Praja Palana | తిమ్మాపూర్, జూన్16: ప్రజా పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలో పలువాడల్లో బోర్లు పోయడం లేదు, భగీరథ నీళ్లు రోజూ రావడంలేదు. కరీంనగర్ తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో ఎస్సీ కాలనీతో పాటు అనుబంధ గ్రామమైన సంగంపల్లిలో రెండు బోర్లు ఏడాదికాలంగా మూలకు పడిపోయాయి. మరమ్మతులకు గురైన వాటిని చూసే నాథుడు లేడని ప్రజలు వాపోతున్నారు.
పాడైన వాటిని బాగు చేయించమని పంచాయతీ కార్యదర్శి వద్దకు వెళ్తే నిధులు లేవని భగీరథ నీళ్లు వచ్చినప్పుడే పట్టుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నట్లు వాపోతున్నారు. దీంతో చేసేదేం లేక నల్ల నీళ్లు వచ్చినప్పుడు పట్టుకోవడం, లేదంటే ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. మాజీ సర్పంచ్ మెంగాని రమేష్ అధికారుల వద్దకు సమస్యను తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని అన్నారు. అధికారులు స్పందించి రెండు వీధుల ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.