దుండిగల్/జగద్గిరిగుట్ట, ఆగస్టు 3 : కాంగ్రెస్ పాలనలో సంక్షేమం కాదు.. సంక్షోభం రాజ్యమేలుతున్నదని సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే రైతులకు పలుమార్లు రైతుబంధు ఎగ్గొట్టిన ప్రభుత్వం.. కనీసం పురుగు మందులు కూడా అందుబాటులో ఉంచలేని పరిస్థితి నెలకొన్నదని రైతులు వాపోతున్నారు. ఇటీవల నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలకు చేలు పెరిగాయి. ఈ క్రమంలో ఎరువులు, పురుగుమందుల కోసం రైతులు దుకాణాలను ఆశ్రయిస్తుండటం తో దుకాణాదారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలు చెప్తున్నారు.
దీంతో నగర శివా రు జిల్లాల రైతులు హైదరాబాద్‌లోని ప్రధాన కంపెనీల గోదాములు, విక్రయ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. మెదక్, నర్సాపూర్, మేడ్చల్ ప్రాంతవాసులు సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్‌పల్లి చౌరస్తాలో ఓ ప్రైవేట్ కంపెనీ విక్రయ కేంద్రం వద్ద పురుగు మందులు, ఎరువుల కోసం రైతులు పోటెత్తారు. వీరిలో కొందరికి మాత్రమే మందులు అందగా, మరికొందరికి టోకెన్లు ఇచ్చారు. సరైన సమాచారం లేక ఈ పరిస్థితి నెలకొన్నదని పలువురు రైతులు విమర్శించారు.
కాశీబుగ్గ, ఆగస్టు 3 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో సోమవారం మక్కలకు రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సీజన్లో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు మించి క్వింటాకు రూ.2,630 చొప్పున కొనుగోలు చేశారు. మార్క్‌ఫెడ్ మద్దతు ధర రూ. 2,400తో కొనుగోలు చేసింది.

సోమవారం వెంకటాపూర్ మండలానికి చెందిన రైతు ఉప్పుల రాజు సుమారు 226 బస్తాల మక్కలను మార్కెట్‌కు తీసుకురాగా, సీతారామ ట్రేడింగ్ అండ్ కంపెనీ ద్వారా వెంకటరమణ ఎంటర్ప్రైజెస్ ఖరీదు వ్యాపారి క్వింటాకు రూ.2,630 చొప్పున కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు.