్లు మంథని నియోజకవర్గాన్ని పాలించిన దుద్దిళ్ల కుటుంబం ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకూ పదవులిచ్చిన పాపాన పోలేదని, నమ్మినవారిని నిండా ముంచే చరిత్ర వారిదని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ విమర్శించారు. సోమవారం మంథని రాజగృహలో విలేకరులతో మాట్లాడారు. తండ్రీ, కొడుకులిద్దరూ ఎంతో మంది సీనియర్ నాయకుల రాజకీయ ఎదుగుదలకు అడ్డుకట్ట వేశారని, నాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్ జెండాలు మోస్తూ సారు జపం చేస్తున్నా పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకులకు పదవులిస్తే ఎక్కడ ఎదిగి పోతారన్న భయంతో నియోజకవర్గంలో నియంత పాలనకు శ్రీకారం చుట్టారని, ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు. వారు మాత్రం అనేక పదవులు అనుభవించినప్పటికీ కింది స్థాయి కేడర్ గురించి ఏ ఒక్క రోజూ ఆలోచించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంథని మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ నాయకుడు ఆజీంఖాన్ ఇప్పటికీ కాంగ్రెస్ జెండాను మోస్తున్నాడని, అలాంటి మైనార్టీ నాయకుడికి ఇప్పటి వరకు ఏ ఒక్క పదవి ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని ఆ పార్టీ శ్రేణులు ఆలోచించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన కిషన్‌రెడ్డి పార్టీని వీడుతానంటే ఆయనను గంజాయి కేసులో ఇరికించేందుకు చూసిన వ్యక్తి శ్రీధర్‌బాబు కాదా? అని పుట్ట మధూకర్ ప్రశ్నించారు. నాయకుడంటే తన వెంట కార్యకర్తల ఎదుగుదలకు కృషి చేయాలే కానీ అక్రమ కేసులు పెట్టించి లొంగ దీసుకునే ప్రయత్నాలు సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ఓట్లతో గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీపీలు మళ్లీ తెరపైకి రానివ్వకుండా చేసిన ఘనత శ్రీధర్బాబుదేనని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త, నాయకుడు ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగాలనే ఆకాంక్షతో ముందుకు సాగానని, కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లోకి వచ్చిన ఎంతో మందికి సందర్భోచితంగా సముచిత పదవులు కల్పించిన ఘనత మాకు మాత్రమే దక్కుతుందన్నారు.
భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణీ నుంచి మొదలుకొని ఏఎంసీ చైర్మన్ పిట్ల మంజూల గోపాల్, మంథని ఏఎంసీ చైర్మన్‌గా ఎక్కటి అనంతరెడ్డి నియామకం దాకా పదవులు కల్పించి గౌరవించుకుంటున్నామన్నారు. అనుభవానికి తగ్గట్టుగా పదవులు ఇచ్చామే తప్పా ఏనాడూ వారిని అగౌరవ పర్చలేదన్నారు. తాను చెబుతున్న విషయాలపై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆలోచన చేయాలని, ఇంకా శ్రీధర్ బాబు మెప్పు కోసం తనపై అసత్య ప్రచారం, తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలం వృథా చేసుకోవద్దని సూచించారు. నియోజకవర్గంలో బహుజనులకు రాజ్యాధికారం రావాలన్నదే తన ఆకాంక్ష అని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బలోపేతం కోసం తన పోరాటం ఆగదని పుట్ట మధూకర్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, భూపాపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ, నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు కొండా శంకర్, తగరం సుమలత, ఆరెపల్లి కుమార్, కొత్త శ్రీనివాస్, తగరం శంకర్‌లాల్, ఎగోలపు శంకర్‌గౌడ్, ఎక్కటి ఆనంతరెడ్డి, బత్తుల సత్యనారాయణ, పూదరి సత్యనారాయణగౌడ్, చెల్కల స్వర్ణలత అశోక్, బాన్సోడ రాణిభాయి, జక్కుల ముత్తయ్య, జక్కు రాకేశ్, చల్లా నారాయణరెడ్డి, భూపెల్లి రాజు, చెప్యాల రామారావు, మల్క రామారావు, రాజిరెడ్డి, కిషన్‌రెడ్డి ఉన్నారు.