జిల్లాను ముసురు పట్టేసింది. వానల కోసం ఎదురు చూసిన రైతన్నకు ఆనందాన్ని ఇస్తున్నది. శుక్రవారం రాత్రి మొదలై శనివారం సాయంత్రమైనా గెరువియ్యకుండా పడుతుండగా, ఇన్నాళ్లూ బోసిపోయి కనిపించిన చెరువులు కుంటలకు జలకళ వస్తున్నది. పలుచోట్ల అలుగు కూడా దూకుతూ సాగుకు భరోసా ఇస్తుండగా, మరోవైపు ప్రాజెక్టులకు జలకళవస్తున్నది. సిరిసిల్లలోని ఎస్సారార్ రిజర్వాయర్‌కు స్వల్ప ఇన్‌ఫ్లో మొదలుకాగా, ధర్మపురి వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. మొత్తంగా నెలరోజులుగా జాడలేని వరుణుడు కరుణించడంతో రైతాంగం పొలం బాటపడుతున్నది.
– కార్పొరేషన్/ శంకరపట్నం, జూలై 20
కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ముసురువదలడం లేదు. రెండ్రోజులుగా తెరిపిలేకుండా కురుస్తూనే ఉన్నది. దీంతో చెరువులు, కుంటలు జళకళ సంతరించుకోగా, రైతులు సంతోషంగా సాగుకు కదులుతున్నారు. వర్షానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ఎస్సారెస్పీ కాలువ పక్కన ఇల్లు కూలిపోగా, బాధితులను మున్సిపల్ సిబ్బంది పెద్దపల్లిలోని పునరావాస కేంద్రానికి తరలించారు. అత్యవసర సాయానికి పెద్దపల్లి పట్టణ ప్రజల కోసం మున్సిపల్ హెల్ప్ లైన్ 6303127484కు ఫోన్ చేయాలని కమిషనర్ ఆకుల వెంకటేశం సూచించారు. కరీంనగర్‌లోని గోదాంగడ్డలో శిథిలావస్థకు చేరిన అజ్జూ అనే వ్యక్తి సంబంధించిన పెంకుటిల్లు పైకప్పు కూలిపోయింది.
ఇంట్లోనివారు అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఎక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచింది. వరుస వర్షాలతో జగిత్యాల జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. శనివారం జిల్లాలోని పోలీస్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువుల వద్ద, వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. అత్యవసర సాయానికి ప్రజలు డయల్ 100కు ఫోన్‌చేయాలని సూచించారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ధర్మపురి వద్ద గోదావరి నది వరద ఉధృతి పెరిగింది. ఈ క్రమంలో ధర్మపురి, రాయపట్నం వద్ద నది ఉధృతిని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. స్నానాలకు వచ్చే భక్తులను లోతు ప్రాంతాలకు వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ, దేవస్థానం సిబ్బం ది అప్రమత్తం చేశారు. ఇక ఎగువన ఎస్సారెస్పీ, కడెం నుంచి పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లికి 8942క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టులో 20.17టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 5.88టీఎంసీల నీరు నిల్వ ఉంది. మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్‌కు 1835 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 74 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు వదులుతున్నారు.
అలాగే సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ ఎస్సారార్ జలాశయానికి 236 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో వస్తున్నది. డ్యాంలో 27.54 టీఎంసీల సామర్థ్యానికిగాను ప్రస్తుతం 5.57 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం గుండారం రిజర్వాయర్ మత్తడి దూకుతున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 12 అడుగులకు చేరి కనువిందు చేస్తున్నది. వర్షాలకు కరీంనగర్ కేశవపట్నం నుంచి అర్కండ్ల వరకు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలలోకి నీరు చేరుతోంది. కాగా ఏడాదిలో 8 నెలల పాటు జలకళ ఉట్టి పడే ముత్తారం రామసముద్రం చెరువు నిండి మత్తడి పారుతున్నది.