రూ. 615 కోట్లతో అభివృద్ధి పనులు
కార్పొరేషన్, మార్చి 12: కరీంనగర్ కొత్తరూపు సంతరించుకోనున్నది. రూ.615 కోట్లతో చేపట్టనున్న పనులతో సరికొత్త హంగులు అద్దుకోనున్నది. ట్రాఫిక్ చిక్కులకు చెక్ పడనున్నది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరదనీటి బాధ తప్పనున్నది. అందుబాటులోకి రానున్న డంప్‌యార్డుతో కాలుష్యం నుంచి విముక్తిలభించనున్నది. పోటీ పరీక్షల నేపథ్యంలో గ్రంథాలయం అన్ని హంగులతో ముస్తాబవుతున్నది. 24 గంటల నీటి సరఫరాకు నగర జనులకు తాగునీటి గోస తప్పనున్నది. ఈ నెల 17న మంత్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
దివ్యాంగులకు ప్రత్యేక పార్కు
రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక పార్కును అభివృద్ధ్ది చేయనున్నారు. ఇందులో గ్రీనరీతో పాటుగా, ఇతర ఆట వస్తువులు, యోగా సెంటర్లు, తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.
రూ. 2 కోట్లతో వెండింగ్ జోన్స్
వీధివ్యాపారాల నిర్వహణకు 5 ప్రాంతాల్లో వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న జోన్స్‌కు తోడుగా మరో 5 వెండింగ్ జోన్స్‌ను అభివృద్ది చేయనున్నారు. దీంతో నగరంలో ఎక్కడ రోడ్లపై అమ్మకాలు సాగకుండా చేయడంతో పాటుగా ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయి.
రూ. 90 కోట్లతో స్మార్ట్‌రోడ్లు
స్మార్ట్‌సిటీ కింద నగరంలో రూ. 258 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. పనులు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు రూ. 90 కోట్లతో నగరంలోని నిత్యం రద్దీగా ఉండే రోడ్లను ఎంపిక చేసి స్మార్ట్ రహదారులుగా తీర్చిదిద్దనున్నారు. ఇరువైపులా డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు నిర్మించనున్నారు.
24 గంటల మంచినీటి సరఫరా
ప్రస్తుతం అర్బన్ మిషన్ భగీరథ కింద అన్ని డివిజన్లలో నిత్యం నీటిని అందిస్తున్నారు. అయితే 24 గంటలు నీరందించాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టు కింద రూ. 50కోట్లతో రాంపూర్, భగత్‌నగర్, హౌసింగ్‌బోర్డు కాలనీ రిజర్వాయర్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో 24 గంటల నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆయాచోట్ల పూర్తిస్థాయిలో హెచ్డీ పైపులైన్లు వేయడంతో పాటు తగినంత ప్రెషర్‌తో నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు.
చౌరస్తాల సుందరీకరణ
నగరంలోని ప్రధాన చౌరస్తాను సుందరీకరణ చేయనున్నారు. ఇప్పటికే కోర్టు, మంచిర్యాల చౌరస్తాలను అభివృద్ధి చేశారు. మిగిలిన వాటి సుందరీకరణకు రూ. 7కోట్లు కేటాయించారు. తెలంగాణ చౌక్ చౌరస్తా సుందరీకరణకు రూ. కోటి ఖర్చుపెట్టనున్నారు. ముఖ్యంగా నగరంలో సంస్కృతీసంప్రదాయాలు, భారతీయ చరిత్ర వ్యక్తం చేసేలా ఈ చౌరస్తాలను రూపొందించే దిశగా చర్యలు చేపడతారు.
మల్టీపర్పస్ స్కూల్ పార్కు అభివృద్ధి
నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో నగరం మధ్యలో మల్టీపర్పస్ స్కూల్, ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్మార్ట్‌సిటీ నిధులతో పార్కును నిర్మిస్తున్నారు. రూ.5.50 కోట్లతో ఇందులో ఓపెన్ థియేటర్‌తో పాటుగా, సుందరమైన ఫౌంటేన్లు, వాకింగ్‌ట్రాక్‌లు నిర్మిస్తున్నారు.
