అత్యాధునిక వైద్య పరికరాలు.. ఆపరేషన్ థియేటర్లు.. అపార అనుభవమున్న వైద్య బృందంతో కార్పొరేట్‌కు దీటుగా సేవలందిస్తున్న కరీంనగర్ జిల్లా దవాఖాన, మోకీలు మార్పిడి చికిత్సకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. పేద, మధ్యతరగతి వర్గాలకు పెనుభారంగా మారిన వైద్యాన్ని రాష్ట్ర సర్కారు రెండేళ్ల క్రితమే అందుబాటులోకి తీసుకురాగా, వైద్య బృందం విజయవంతంగా చికిత్స అందిస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ కింద ఇప్పటివరకు 15 మందికి ఆపరేషన్లు చేస్తూ ఆర్థిక భారం తప్పిస్తున్నది. ఇటీవలే మరో ఇద్దరికి మార్పిడి చేసి, తాజాగా డిశ్చార్జి చేసి ఇంటికి పంపించగా, పేద, మధ్యతరగతి కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– విద్యానగర్, జూలై 10
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బెదుగం సత్యనారాయణ. ఊరు జమ్మికుంట మండలం రామన్నపల్లె. వయస్సు 68 ఏండ్లు. ఆయన ఆరేండ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. పలు ప్రైవేటు దవాఖానల్లో వైద్య చికిత్సలు చేయించుకున్నా నయం కాలేదు. శస్త్రచికిత్స చేయించుకోవాలని, అందుకు 3లక్షల దాకా ఖర్చవుతుందని చెప్పడంతో అంతస్థోమత లేక ఇంటి వద్దే కాలం వెల్లదీస్తూ వచ్చాడు. అయితే కరీంనగర్ జిల్లా దవాఖానలో మోకీలు మార్పిడి ఉచితంగా చేస్తున్నారని తెలుసుకొని ఇటీవలే వచ్చి వైద్యులను సంప్రదించాడు. ఈ నెల 6న వైద్యులు సర్జరీ చేశారు. శస్త్రచికిత్స విజయవంతంకాగా, సోమవారం అతడిని నడిపించారు. నయాపైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్ చేసిన వైద్యులు, ఇన్ని వసతులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు.
విద్యానగర్, జూలై 10: నాటి పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన దవాఖానలు.. స్వరాష్ట్రంలో అపర సంజీవనిగా మారాయి. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తూ భరోసానిస్తున్నాయి. అందుకు కరీంనగర్ జిల్లా ప్రధాన దవాఖానే నిదర్శనంగా నిలుస్తున్నది. రాష్ట్ర సర్కారు చొరవతో అధునాతన వసతులు సమకూర్చుకొని కార్పొరేట్‌కు దీటుగా వైద్యం అందిస్తున్నది. ఓ వైపు ప్రసూతి సేవల్లో దూసుకెళ్తూనే, మరోవైపు అధునిక మోకీలు మార్పిడి చికిత్సను పూర్తి ఉచితంగా అందిస్తున్నది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వైద్య సేవలు పొందలేని పేద, మధ్య తరగతి వారికి రెండేళ్లుగా విజయవంతంగా మోకీలు మార్పిడి చేస్తున్నది. మోకీలు మార్పిడి చికిత్సకు ప్రైవేట్ అయితే 3లక్షల దాకా అవుతుంది. కానీ, ఇక్కడరూపాయి ఖర్చు లేకుం డా పూర్తి ఉచితంగా.. ఆరోగ్య శ్రీ పథకం కింద అందిస్తున్నది. ఇప్పటివరకు 15 మంది కి ఆపరేషన్లు చేసి స్వాంతన కలిగించింది.
