జగిత్యాల, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పది నెలల పాలన అరాచకంగా మారిందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని, ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజలు భయపడే పరిస్థితిని రేవంత్‌రెడ్డి తీసుకువస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రజాకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యాడని, రాష్ట్రంలో రోజుకో సమస్యను సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఒక రోజు హైడ్రా తెస్తే, మరో రోజు మూసీ సుందరీకరణ అంటూ మరో అంశాన్ని లేవనెత్తుతున్నాడని మండిపడ్డారు.
ఒక రోజు బెటాలియన్ కానిస్టేబుళ్ల వ్యవహారం, మరోసారి నిరుద్యోగ యువతపై లాఠీ చార్జీ, ఇంకోసారి రైతుల హామీలు తుంగలో తొక్కడం లాంటివి చేస్తున్నాడని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేసిన సందర్భంలో సొంత ఇంట్లో విందు చేసుకుంటే ఏదో జరుగుతుందని, డ్రగ్స్, విదేశీ మద్యం అంటూ పోలీసులతో దాడి చేయించి, అరెస్ట్‌లు, అక్రమ కేసులు పెట్టించడం నిజంగా సిగ్గుమాలిన చర్య అన్నారు. తల్లి, భార్య, చెల్లి, పిల్లలతో కలిసి ఎవరైనా డ్రగ్స్ పార్టీ చేసుకుంటారా..? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
బీఆర్ఎస్లో పదవి, కాంట్రాక్టులు పొంది, ఇప్పుడు పార్టీ మారిన పొంగులేటి ముందుగా చెప్పిన ప్రకారం దాడులు చేయడం అత్యంత శోచనీయమన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్న తరుణంలో వారిని ఏమార్చడానికి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలకు బీజేపీ వంత పాడుతుండడం, కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్‌పై విమర్శలు చేస్తుండడం చూస్తే బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయినట్టు అనిపిస్తున్నదని, దీనిపై ఇరు పార్టీలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా అరాచక పాలనకు స్వస్తి పలికి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని, ఇలాంటి తప్పుడు చర్యల వల్ల రాజకీయ మైలేజీ రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు.
కేంద్ర హోంశాఖ మంత్రిని అని మరిచిపోయి బండి సంజయ్ డ్రగ్స్ అంటూ తప్పుడు కూతలు కూస్తున్నాడని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ సర్కారు దుష్ర్పచారం చేయడం అత్యంత దారుణమని ఆవేదన చెందారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ బావమరిది జన్వాడలో గృహప్రవేశ కార్యక్రమం సందర్భంగా విందు ఏర్పాటు చేసుకుంటే, అక్కడ నాలుగు మద్యం సీసాలు ఉంటే దానికి డ్రగ్స్ పేరు వాడడం సరికాదని సూచించారు. ఇంట్లో చిన్న పిల్లలు, 70ఏళ్ల వయసున్న మహిళలు, కుటుంబ సభ్యులు రేవ్ పార్టీలో పాల్గొన్నారని రేవంత్ ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం వారి నీచ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు.
వాస్తవాలు తెలుసుకోకుండా సంజయ్ మాట్లాడడం సరికాదని సూచించారు. డ్రగ్స్‌ను మంచాల కింద, బనియన్ లోపలి వైపు దాస్తారంటూ చెబుతున్న తీరును చూస్తే ఆయనే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు అనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఆయనకు, ఆయన కొడుక్కు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంట్లో జరిగిన విందుకు రేవ్‌పార్టీ కలర్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ సాధకుడు అయిన కేసీఆర్ కుటుంబాన్ని అభాసుపాలు చేసే కుట్రలు సాగవని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఎవరి ఇంట్లో ఏం ఫంక్షన్ జరుగుతుందని దృష్టి పెట్టడం కాదని, ధాన్యం కొనుగోళ్లపై పెడితే రైతుల ఇబ్బందులు తీరుతాయని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్నదని మండిపడ్డారు. కుటుంబ సభ్యులు, ఆడవాళ్లు, పిల్లలు, వృద్ధులతో కలిసి విందు నిర్వహించుకుంటే దానిని రేవ్పార్టీగా వక్రీకరించడం సరికాదన్నారు. పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారి దృష్టిని మరల్చేందుకు ఇలా చేయడం సరికాదని హితవు పలికారు. మాజీ మంత్రి కేటీఆర్, వారి కుటుంబ సభ్యులపై రేవంత్ సర్కారు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మహిళలంటే చులకన భావం ఉందన్నారు. నిండు శాసనసభలోనే మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని అవమానించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. ఇక్కడ గట్టు సతీశ్, అల్లాల ఆనంద్ రావు, అమీన్ బాయ్, వోళ్లం మల్లేశం, శీలం ప్రియాంక ప్రవీణ్ రిజ్వాన్, గాజుల శ్రీనివాస్, మోర వెంకటేశ్వర్లు, నిరటి శ్రీనివాస్, మధుసూదన్ రావు ఉన్నారు.