రూ. 9 కోట్లతో డిజిటల్ లైబ్రరీ
ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ స్థలంలో రూ.7 కోట్లతో మూడంతస్తుల్లో డిజిటల్ లైబ్రరీని నిర్మిస్తున్నారు. ఇందులో అధునాతన సౌ కర్యాల కోసం రూ.2కోట్లు కేటాయించారు. కంప్యూటర్లు, ఇతర వసతులు కల్పించనున్నారు.
సకల హంగులతో సమీకృత మార్కెట్లు నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పట్టణ ప్రగతి నిధులు రూ.23 కోట్లతో మార్కెట్ కమిటీ, మార్కెట్ రోడ్డులో సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నారు. వీటితో పాటుగా కశ్మీర్‌గడ్డ, పద్మనగర్లోనూ రూ. 10 కోట్ల చొప్పున నిధులు కేటాయించి సమీకృత మార్కెట్లను నిర్మించనున్నారు. వీటిల్లో పండ్లు, కూరగాయాల, మటన్, చికెన్, చేపల, పూలు ఒకేచోట అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
డంప్‌యార్డులో బయోమైనింగ్
రాజీవ్ రహదారి బైపాస్‌లో ఎనిమిది ఎకరాల్లో విస్తరించి ఉన్న డంప్‌యార్డులోని చెత్తను బయో మైనింగ్ విధానంలో ఏడాదిన్నరలోనే క్లీన్ చేయనున్నారు. ఇందుకు అధునాతన యంత్రాలను వినియోగించనున్నారు. ఈ పనుల కోసం రూ. 16.14 కోట్లు కేటాయించారు. ఇప్పటికే టెండర్లు పూర్తి చేశారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
స్కూళ్లలో ఈ లెర్నింగ్ ..
మన ఊరు/ మనబస్తీ- మన బడిలో భాగంగా స్కూళ్ల లో సకల సౌకర్యాలు కల్పించనున్నది. ఇందులో భాగంగా నగరంలోని 25 ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 7 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. డిజిటల్ బోధన కోసం రూ.11 కోట్లతో సాంకేతిక పరికరాలు, తగరతి గదులను తీర్చిదిద్దనున్నారు.
సీఎన్డీ వేస్ట్ రీసైక్లింగ్
నగరంలో వివిధ ప్రాంతాల్లో వెలువడుతున్న నిర్మాణ సామగ్రి, ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు రూ. 5 కోట్లతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో నిర్మాణ వేస్ట్, ఘన వ్యర్థాలను నగరపాలక సంస్థ ద్వారానే తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇలా వస్తున్న వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వేయకుండా ఈ ప్లాంట్ లో రీసైకింగ్ చేసి తిరిగి వినియోగిస్తారు.
సిటీ గవర్నరెన్స్
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, డాటా ట్రాన్స్ఫారింగ్కు అనుగుణంగా నగర ప్రజలకు సౌకర్యాలు కల్పించనున్నారు. ముఖ్య ప్రాంతాల్లో రూ.5 కోట్లతో ఐటీ స్మార్ట్ టవర్స్, వై ఫై టవర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఆయా మొబైల్ కంపెనీలు పూర్తిస్థాయిలో సేవలందించే అవకాశం ఉంటుంది. అధికారులకు సైతం సులభంగా పాలనా కార్యకలపాలు నిర్వహణకు వీలుంటుంది. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
రూ.113 కోట్లతో అభివృద్ధి పనులు
నగరంలోని సవరన్ స్ట్రీట్‌లోని బాల సదన్ అంగన్వాడీ కేంద్రాన్ని రూ. 2 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో డిజిటల్ తెర, పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపడతారు. రూ. 2 కోట్లతో నగరంలో పలు రోడ్లపై జీబ్రా లైనింగ్స్ ఏర్పాటు చేయనున్నారు. రూ. 7 కోట్లతో ఇంకుడు గుంతలు నిర్మించనున్నారు. సుందరీకరించిన మంకమ్మతోట రాజీవ్ పార్కులో రూ. కోటి వెచ్చించి మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దినున్నారు. అంబేద్కర్ స్టేడియంలో రూ.8 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రూ.2 కోట్లతో ఐటీసీ కంప్యాట్ సెంటర్ ఏర్పాటు, రూ.5 కోట్లతో మల్టీపర్పస్ స్కూల్ భవనాన్ని హెరిటేజ్ భవనంగా తీర్చిదిద్దనున్నారు.
