ఆంధ్రా ఆధిపత్యానికి తెరదించి.. ‘సమైక్య’ సంకెళ్లను తెంచి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి పాతికేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్)కి ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండగా నిలువగా, తిరిగి ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం కోసం జరుగుతున్న పోరాటానికి ఇదే గడ్డ వేదికవుతున్నది. 2001లో ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా సాగిన సింహగర్జన సభతో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం, స్వరాష్ట్ర సాధన వరకు సాగింది.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నింటా ప్రగతిపథంలో ముందుకెళ్లిన రాష్ట్రం, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో తిరోగమనం దిశగా వెళ్తున్న క్రమంలో తిరిగి రాష్ట్ర పునరేకీకరణ ఆవశ్యకత ఏర్పడింది. అందుకోసం ఈ నెల 20న జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభా వేదికగా జైత్రయాత్రకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించగా, ప్రతిపక్షాల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిండు సభా వేదికగా కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు పల్లె, పట్నం అన్న తేడా లేకుండా మారుమోగుతున్నాయి. ఈ తరుణంలో గులాబీ ఉద్యమ కెరటం పునర్వైభవం సంతరించుకొని, ఉద్యమ పంథాను మరింత ఉధృతం చేసే దిశగా కార్యాచరణ సాగుతున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Karimnagar
కరీంనగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విప్లవాల ఖిల్లా, ఉద్యమాల పురిటిగడ్డగా ముద్రపడ్డ కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో అడుగడుగునా అండగా నిలిచింది. తెలంగాణవాదం ఉందని, అది నాలుగు కోట్ల ఆకాంక్ష అని దేశానికి ఎలుగెత్తి చాటాల్సి వచ్చిన ప్రతి సమయంలోనూ గులాబీ పార్టీని తలెత్తుకునేలా చేసింది. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్నది. అయితే పార్టీ ఆవిర్భావానికే పరిమితం అవుతుందని, ప్రజా ఆమోదం లేదని ఆనాడు కొంత మంది అవహేళన చేసిన సందర్భంలో 2001 మే17న కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర కళాశాల వేదికగా ‘సింహగర్జన సభ’ను కేసీఆర్ నిర్వహించారు.
అయితే సభకు ఆశించినంత జనం రారని సమైక్యవాదులు చేసిన ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ.. అప్పటివరకు చరిత్రలో లేనివిధంగా కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాది మంది జనం సభకు స్వచ్ఛందంగా తరలివచ్చింది. ‘జై తెలంగాణ’ నినాదం నలుదిక్కులా పెక్కుటిల్లగా.. తెలంగాణవాదం ప్రజల్లో బలంగా ఉందని చెప్పడానికి కరీంనగర్ గడ్డ ఆనాడు వేదికైంది. ఉవ్వెత్తున తరలివచ్చిన లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (ప్రస్తుత భారత రాష్ట్ర సమితి) ఏర్పాటును కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.
తెలంగాణ వచ్చేదాకా మడమ తిప్పబోనని ప్రతిన బూనారు. అప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే లేనివిధంగా ఈ సభ సక్సెస్ అయిన ఘనత కరీంనగర్ గడ్డకే దక్కింది. దేశవ్యాప్తంగా స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగినా.. ‘సింహగర్జన’ మాత్రం వాటన్నింటికి మించి ఓ చరిత్రను సృష్టించింది. తెలంగాణ ఆకాంక్షను గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాటి చెప్పింది. అయితే సమైక్యవాదులు మళ్లీ తెలంగాణవాదం లేదని చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో కేసీఆర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, బరిలో దిగారు. 2006 డిసెంబర్ 7న కరీంనగర్ లోక్‌సభకు ఉప ఎన్నిక జరగ్గా, ఆనాడు 2,01,582 ఓట్ల మెజార్టీనిచ్చి ఈ గడ్డ ప్రజలు కేసీఆర్‌ను గెలిపించారు. ప్రత్యేక తెలంగాణ వాదం ఉందని మరోసారి చాటి చెప్పారు.
ఈ ఎన్నిక ద్వారా బీఆర్ఎస్కు పునర్జన్మనిచ్చిన ఖ్యాతి కూడా కరీంనగర్‌కే దక్కుతుంది. నిజానికి ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే కేసీఆర్‌ను ఓడించి, తెలంగాణవాదం లేదని చెప్పడానికి.. ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. యావత్ మంత్రులను నియోజకవర్గంలో దించి, కోట్ల రూపాయాలను పంపకాలు చేసినా, కరీంనగర్ గడ్డ ప్రజలు ప్రలోభాలకు లొంగలేదు. భారీ మెజార్టీనిచ్చి కుట్రదారుల చెంపచెల్లు మనిపించిన ఘనత కూడా ఇక్కడి ప్రజలకే దక్కుతుంది. 2009 నవంబర్ 29న ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు కరీంనగర్‌లోని తన భవన్ నుంచి బయలు దేరిన కేసీఆర్‌ను అల్గునూర్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ విషయంలో ఆనాటి పాలకులు, పోలీసులు నమ్మించి.. నయవంచనకు పాల్పడి అరెస్టు చేస్తే.. అదే రోజు కరీంనగర్ భగ్గుమన్నది. కేసీఆర్‌కు అండగా నిలిచి ఉద్యమ కెరటమై మండింది. కరీంనగర్లో ప్రారంభమైన ఉద్యమ ఉగ్రరూపం 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. పదకొండు రోజుల పాటు సాగిన ఆమరణ నిరాహార దీక్షతో దిగొచ్చిన కేంద్రం, తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ విజయం వెనుక కరీంనగర్ ప్రోత్సాహం ఉన్నది. తిరిగి 2011 సెప్టెంబర్ 23న ప్రత్యేక తెలంగాణ సాధన కోసం చరిత్రలో నిలిచిపోయే సకలజనుల సమ్మెకు కరీంనగర్ గడ్డ మీద నుంచే కేసీఆర్ పిలుపు నిచ్చారు. శ్రీ రాజరాజేశ్వర కళాశాల మైదానంలో జరిగిన సభలో సకల జనుల చారిత్రక సమ్మెకు రణభేరి మోగించారు. ఈ సమ్మె యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది. ఇలా చెప్పుకొంటూ వెళ్తే.. 2001 నుంచి 2014 వరకు స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ పోరాటాలు నేటికి కండ్లముందు కదలాడుతూనే ఉంటాయి.
