కోరుట్ల, జనవరి 19: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, సీఎం కేసీఆర్ ప్రజలను కంటి సమస్యల నుంచి దూరం చేసేందుకే మరోసారి కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని జీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం రెండో విడుత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. కంటి పరీక్షల విధానాన్ని పరిశీలించారు. కంటి పరీక్షల కోసం వచ్చిన వృద్ధులను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులను తెలుసుకున్నారు.
మెట్పల్లి పట్టణంలోని ఎస్సారెస్పీ క్యాంపు ఫంక్షన్ హాల్లో రెండో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతుల కల్పనకు అధిక నిధులు వెచ్చిస్తున్నదన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం వంద రోజుల పాటూ నేత్ర వైద్యులు సేవలు అందిస్తారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రతిపక్ష నాయకులు మాటలు పట్టించుకోవద్దన్నారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో వినోద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, తహసీల్దార్ రాజేశ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి సంయొద్దీన్ పాల్గొన్నారు.