Malyala | చందుర్తి, జూలై 14 : వరుణుడి కరుణ కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. కర్రకు కప్పను కట్టి ఊరంతా కలియ దిరిగి ఇంటింటా నీరు పోస్తూ వర్షాలు కురవాలని ఓ ఊరి గ్రామస్తులు వినూత్న ప్రయత్నం చేశారు. ఇది పాత తరం ఆచారమే అయినా వర్షాలు కురవక అల్లాడుతున్న రైతులు, ప్రజలు వర్షాలు కురవాలని వేడుకుంటూ కప్పతల్లి పై నీరు పోస్తున్న మొక్కులు చెల్లించుకున్న తీరు ఇదీ. చందుర్తి మండలం మల్యాల గ్రామస్తులు, రైతులు కర్రకు కప్పతల్లిని కట్టి చిన్నారులు ఇంటింటా తిరుగుతూ రాగా, ప్రతీ ఇంటి గుమ్మం ఎదుట కప్పతల్లి పై నీరు పోస్తూ వర్షాలు కురవాలని సాగు చేసిన పంటలు కాపాడాలని వేడుకుంటున్నారు.
వర్షాకాలం ఆరంభమై దుక్కులు దున్నిన రైతులు పలు రకాల పంటల సాగుకు అవసరమైన విత్తనాలు విత్తారు. అప్పుడప్పుడు పడిన జల్లులే తప్ప ఓ మోస్తారు వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. ఈ కారణంగా దుక్కుల్లో విత్తిన విత్తనాలు మొలకెత్తకపోగా…. కాస్త తడిగా ఉన్న భూముల్లో మొలకెత్తిన మొలకలు వాడిపోవడంతో ఆవేదనలో మునిగిన అన్నదాతలు వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. తాము చేసే ప్రయత్నాలు చేస్తే వరుణుడి కరుణతో వర్షాలు కురుస్తాయని నమ్మకంతో కర్రకు కట్టిన కప్పతల్లిని చిన్నారులు కేరింతలు వేస్తూ ఊళ్లోని ఇంటింటా తిప్పారు. ఆలయాల్లో జలాభిషేకం నిర్వహించిన గ్రామస్తులు తమ గుమ్మం ఎదుటకు వచ్చిన కప్పతల్లి పై నీరు పోసి వర్షాలు కురవాలని మొక్కుకున్నారు.