రాంనగర్, జూన్ 4: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తామని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు తెలిపారు. ఓట్ల లెక్కింపు తర్వాత మంగళవారం సాయంత్రం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించడంలో ఆలస్యం జరగడం, ప్రచారానికి కేవలం 15 రోజుల గడువు మాత్రమే ఉండడం వల్ల విజయం అందుకోలేక పోయామని చెప్పారు. అక్షింతలు పంచడం మొదలు అయోధ్య రామమందిరం లాంటి అంశాలతో సంవత్సరం క్రితం నుంచే బీజేపీ అభ్యర్థి రాజకీయ ప్రచారం చేయడం, ఇతర విషయాలు తన ఓటమికి కారణంగా మారాయని వివరించారు. తనను గెలిపించడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంతో శ్రమించారని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రావడం సంతృప్తినిచ్చిందని, ఓటమి చెందినప్పటికీ ప్రజాతీర్పును గౌరవిస్తూ భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పురుమల్ల శ్రీనివాస్, ప్రణవ్ బాబు, ఆరెపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణగౌడ్, కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, ఆకారపు భాసర్రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, ఎండీ తాజ్, బానోతు శ్రవణ్ నాయక్, పులి ఆంజనేయులు గౌడ్, పడాల రాహుల్, అబ్దుల్ రహమాన్, మల్యాల సుజిత్ కుమార్, కెడం లింగమూర్తి పాల్గొన్నారు.