తెలంగాణ రాకముందు కరీంనగర్ శివారులోని హౌసింగ్‌బోర్డు కాలనీకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి.. ఇక వానకాలమైతే ఆటో కూడా అటువైపు కిరాయికి వచ్చేది కాదు.. పూర్తిగా గుంతల రోడ్లు, బురదమయం.. కనీసం తాగునీరు సైతం అందుబాటులో లేని దుస్థితి.. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఎక్కడి మురికినీరు అక్కడే నిలిచికుంటలను తలపించేది. ఫలితంగా కాలనీ ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. అప్పటి అధికారులకు విన్నవించినా సమస్యలు పరిష్కారం కాలేదు. కానీ, ఇప్పుడు ఎటు చూసినా విశాలమైన సీసీ రోడ్లు.. ఇరువైపులా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ఫుట్‌పాత్‌లు.. కాలనీవాసులు సేదతీరేందుకు అందమైన పార్కులు.. వ్యాయామం చేసుకునేందుకు ఓపెన్ జిమ్‌లు.. రాత్రయితే జిగేల్మనేలా ఎల్ఈడీ వెలుగులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈ కాలనీని ‘స్మార్ట్’గా మార్చాయి. అన్ని రకాలుగా ప్రగతిబాట పట్టిన ఈ కాలనీ ఇప్పుడు కరీంనగరానికే మోడల్‌గా నిలిచింది.
కార్పొరేషన్, సెప్టెంబర్ 7 : ఒకప్పుడు అధ్వానంగా ఉండే కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని హౌసింగ్‌బోర్డుకాలనీ ప్రస్తుతం అభివృద్ధిలో నగరానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నది. స్మార్ట్‌సిటీ కింద కాలనీని ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టి ప్రధాన రోడ్లతోపాటు, అన్ని వీధుల్లోనూ సీసీ రోడ్లు, ఇరువైపులా అండర్ డ్రైనేజీ పనులు చేపట్టారు. ప్రస్తుతం 85 శాతానికి పైగా రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. గతంలో గుంతలు, మురికి కుంటలు, చెత్తా చెదారంతో కనిపించిన కాలనీ ఇప్పుడు విశాలమైన రోడ్లు, ఇరువైపులా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, చెత్త కోసం డస్ట్బిన్లు ఏర్పాటు చేయడంతో సర్వాంగ సుందరంగా కనిపిస్తున్నది.
రూ.53 కోట్లతో పనులు
ఈ కాలనీలో స్మార్ట్‌సిటీ కింద రూ.53 కోట్లతో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టారు. మాస్టర్ ప్లాన్ మేరకు రోడ్లను విస్తరించి పూర్తిస్థాయిలో సీసీ రోడ్లుగా మార్చారు. సీఎం అస్యూరెన్స్ కింద రూ.2.50 కోట్లతో కాలనీ ప్రధాన రహదారిని నిర్మించారు. ముఖ్యంగా భూగర్భ డ్రైనేజీల పనులను పూర్తి చేయడంతోపాటు ప్రతి ఇంటికీ కనెక్షన్ అందించారు. రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీలను పూర్తి అండర్ గ్రౌండ్ చేయడంతోపాటు వాటిపై పుట్‌పాత్ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే పనులు దాదాపుగా పూర్తి కాగా.. అక్కడక్కడ ఫుట్‌పాత్ పనులు చేయాల్సి ఉన్నది.
పార్కులు, ఓపెన్ జిమ్స్
కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు స్థానిక ప్రజల ఆరోగ్యం, ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. ఓపెన్ జిమ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే రూ.30 లక్షలతో రెండు పార్కులు అభివృద్ధి చేయగా.. రూ.15 లక్షలతో ఓపెన్ జిమ్స్తోపాటు వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇటీవలే స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మరో పార్కును సుందరంగా తీర్చిదిద్దగా, మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అలాగే, క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.
రోడ్లన్నీ అందంగా మారినయ్..
