వేములవాడ రాజన్న క్షేత్రం త్రివర్ణ శోభితమైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్తగా ముస్తాబైంది. వజ్రోత్సవాల్లో భాగంగా ఆలయ గోపురాలకు ప్రత్యేకంగా జాతీయ పతాక రంగులతో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నది.
– వేములవాడ టౌన్, ఆగస్టు 11
మువ్వన్నెల జెండా ఎగిరింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం ఫ్రీడం రన్ ఉత్సాహంగా సాగింది. వందలాది మంది జాతీయ పతాకాలు చేతబూని పరుగు తీయగా, దారి పొడవునా ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ దాకా జరిగిన రన్లో మంత్రి గంగుల పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. ఇక మానకొండూర్, ఎల్ఎండీ కాలనీలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్రెడ్డి పాల్గొని పరుగు తీశారు.
కరీంనగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. రోజుకో కార్యక్రమంతో దేశభక్తిని నింపుతున్నాయి. నాలుగో రోజు గురువారం నిర్వహించిన ఫ్రీడం రన్లో దేశభక్తి ఉప్పొంగింది. కరీంనగర్లో ‘భారత్ మాతాకీ జై అంటూ’ నగర వీధులు మార్మోగాయి. మంత్రి గంగుల కమలాకర్ పిలుపుతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం దేశభక్తిని పెంపొందించే విధంగా రన్లో పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్అండ్బీ గెస్టు హౌస్ మీదుగా ఆర్ట్స్ కళాశాల మైదానం దాకా జరిగిన ఈ రన్లోకి ముఖ్యఅతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన జనం మువ్వన్నెల జెండాలను చేతబూని ‘భారత్ మాతాకీ జై అంటూ’ కదం తొక్కారు. పలువురు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో పిల్లలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ రూపొందించిన 500 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకం ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆనాడు మహాత్మాగాంధీలాంటి సమరయోధులు అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెస్తే సీఎం కేసీఆర్ అదే మార్గంలో తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు. దేశ సమైక్యతా సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ నెల 15న ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ పతాకాలను ఆవిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 16న నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కాగా, ర్యాలీలో మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఇంటర్నేషనల్ శ్యాం బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరు ఆలపించిన ‘సారే జహాన్సే అచ్చా’ దేశభక్తి గీతం ఆద్యంతం ఆకట్టుకున్నది. ఇక మానకొండూర్తోపాటు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో నిర్వహించిన ఫ్రీడం రన్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. చొప్పదండిలో నిర్వహించిన రన్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో కూడా స్థానిక మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఫ్రీడం రన్ నిర్వహించారు. గన్నేరువరం, శంకరపట్నంలో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రీడం రన్ నిర్వహించారు. మొత్తానికి జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలు చేతబూని యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కదం తొక్కారు. దేశభక్తిని చాటేలా నినదించారు.