సిరిసిల్ల సాంచాలపై మువ్వన్నెల జెండా రూపుదిద్దుకుంటున్నది. కార్మిక క్షేత్రానికి జెండా పండుగ ముందే రాగా, ఏ ఇంట చూసినా త్రివర్ణ పతాకం దర్శనమిస్తున్నది. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రజల్లో దేశ భక్తిని ద్విగుణీకృతం చేసేలా.. మహనీయుల త్యాగాలు, పోరాటాలు, నేటి భవితకు తెలిసేలా ప్రతి ఇంటిపై మూడు రంగుల జెండాను ఎగుర వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునివ్వగా.. నేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో జెండాలు తయారు చేయించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం టెస్కోకు అప్పగించింది. ఇక్కడి మరమగ్గాల యజమానులకు 5 కోట్లతో కోటి 20లక్షల జెండాల తయారీ కోసం ఆర్డర్లు ఇచ్చింది. దేశంలోని 12 రాష్ర్టాలకు చెందిన ఆర్డర్లను సైతం ఇక్కడికే ఇవ్వగా.. కార్మికవాడల్లో సందడి నెలకొన్నది. కోటి జెండాల ఉత్పత్తితో నేతన్న నైపుణ్య కీర్తి మరోసారి దశదిశలా వ్యాపించింది.
రాజన్న సిరిసిల్ల, జూలై 28 (నమస్తే తెలంగాణ) : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు (8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు) పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 15కు ముందు 7 రోజులు, తర్వాత ఏడు రోజులు వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర వీరుల త్యాగాలు, వారి పోరాటాలను నేటి తరానికి తెలిసేలా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగుర వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.
ప్రతి ఇంటిపైనా ఎగుర వేసే జెండాను నేతన్నతో తయారీ చేయించి, వారి కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్య మంత్రి కేసీఆర్ టెస్కో సంస్థకు అప్పగించారు. గద్వాల, పోచంపల్లి, వరంగల్, నల్గొండ, భువనగిరి, నారాయణపేటలోని నేతన్నలకు జెండా వస్త్ర తయారీ ఆర్డర్లు ఇవ్వగా, 5కోట్ల విలువైన 50 లక్షల మీటర్లను సిరిసిల్ల నేతన్నల నుంచి కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన వస్ర్తాన్ని హైదరాబాద్‌లో ప్రాసెసింగ్ చేసి, మూడు రంగులు ముద్రించి, వాటిని కుట్టేందుకు తిరిగి సిరిసిల్లకు పంపించింది. 5 వేల సాంచాలపై నేసిన వస్ర్తాలను జెండాలుగా రూపొందించే పనిలో రెండు వేల మంది కార్మికులు తలమునకలయ్యారు.
వెల్లువలా ఆర్డర్లు..
సిరిసిల్ల నేత కార్మికులకు చేతి నిండా పనికల్పించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ వస్ర్తాల తయారీకి ఆర్డర్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం బతుకమ్మ చీరెలు తయారవుతుండగా, తాజాగా జెండాల తయారీ కోసం 5 కోట్ల విలువైన కోటీ 20 లక్షల జెండాలను తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యాన్ని చూసిన ఇతర రాష్ర్టాల్లోని వ్యాపారులు సైతం ఆర్డర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం 12 రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు ఆర్డర్లు ఇచ్చినట్లు ఇక్కడి స్క్రీన్ ప్రింటింగ్ వ్యాపారులు చెబుతున్నారు.
పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబంగా, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్ రాష్ర్టాల నుంచి సుమారు 10 కోట్ల విలువైన రెండున్నర కోట్ల జెండాల తయారీ ఆర్డర్లు వచ్చాయి. సిరిసిల్ల పట్టణంలోనే 20 మంది స్క్రీన్ ప్రింటింగ్ చేసే వ్యాపారులున్నారు. ఒక్కొక్కరి వద్ద 100 నుంచి 200 మంది పనిచేస్తున్నారు. టెస్కో సంస్థ సిరిసిల్లతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తయారు చేసిన ప్లేన్ వస్ర్తాన్ని కొనుగోలు చేస్తున్నది. హైదరాబాద్‌లో ప్రాసెసింగ్, మూడు రంగులను ముద్రించి తిరిగి జెండాలు కుట్టే అవకాశాన్ని ఆయా జిల్లాలకే కల్పించింది. అయితే, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన ఆర్డర్లు మాత్రం పూర్తి స్థాయిలో జెండా తయారు చేసి సరఫరా చేసేలా వచ్చాయి. వస్త్రం నేసి, మూడు రంగులతో ముద్రించి, జెండా కుట్టి ఇవ్వాలని ఆర్డర్లు వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. దీంతో చాలా మందికి ఉపాధి లభించింది. దీంతో సిరిసిల్లలోని ఏ గల్లీ లో చూసినా తిరంగా జెండా పండుగ వాతావరణం కనిపిస్తున్నది.