ఉచితంగా చికిత్సలు
కరీంనగర్ జిల్లా దవాఖానలో మోకీలు మార్పిడి చికిత్సకు ఎంతో ఆదరణ వస్తున్నది. స్థానికంగానే కాదు వివిధ జిల్లాల నుంచి రోగు లు తరలివస్తూ చికిత్స తీసుకుంటున్నారు. ప్రధానంగా ఆర్థోసర్జన్లు నారగోని కుమార్‌గౌడ్, వీరారెడ్డి, ధన్‌రాజ్, వంశీ, ప్రదీప్, సీనియర్ రెసిడెం ట్స్ డా.ఆదిత్య సమీర్, అనస్థీషియా శంతన్‌కుమార్, చంద్రశేఖర్, సుఘాత్రి, అశోక్, పల్మనాలజీ విభాగానికి చెందిన సాయిని నరేందర్, సర్జన్లు శాలిని, కుమారస్వామి, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ ఉదయ ఆదిత్య సేవలందిస్తున్నారు. వా రానికి ఇద్దరు, ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. అంటే ఇప్పటివరకు వందలాది మందికి ఆపరేషన్లు చేసి ఏండ్లనాటి వ్యథను తీర్చారు. తాజా గా సత్యనారాయణ, రమాదేవి అనే ఇద్దరు వృ ద్ధులకు ఆపరేషన్ చేసి, సోమవారం సాయం త్రం డిశ్చార్జి చేశారు. వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ కృష్ణప్రసాద్ అభినందనలు తెలిపారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆమె పేరు మెంగని రమాదేవి. ఊరు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్‌ఖాన్‌పేట. ఆమె వయసు 60 ఏండ్లు. మోకీలు అరిగి మూడేండ్లుగా నడవలేకపోతున్నది. ఎన్నో ప్రైవేటు దవాఖానలు తిరిగింది. చికిత్స కోసం 2లక్షల దాకా ఖర్చు చేసింది. అయినా సమస్య తగ్గకపోగా, మరింత పెరిగింది. కరీంనగర్ జిల్లా దవాఖానలో ఉచిత మోకీలు మార్పిడి చేస్తున్న విషయం తెలుసుకొని వచ్చి పదిరోజుల క్రితం వైద్యులను సంప్రదించింది. పరీక్షలు చేసిన వైద్యులు గత సోమవారం మోకీలు మార్పిడి చేశారు. ప్రస్తుతం ఆమె ఎలాంటి ఇబ్బదులు లేకుండా నడవగలుదుతున్నది.
బతికున్నన్ని రోజులు రుణపడుత
ఎవుసం చేసుకుని బతికే నాకు ఆరేండ్ల సంది మోకాళ్ల నొప్పులు మొదలైనయి. ప్రైవేటుకు పోయి వేలకు వేలు ఖర్చు పెట్టి చూపించుకున్నా నొప్పులు తగ్గలే. మరింత ఎక్కువైనయి. కరీంనగర్ పెద్ద దవాఖానలో ఉచితంగా మోకీలు మార్చుతున్నారని తెల్సుకుని వచ్చిన. డాక్టర్లు పరీక్షలు చేసిన్రు. ఈ నెల ఆరో తేదీనే ఆపరేషన్ చేసిన్రు. ఇప్పుడు నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్న. లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఫ్రీగా చేయించిన సీఎం కేసీఆర్‌కు నేను, నాకుటుంబం బతికున్న కాలం రుణపడి ఉంటం.
– బెదుగం సత్యనారాయణ, రైతు, రామన్నపల్లి (జమ్మికుంట మండలం)
లక్షలు ఖర్చు చేసినా నయం కాలె
మూడేండ్ల సంది మోకాళ్ల నొప్పులతో నరకం చూత్తున్న. చాలా ప్రైవేట్ దవాఖానలు తిరిగిన. 2లక్షలకు పైగా ఖర్చు చేసిన. ఎక్కడ కూడా తగ్గలేదు. గవర్నమెంట్ దవాఖానలో ఫ్రీగా చికిత్స చేస్తరని తెలుసుకొని వచ్చిన. మొన్ననే ఆపరేషన్ చేసిండ్లు, మూడు రోజులు పరీక్షించిండ్లు. తర్వాత డిశ్చార్జి చేసిన్రు. ఇప్పుడు నేను ఏ ఆధారం లేకుండా నడుస్తున్నా. చాలా సంతోషంగ ఉంది.
– మెంగని రమాదేవి, కమ్మర్‌ఖాన్‌పేట (పెద్దపల్లి జిల్లా)