నగరంపై నిఘా నేత్రం..
నగర భద్రతకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. రూ. 23 కోట్లతో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. నిరంతర పర్యవేక్షణకు రూ. 12.50 కోట్లతో పాత పవర్‌హౌస్ ప్రాంతంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తారు. ఇందులో ఆధునిక సాంకేతికత డాటా సెంటర్, ఐటీ కంప్యాట్స్ వంటి పరికరాల ఏర్పాటుకు రూ. 26 కోట్లు వెచ్చించనున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అన్ని ప్రధాన చౌరస్తాలో రూ.23 కోట్లతో పూర్తిస్థాయిలో ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నిల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఇబ్బందులు ఎదురైన సందర్భాల్లో కమాండ్ కంట్రోల్ సిస్టంనుంచి అపరేట్చేస్తారు.
వరద నీటి సమస్యకు చెక్
వరదనీటి సమస్య పరిష్కారానికి స్మార్ట్‌సిటీ కింద రూ.133 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నగరంలో ప్రధాన మురుగునీటి కాల్వను విస్తరిస్తున్నారు. గత వానకాలంలో వరదనీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించి నీళ్ల తరలింపునకు కొత్త డ్రైనేజీలను నిర్మించనున్నారు. అలాగే మానేరు డ్యాం సీవరేజ్ నీటి సమస్యను తీర్చేందుకు ప్రత్యేక కాలువను నిర్మించనున్నారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్
నగరంలో ప్రతిరోజు వెలువడుతున్న 140 మెట్రిక్ టన్నుల చెత్తను ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రూ.33కోట్లతో బల్దియా కేటాయించిన ప్రత్యేక స్థలంలో ఈ చెత్త క్లీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక యంత్రాలను, బయోమైనింగ్ పద్ధతులను వినియోగించనున్నారు. గతంలో మాదిరిలో చెత్తను పొగు చేసి డంప్ యార్డుగా మార్చకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కుగా తీర్చిదిద్దనున్నారు.
పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
నగరంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. రూ.7 కోట్లతో అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్లీనింగ్ ప్లాంట్లతో పాటు గా, ఎయిర్ క్వాలిటీ చెకింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నా రు. అలాగే విరివిగా మొక్కలు నాటి సంరక్షించనున్నారు.
మాడ్రన్ స్లాటర్ హౌస్ నిర్మాణం
ప్రస్తుతం రాజీవ్‌నగర్‌లో ఉన్న స్లాటర్ హౌస్‌లో సరిపడా సౌకర్యాలు లేవు. స్థానికులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. కాగా పూర్తిస్థాయిలో ఆధునిక పద్దతిలో మాడ్రన్ స్లాటర్ హౌస్‌ను నిర్మించనున్నారు. పూర్తిస్థాయి నీటి సదుపాయంతో పాటుగా జంతువుల వ్యర్థాలు ఎప్పటికప్పుడూ శుభ్రం చేసేలా చర్యలు చేపడుతున్నారు.
నగర రూపురేఖలు మారుతాయి..
ఇప్పటికే సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతున్నాం. స్మార్ట్‌సిటీ కింద పలు పనులు చేపట్టాం. ప్రతి పైసను సద్వినియోగం చేసుకుంటూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులతో నగర రూపురేఖలు మారిపోతాయి. కరీంనగర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది.
– గంగుల కమలాకర్, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి
గడువులోగా పనులు పూర్తి చేస్తాం
స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన పనులను గడువులోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండేండ్లలో రూ. 350 కోట్లు ఖర్చుచేసి అనేక అభివృద్ధి ప నులు చేపట్టినం. సకల సౌకర్యాలు కల్పిస్తుండడం తో నగరప్రజలు సంతోషంగా ఉన్నారు. వచ్చే రెం డేండ్లలో అభివృద్ధి పనులను పూర్తి చేసి నగరాన్ని అన్నింటా ముందు నిలుపుతం.ఈ దిశగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నం. – మేయర్ సునీల్‌రావు