నేడు పునరేకీకరణ కోసం
పాతికేళ్లు పూర్తి చేసుకొని 26 సంవత్సరంలో అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ స్వరాష్ట్ర సంక్షేమం కోసం విరామం ఎరుగని పోరాటమే చేయాల్సి వస్తున్నది. నిజానికి 2001 నుంచి 2014 వరకు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, సమైక్య కుట్రలను చేధించి స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వనరులు సమకూర్చుకోవడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. మరోవైపు కేంద్రం అడగడుగునా వివక్ష చూపింది. అధికారంలో ఉన్నా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ పోరాట పంథాను సీఎం హోదాలోనూ కొనసాగించారు. తెలంగాణలో మీటర్లు పెట్టాలంటూ కేంద్రం ఆదేశాలు ఇస్తే.. ముఖ్యమంత్రిగా కేంద్రాన్ని సైతం వ్యతిరేకించారు.
ఇలా ఒకటి రెండు కాదు, ఒక మాటలో చెప్పాలంటే స్వరాష్ట్ర సంక్షేమం కోసం ఏకంగా ఓ దశలో కేంద్రంతో రణమే చేశారు. కేంద్రం సహకరించకపోయినా.. సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుపుల్లలు పెట్టే ప్రయత్నాలు చేసినా.. తాను అనుకున్న తరహాలో పనిచేసి నీళ్లు, నిధులు, నియమకాల వంటికి పెద్దపీట వేసి రాష్ర్టాన్ని అనేక రంగాల్లో నంబవన్వన్గా నిలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కానీ, రెండున్నరేళ్ల పాలనలో తెలంగాణ తిరోగమనంలో పయనిస్తున్నది. రోజురోజుకూ పెరుగుతున్న అప్పులు, అవినీతి అక్రమాలు, భూకబ్జాలు, అన్నదాతల ఆక్రందనలు, మళ్లీ మొదలైన చేనేత కార్మికుల ఆత్మహత్యలు, కరెంటు కోతలు, అందని రైతు బంధు, పెరగని పింఛన్లు, నీరుగారిపోతున్న ప్రాజెక్టులు, మాటలకే పరిమితమైన సంక్షేమ పథకాలు, బడుగు బలహీనవర్గాల సంక్షేమ కార్పొరేషన్లకు లేని నిధులు, ఇలా చెప్పుకొంటూ పోతే ఏ రంగం చూసినా తిరోగమనంలోనే ఉన్నది.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ పునర్నిర్మాణం అవసరం అన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతుండగా, ఈ నెల 20న కేసీఆర్ జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి రాజకీయ బహిరంగ సభకు జగిత్యాలే వేదిక కాగా, కేసీఆర్ దాదాపు యాభై నిమిషాలు మాట్లాడారు. నాడు బీఆర్ఎస్ పదేళ పానలో తెలంగాణ ప్రగతి ప్రయాణం, నేడు రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న తిరోగమనం ప్రజలకు అర్థం అయ్యేలా విప్పి చెప్పారు. అంతేకాదు, అనేక రంగాల గురించి కేసీఆర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం పల్లె, పట్నం అన్న తేడా లేకుండా మారుమోగుతున్నాయి. ‘కేసీఆర్ రావాలే.. రేవంత్‌రెడ్డి పోవాలే’ అనే నినాదాలు ప్రతిపల్లెలోనూ హోరెత్తుత్తున్నాయి.
తెలంగాణ పునర్నిర్మాణానికి ఊపు నిచ్చే విషయంలో జగిత్యాల వేదిక కావడం చూస్తే, ఉమ్మడి జిల్లా గడ్డపై నుంచి మరోసారి కేసీఆర్ సమరశంఖం పూరించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ గడ్డపై నుంచి చేపట్టిన ప్రతి కార్యక్రమం.. గులాబీ పార్టీ కలిసి వచ్చిన అంశం కాగా, పునర్నిర్మాణ సభ కూడా బీఆర్ఎస్కు మరింత ఊతం ఇచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా నాడు,నేడు కరీంనగర్ ఉమ్మడి జిల్లానే వేదిక కావడం గమనార్హం. గడిచిన 25 ఏళ్ల ప్రస్థానంలో సాగిన ఉద్యమాలు, పదేళ్ల పాలనలో సాగిన అభివృద్ధి పనుల వంటివి ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్ర వేయగా, ఇక పునర్నిర్మాణం కోసం జరిగే పోరాట పంథాలో ఉమ్మడి జిల్లా ముందు వరుసలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఊరూరా గులాబీ జెండా ఎగరేద్దాం
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో ఆదివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. ఈ నెల 27న తెలంగాణ భవన్లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని తెలిపారు. ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరుకావాలని, మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు. ఉదయాన్నే స్థానిక ప్రాంతాల్లో జెండా పండుగ ముగించుకుని, మధ్యాహ్నం 1:30 గంటల కల్లా హైదరాబాద్ చేరుకోవాలని సూచించారు.