Harish Rao | మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన భారీ రోడ్ షోకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు హరీష్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ పాలనపై, రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది.. బొగ్గును పాలతో కడిగితే తెలుపు రాదు. అలాగే రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా ఆయన బుద్ధి మారలేదు, భాష మారలేదు. హార్వర్డ్ కు వెళ్లి అక్కడి పరువు తీశాడన్నారు హరీష్ రావు. నా ఎత్తు గురించి, కేటీఆర్ ఇంగ్లీష్ గురించి, పేగులు-లాగులు అంటూ మాట్లాడితే.. అవ్వాతాతల కడుపు నిండుతుందా..? నీ బూతులతో పేదోడి ఆకలి తీరుతుందా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మామూలోడు కాదు.. ఏకంగా దేవుళ్లనే మోసం చేశాడు. పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని ఏడుపాయల అమ్మవారి మీద, మెదక్ చర్చి ఏసుప్రభువు మీద ఒట్టేసి మాట తప్పాడు. దేవుళ్లనే మోసం చేసిన పాపాత్ముడు కాబట్టే.. అమ్మవారి కోపానికి భయపడి ఈ రోజు మెదక్ జిల్లాకు రావడానికి ముఖం చాటేశాడు.
ఈ రెండున్నరేళ్లలో ఏ ఒక్కటైనా అమలు చేశారా..?
కరీంనగర్, వరంగల్ పోయిండు కానీ మెదక్ రాలేకపోయాడు. రావయ్యా రేవంత్ రెడ్డి.. పోలీసులు లేకుండా రామాయంపేట చౌరస్తాకు రా. ఎవరికి రుణమాఫీ అయ్యిందో, ఎవరికి కాలేదో ఇక్కడే తేల్చుకుందాం. నేను ఒక్కడినే వస్తా.. నువ్వు ఒక్కడివే రా..సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించి ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారు. ఈ రెండున్నరేళ్లలో ఏ ఒక్కటైనా అమలు చేశారా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. అవ్వతాతలకు రూ. 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. ఇచ్చారా..?ఆడబిడ్డలకు రూ. 2500, తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చారా..? రైతుబంధుకు ఎసరు పెట్టారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, కేసీఆర్ కిట్.. అన్నీ బంద్ పెట్టారు. రామాయంపేట అభివృద్ధి జరిగింది కేసీఆర్ హయాంలోనే.
రామాయంపేటకు డిగ్రీ కాలేజీ ఇచ్చింది కేసీఆర్ కాదా..? ఆర్డీవో ఆఫీస్ తెచ్చింది కేసీఆర్ కాదా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. రోడ్లు బాగు చేసి, ఇక్కడి భూముల విలువ పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం..కాంగ్రెస్ వచ్చి రెండున్నరేళ్లయింది.. రామాయంపేటలో ఒక్క రూపాయి పని చేశారా..?కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ కు చెప్పినా యూరియా బస్తాలు ఇంటికి వచ్చేవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక యూరియా దొరకడమే గగనమైంది. అప్పుడు 24 గంటల కరెంట్ ఉంటే.. ఇప్పుడు 12 గంటలు కూడా సక్కగా ఇస్తలేరు.రామాయంపేటకు గుండాగిరి చేసే వాళ్లు కావాలా..? ప్రజలకు సేవ చేసే నాయకులు కావాలా..? ఆలోచించుకోండి. మా కార్యకర్తలకు నేను అండగా ఉంటా. వాళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు. మర్యాదకు మర్యాద.. దేనికైనా సిద్ధం.. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో..? నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. గుర్తుపెట్టుకో అని హరీష్ రావు కాంగ్రెస్ నాయకులను హరీష్ రావు హెచ్చరించారు.
రామాయంపేటలో కారు గుర్తు మీద మీరు గుద్దే గుద్దుకు.. జూబ్లీహిల్స్ లో కూర్చున్న రేవంత్ రెడ్డికి గువ్వ పలగాలి. అప్పుడే కాంగ్రెస్ కు బుద్ధి వస్తుంది. రామాయంపేట అభివృద్ధి ఆగకూడదంటే కారు గుర్తుకే ఓటేయండి.

కాంగ్రెస్ పాలనలో అన్నీ అరాచకాలే : ఎంపీ వద్ది
Age Gap | భార్యా భర్తల మధ్య వయస్సు తేడా అసలు ఎంత ఉంటే మంచిది.?రాజు రవిచంద్ర
Harish Rao | ఒక్కరోజే 15 కార్నర్ మీటింగ్స్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు రికార్డ్..!