కలెక్టరేట్, మార్చి 29 : జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై కలెక్టర్ నజర్ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆశాఖ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఇటీవల కాలంలో వస్తున్న విమర్శలతో పాటు అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వయంగా కలెక్టరే రంగంలోకి దిగినట్లు తెలుస్తున్నది. ఇటీవల కలెక్టర్ తీసుకున్న చర్యలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయన్న చర్చ ప్రస్తుతం ఆ శాఖలో జోరుగా నడుస్తున్నది.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఈ శాఖలో గత కొద్దినెలలుగా నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆశాఖ యంత్రాంగం కార్యక్రమాల అమలుపై పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీలో రోజురోజుకూ వెనుకబడుతున్న నేపథ్యంలో డీఆర్డీఏ పనితీరుపై శుక్రవారం ఆసంస్థ కార్యాలయమైనా స్వశక్తి కళాశాలలో సంబంధిత జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
మహిళా సంఘాలకు అందించే రుణాలు, బీమా సౌకర్యాలతో పాటు పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు కుట్టేందుకు ప్రణాళిక రూపకల్పన, పెన్షన్లపై సంబంధిత అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించడం లేదని గుర్తించిన కలెక్టర్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఆ శాఖ సిబ్బంది ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తున్నది.
ఈ శాఖ ఆధ్వర్యంలో ప్రతి రోజు చేపడుతున్న కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమాచారమివ్వాల్సి ఉండగా, ఎలాంటి నివేదికలు పంపడం లేదని మండిపడిన కలెక్టర్.. ఆశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న టీ సెర్ప్ వాట్సాప్ గ్రూప్‌తో పాటు ఉపాధి హామీ సిబ్బంది వాట్సాప్ గ్రూప్‌లో తన నంబర్ చేర్పించినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. అర్హులైన వారికి పథకాలు వర్తింపజేయడంలో కూడా పట్టింపులేనట్లు వ్యవహరిస్తుండడాన్ని గుర్తించి సంబంధిత అధికారులను తీవ్రంగా మందలించడంతో పాటు.. పని తీరుమారు మార్చుకోక పోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లుగా తెలుస్తున్నది.
ఓల్డేజ్, స్పౌజ్ పెన్షన్లపై ప్రత్యేకంగా ఆరా తీయగా, 950 స్పౌజ్ పెన్షన్లు పెండింగ్‌లో ఉండడాన్ని గమనించిన కలెక్టర్.. నివ్వెరపోవడంతో పాటు.. మహిళా సంఘాల్లోని సభ్యులకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద పెన్షన్ మంజూరు కోసం వచ్చిన దరఖాస్తులు కూడా నామమాత్రంగానే ఉండడంతో, అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.
బ్యాంకు లింకేజీల్లో గత ఎనిమిదేళ్ల నుంచి వరుసగా మొదటి అయిదు స్థానాల్లో ఉన్న జిల్లా… ఈ అర్థిక సంవత్సరంలో మాత్రం రోజు రోజుకూ దిగువకు పడిపోతున్న తీరుపై సంబంధిత అధికారులను ప్రశ్నించడంతో వారు మిన్నకుండిపోగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు చెల్లించాల్సిన కమీషన్ కూడా పెండింగ్‌లో ఉండగా, బ్యాంకు లింకేజీలో లక్ష్యం దాటినందుకు సెర్ప్ నుంచి అవార్డు అందుకున్న సందర్భంలో కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడం పట్ల సంబంధిత అధికారులపై మండిపడ్డట్లు తెలుస్తున్నది.
సంక్షేమ పథకాల అమలుకు గుండె కాయ అయిన ఈ సంస్థలోని అధికారులు, సిబ్బంది మద్య సమన్వయలేమితోనే ఇదంతా జరుగుతున్నదని, ఈసారి ఐకేపీకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచుతుండగా, ఇలాగే వ్యవహరిస్తే వాటి నిర్వహణపై కూడా ప్రభావం పడుతుందని, నిర్లక్ష్యపు జాడ్యం విడనాడితేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా క్షేత్రస్థాయికి వెళ్తాయని హితబోధ చేసినట్లు భోగట్టా.
మరోసారి పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తున్నది. దీంతో, కలెక్టర్ దృష్టి సారించడంతో ఇకనుంచైనా ఆ శాఖలో కొంతమంది అధికారులు చేస్తున్న పెత్తనానికి చెక్ పడి, గాడిలో పడుతుందేమోననే అభిప్రాయాలు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందిలో వ్యక్తమవుతున్నాయి.