జ్యోతినగర్(రామగుండం), ఆగస్టు 21: భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లి శివారులో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌తో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికీ కోట్లాది మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెరిగి వర్షాలు కురుస్తున్నాయన్నారు.
హరిత తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కను సంరక్షించుకోవాలన్నారు. ఇక్కడ స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ దీపక్‌కుమార్, రామగుండం నగరపాలక మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్, కమిషనర్ సుమన్‌రావు, 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీశ్‌కుమార్, మున్సిపల్ అధికారులు నారాయణరావు, చిన్నారావు, రవీందర్, తేజస్విని, మనోహర్, శంకర్రావు, అర్జున్, మోప్మా సిబంది ఉన్నారు.