MLA Sanjay Kumar | కోరుట్ల, ఆగస్టు 31 : కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రహదారిపై కల్లూరు ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు సోమవారం మెరుపు ధర్నా చేపట్టారు. పాఠశాలకు అదనపు బస్సులు నడపాలని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 240 మంది విద్యార్థులు నిత్యం కల్లూరు లోని ప్రభుత్వ మోడల్ స్కూల్ కు కోరుట్ల నుంచి బస్సులో ప్రయాణం చేస్తారని, కేవలం ఒక ఆర్టీసీ బస్సు మాత్రమే అధికారులు కేటాయించడం సరికాదని మండిపడ్డారు. ఒకే బస్సులు 40 మందికి సరిపడా సీట్లు ఉండగా వందమంది కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ అధికారులు అదనంగా బస్సులు కేటాయించాలని, బస్సులో మహిళా కండక్టర్ను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పొట్ట సురేందర్ జాల వినోద్ కుమార్ ద్వారా విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విద్యార్థులతో మాట్లాడారు. మోడల్ స్కూల్ కు అదనంగా బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అదనపు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. సుమారు గంటపాటు విద్యార్థులు రహదారిపై రాస్తారోకో నిర్వహించగా రాకపోకలకు అంతరాయం కలిగింది. మోడల్ స్కూల్ కు అదనంగా ప్రత్యేక బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ మనోహర్ విద్యార్థులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.