నేతన్నకు చేతి నిండాపని
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న ఆర్డర్లతో జెండాల తయారీలో సిరిసిల్ల కార్మికులు బీజీ అయ్యారు. 30 వేల పైచిలుకున్న సాంచాలలో 20 వేల సాంచాలపై బతుకమ్మ చీరలు తయారు చేస్తున్నారు. మరో 5 వేల సాంచాలపై జాతీయ జెండా వస్త్రం నేస్తున్నారు. దాదాపు వెయ్యి మంది కార్మికులతోపాటు మరో వెయ్యి మంది ఇతర వర్గాలకు చెందిన కార్మికులు ఉపాధి పొందుతున్నారు. కత్తిరించడం, కుట్టడం, ప్యాకింగ్ చేయడం వంటి పనిలో నిమగ్నమయ్యారు. కటింగ్ చేసే వారితో పాటు కుట్టు పనిలో మహిళలు 600 మంది ఉపాధి పొందుతున్నారు. చేతినిండా పనితో నెలకు 20వేలకుపైగా వస్తుండడంతో కార్మికులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంట్లో అందరం తయారు చేస్తున్నం
మరమగ్గాలపై రాత్ పైలీ చేసుకుంట, సగం పొద్దు జెండాలు కుడుతున్న. పదిహేను రోజుల సంది చేతినిండా పని దొరుకుతున్నది. జెండాలు కుట్టిన పైసలు చిల్లరకైతున్నయ్. ఇంట్లో అందరం కలిసి జెండాలు తయారు చేస్తున్నం.
– నరేశ్, మరమగ్గాల కార్మికుడు (సిరిసిల్ల)
జాతీయ స్థాయిలో కీర్తి
జెండాల తయారీతో సిరిసిల్లకు జాతీయ కీర్తి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతోపాటు దేశంలోని 12 రాష్ర్టాలకు సంబంధించి జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు సిరిసిల్లకే వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కో స్క్రీన్ ప్రింటర్ వ్యాపారి 10లక్షల నుంచి 50లక్షల దాకా ఆర్డర్లు పట్టుకున్నారు.
రోజు వెయ్యి తయారు చేస్తున్నం
మరమగ్గాలపై బతుకమ్మ చీరెలు నేస్తున్నం. ఇంట్లో వాళ్లంతా జెండాలు తయారు చేస్తున్నరు. రోజుకు వెయ్యి వరకు కుడుతున్నరు. పదిహేను రోజుల నుంచి మేమంతా ఇదే పనిజేత్తున్నం.
– చాంద్‌పాషా, సిరిసిల్ల
దేశ వ్యాప్తంగా ఇక్కడి నుంచే..
తెలంగాణ ప్రభుత్వం జెండాల తయారీ ఆర్డర్లు ఇవ్వడం వల్లే మిగిలిన రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నయ్. 50లక్షల విలువైన ఆర్డర్లు వచ్చినయ్. 200 మందికి ఉపాధి కల్పిస్తున్న. యువకులతో పాటు మహిళలకు చేతినిండా పనిదొరుకుతున్నది. 20 ఇంచుల ఎత్తు, 30 ఇంచుల పొడవు నుంచి మీటరు పొడవు సైజు గల జెండాలు తయారు చేస్తున్నం.
– ద్యావనపల్లి పండరి, జెండాల తయారీ దారు
చేతి నిండా పనుంది..
అప్పుడప్పులు నైటీలు, షర్టులు కుట్టుకునే మాకు జెండాల తయారీతో రోజంతా పని లభించింది. తిందామన్న తీరిక లేకుండా జెండాలు కుడుతున్నాం. ముఖ్య మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దయవల్ల ఇప్పటికే మా నేతన్నల జీవితాలకు భరోసా కలిగింది. చాలా సంతోషంగా ఉంది.
– వెల్దండి శైలజ, సిరిసిల్ల
సిరిసిల్లకే వస్తున్నయ్..
మంత్రి కేటీఆర్ చొరవతో అన్ని వస్ర్తాల తయారీ ఆర్డర్లు ఇక్కడికే వస్తున్నయ్. బీడీలు బందుండడం వల్ల ఏ పనిలేక ఇబ్బంది పడుతున్న మాకు జెండాల పండుగొచ్చింది. చేతి నిండా పని కలిగింది. జాతీయ జెండాల తయారీతో దేశంలోనే సిరిసిల్లకు పేరు వస్తుందంటే అది రామన్న వల్లనే.
– కోట అనిత, సిరిసిల్ల
బీడీలు బందువెట్టి కుడుతున్న..
బీడీలకన్నా జెండాల తయారీతోనే ఎక్కువ కూలీ వస్తంది. బీడీలు బందువెట్టి వీటినే కుడుతున్న. కేసీఆర్ సార్ దయవల్ల మా నేతన్నలకు చేతి నిండా పని దొరికినందుకు సంతోషంగా ఉంది.
– అనిత, బీడీ కార్మికురాలు (సిరిసిల్ల)
రాష్ట్ర సర్కారు కృషితోనే ఆర్డర్లు..
తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడంతో దేశంలోని మిగతా 12 రాష్ర్టాల నుంచి మాకు ఆర్డర్లు వచ్చినయ్. నేను 600 మందికి ఉపాధి కల్పిస్తున్న. నేనొక్కడినే కాదు జిల్లా కేంద్రంలో 20 మంది స్క్రీన్ ప్రింటర్లు, 2వేల మంది కార్మికులు తయారీలో రేయింబవళ్లు శ్రమిస్తున్నరు. చేతినిండా పనిదొరుకుతున్నది. చాలా సంతోషంగా ఉన్నది.
– ద్యావనపల్లి మురళి, జెండాల తయారీ దారు