కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 17 : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కొత్త ఓటర్ల నమోదుకోసం ఏప్రిల్ 15 వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏండ్లు నిండి, ఇప్పటివరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అలాగే, ఓటరు జాబితాలో తప్పొప్పులు సరిచేసుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రస్తుతం నివాసమున్న చోట ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.
ప్రతి మూడు నెలలకొకసారి ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెల ఒకటో తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వారంతా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన తుది జాబితాలో తమ పేర్లు లేనివారు తిరిగి నమోదు చేసుకోవచ్చని, ఇందుకోసం ఫాం-8 దరఖాస్తును ఆన్లైన్లో కానీ, నియోజకవర్గ ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి, బూత్‌స్థాయి అధికారికి ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. https:\\nvsp.in, https:\\ceotelangana.nic.in, https:\\voters.eci.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.