గతంలో వర్షం పడితే బురద రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. కనీసం బైక్‌పై కూడా వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. కానీ, ఇప్పుడు రోడ్లన్నింటినీ సీసీలు మార్చి, అందంగా తీర్చిదిద్దారు. రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది రావడం లేదు. ఎంత భారీ వర్షం పడినా ఎక్కడా నీళ్లు నిలుస్తలేవు. ఇంత తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో కాలనీ అభివృద్ధి సాధిస్తుందని అనుకోలేదు.
– గిరి, ఉద్యోగి
త్వరలోనే 24 గంటల నీటి సరఫరా
గతంలో హౌసింగ్‌బోర్డుకాలనీలో మంచినీటి సరఫరా సక్రమంగా లేక 10 ప్రాంతాల్లో రిజర్వాయర్ నుంచి నేరుగా పబ్లిక్ నల్లాను ఏర్పాటు చేసి ప్రజలకు అందించారు. కానీ, ఇప్పుడు కాలనీలో నగరంలోనే అందరి కంటే ముందుగా 24 గంటల మంచినీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్తగా రెండు రిజర్వాయర్లను నిర్మించడమే కాకుండా ఇప్పటికే ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ను అందించి ప్రతి రోజూ మంచినీటి సరఫరా చేస్తున్నారు. నగరంలో చేపడుతున్న 24 గంటల మంచినీటి సరఫరా ప్రాజెక్టులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా ఈ కాలనీని ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తి కాగా, త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు.
ఈస్థాయి అభివృద్ధిని ఊహించలేదు
ఈ కాలనీ ఒకేసారి ఇంత అభివృద్ధికి నోచుకుంటుందని ఊహించలేదు. గతంలో ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు మా సమస్యలను విన్నవించాం. అడపా దడపా రెండు మూడు రోడ్లు, డ్రైనేజీలకు పనులు చేపడుతున్నట్లు చేసేవారు. కానీ, ఎక్కడా పూర్తిస్థాయిలో అభివృద్ధికి చర్యలు తీసుకోలేదు. కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కాలనీ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. మంచినీటి పైపులైన్లు, సీసీ రోడ్లు వేయడం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు నిర్మించడం సంతోషంగా ఉంది.
– వీరేశం, రిటైర్డ్ ఉద్యోగి
ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధి
నిజంగానే హౌసింగ్‌బోర్డు కాలనీ ఈ ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించింది. గతంలో ఒక్క సీసీ రోడ్డు కూడా లేదు. ఇప్పుడు అన్నీ సీసీ రోడ్లుగా మారాయి. గతంలో డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు ఇంటి పక్కనే నిలిచి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. దోమల వల్ల జ్వరాల బారిన పడేది. కానీ, ఇప్పుడు పూర్తిగా డ్రైనేజీ అండర్‌గ్రౌండ్‌గా మారింది. దీంతో దోమల సమస్య తగ్గింది. గతంలో కాలనీకి ఆటోలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలనీలో ఇళ్లు, జాగలకు రేటు పెరిగింది.
– వీ వెంకట్‌రెడ్డి
సమస్యలు తీరుతున్నయ్
గతంలో ఎన్నో సమస్యలతో సతమతమయ్యాం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వచ్చే నాయకులకు విన్నవించాం. కానీ, ఎప్పుడూ అరకొర పనులు జరిగేవి. కానీ, ఈసారి మాత్రం అధికంగా నిధులు కేటాయించి వేగంగా పనులు చేపడుతున్నారు. కాలనీలోని ప్రధాన రహదారులను మాస్టర్ ప్లాన్ మేరకు విస్తరించి అభివృద్ధి చేశారు. ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఓపెన్ జిమ్ ఎంతో మందికి ఉపయోగపడుతున్నది. ఇంకా కొన్ని రోడ్లు, డ్రైనేజీ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.
– భాస్కర్, కాలనీ కమిటీ డైరెక్టర్