కళలకు కాణాచి అయిన కరీంనగర్ మరోసారి అద్భుత కళావేడుకలకు వేదిక కానున్నది. దసరాకు ముందుగా మూడు రోజులపాటు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వాన ఈ నెల 30, వచ్చే నెల 1, 2 తేదీల్లో అంబేద్కర్ స్టేడియం వేదికగా ఈ వేడుకలను జరుపనున్నారు. కరీంనగర్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా.. దేశంలోని 29 రాష్ర్టాల నుంచి కళాకారులు రానున్నారు. ఈ ఉత్సవాలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కరీంనగర్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్లో కళోత్సవాలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 5న దసరా పండుగ ఉన్న సంగతి తెలిసిందే. దానికి ముందు సద్దుల బతుకమ్మ ఉంది. ఈ రెండు పండుగలకు వివిధ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, చదువుకునే విద్యార్థులు, ఇతర విభిన్న వర్గాలు సొంత జిల్లాకు చేరుకుంటారు. స్థానికంగా ఉండే వారితో పాటు.. వివిధ ప్రాంతాల నుంచి ఇంటికి వచ్చే వారికి కనులవిందు చేసేందుకు కరీంనగర్ జిల్లా వేదికగా కళోత్సవాలు నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగంతో చర్చించారు. అందరూ ఒక్క తాటిపైకి వచ్చి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 30తో పాటు అక్టోబర్ 1, 2 తేదీల్లో అంటే మూడు రోజుల పాటు ఈ వేడుకలుంటాయి. వీటిని ఆషామాషీగా కాకుండా ఉమ్మడి కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాకు చెందిన కళాకారులు, అలాగే, దేశంలోని 29 రాష్ర్టాల నుంచి విభిన్న కళాకారులను రప్పించి ప్రదర్శనలు ఇప్పించాలని నిర్ణయించారు.
భారీ ఏర్పాట్లు
సహజంగా వినోద కార్యక్రమాలకు ప్రజలు భారీ ఎత్తున హాజరవుతారు. గతంలో లోయర్‌మానేరు డ్యాం వద్ద నిర్వహించిన లేజర్ షోలకు వేలాది మంది తరలివచ్చారు. ఆ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చూస్తే.. కళోత్సవాల వేడుకలకు రోజుకు కనీసం 20 వేల మందికిపైగా హాజరవుతారని భావిస్తున్నారు. ఆ మేరకు.. అంటే వచ్చిన ప్రతి ఒక్కరూ కూర్చొని వేడుకలను కనులారా వీక్షించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచన మేరకు జిలా యంత్రాగం నిర్ణయం తీసుకున్నది. వర్షం వచ్చినా.. వీక్షకులకు, కళాకారుల ప్రదర్శనకు అడ్డంకులు లేకుండా ఈ ఏర్పాట్లు ఉంటాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఏ రోజు ఏ కార్యక్రమాలుంటాయో వాటి వివరాలను ముందుగానే వెల్లండిచే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
ప్రజలకు వినోదం కోసమే వేడుకలు
కరీంనగర్ కళలకు ప్రసిద్ది. అలాగే, నిత్యం ఏదో ఒక పనితో ఒత్తిడికి లోనయ్యే ప్రజలు, పుస్తకాలతో కుస్తీ పడే చిన్నారులు సెలవు రోజుల్లో వినోదాన్ని కోరుకుంటారు. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఎప్పుడూ నిర్వహించని రీతిలో కళోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించాం. వేడుకలకు హాజరయ్యే ప్రజల కోసం కనుల విందుగా ఉండే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. సెలవురోజుల్లో జరిగే ఈ వేడుకలు అత్యంత వినోదాన్ని ఇవ్వడమే కాదు. సంతృప్తినిస్తాయని భావిస్తున్నాం. కాబట్టి.. ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా.
-మంత్రి గంగుల కమలాకర్