కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 24 : కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ శుక్రవారం కరీం‘నగరం’లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. స్మార్ట్‌సిటీ నిధులతో చేపట్టిన మల్టీపర్పస్ స్కూల్ పార్క్, అంబేద్కర్ స్టేడియంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, హౌసింగ్‌బోర్డు రిజర్వాయర్ పరిధిలో 24 గంటల మంచినీటి సరఫరా, ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ఈ-క్లాస్ రూంలను కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌గౌడ్, మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం హౌసింగ్‌బోర్డు కాలనీలో మేయర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడారు. స్మార్ట్‌సిటీ పథకాన్ని అన్ని నగరాల కంటే కరీంనగర్లో సమర్థవంతంగా, సక్రమంగా వినియోగించుకున్నారని, మిగతా పట్టణాలతో పోలిస్తే కరీంనగర్లో స్మార్ట్‌సిటీ పనులు చాలా బాగా జరిగాయని కితాబునిచ్చారు.
కరీంనగర్‌లోని ఐదు డివిజన్లలో 4055 ఇళ్లకు 24 గంటల పాటు నిరంతరాయంగా తాగునీటిని సరఫరా అందించడం ఒక చారిత్రాత్మకమైన విజయమన్నారు. దేశంలో ఎకువ ఇళ్లకు 365 రోజులపాటు 24 గంటల తాగునీటిని అందించిన ఘనత కరీంనగర్ కార్పొరేషన్‌కు దకుతుందన్నారు. కరీంనగర్లో ప్రధాన సమస్యగా ఉన్న డంప్‌యార్డును క్లీన్ చేసేందుకు కేంద్ర నుంచి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు మానేర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు గురించి మాజీ మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మానేరు నదిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రారంభించిందని, దీనిని పూర్తి చేసేందుకు 300 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల మేరకు అభివృద్ధి పనులు పూర్తి చేశామని చెప్పారు.