రాయికల్ రూరల్, జూలై 16: వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నష్ట పోయిన బాధితులను ఓదారుస్తూ, మేమున్నానని భరోసా కల్పిస్తున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ. శనివారం రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బైక్‌పై పర్యటించారు. బోర్నపెల్లి వద్ద గల గోదావరి ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. కట్కాపూర్‌లో కూలిన కల్వర్టును పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీనిచ్చారు.
బోర్నపెల్లి, చింతలూరులో వర్షాలకు ఇండ్లు కూలిన బాధితులను పరామర్శిస్తూ ప్రభుత్వం మంజూరు చేసిన తక్షణ సహాయాన్ని అందజేశారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న మౌనిక కుటుంబ సభ్యులకు రూ.30వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరదలతో నష్టపోయిన వారు అధైర్యపడొద్దని, ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని చెప్పారు.
మండలంలో ఇండ్లు కూలిపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాయికల్ మండలానికి మొదటిసారిగా వచ్చిన ఎమ్మెల్సీ రమణకు మొక్కను అందజేసి శాలువాలతో సత్కరించారు. ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి, జడ్పీటీసీ జాదవ్ అశ్విని, ఏఎంసీ చైర్మన్ గన్నె రాజారెడ్డి, వైస్ చైర్మన్ కొల్లూరి వేణు, టీఆర్ఎస్ రాయికల్ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్, సర్పంచులు పాదం లతారాజు, అనుపురం శ్రీనివాస్, ముద్దసాని రాజమౌళి, దొంతి నాగరాజు, ఈదుల్ల లక్ష్మణ్, ఎంపీటీసీ ఓరుగంటి మోహన్ రావు, నాయకులు తలారి రాజేశ్, రాగి శ్రీనివాస్ పాల్గొన్నారు.