ధర్మారం/రామడుగు/బోయినపల్లి, జూలై 31: గోదారి గలగలా తరలివస్తున్నది. కాళేశ్వరం లింక్-2లో ఎత్తిపోతలతో దిగువన ఎల్లంపల్లి నుంచి ఎగువన మధ్యమానేరు జలాశయానికి పరుగులు తీస్తున్నది. ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్‌లో నాలుగు మోటర్లు (2,3,5,7) నడుస్తున్నాయి. ఒక్కో మోటర్ ద్వారా 3,150 చొప్పున 12,600 క్యూసెక్కులు డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా ఎగిసి పడి నంది రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి.
అక్కడ రిజర్వాయర్ గేట్లను ఎత్తడంతో అంతే మొత్తంలో జలాలు అండర్ టన్నెళ్లలో గ్రావిటీ ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిపోతున్నాయి. అక్కడి నుంచి సైతం నాలుగు మోటర్లు (1,3,4,5 ) ద్వారా 12,600 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తుండగా, డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా ఎగిసి పడ్డ జలాలు సుమారు 5.7 కిలోమీటర్లు ఉన్న గ్రావిటీ కాలువ ద్వారా ప్రవహించి వరదకాలువలో 99వ కిలోమీటర్ మైలురాయి వద్ద కలుస్తున్నాయి.
అక్కడి నుంచి మధ్యమానేరుకు పరుగెడుతున్నాయి. బుధవారం ఉదయం వరకు 5.4 టీఎంసీల గోదారి జలాలను మధ్యమానేరుకు తరలించినట్టు గాయత్రీ పంప్‌హౌస్ డీఈఈ రాంప్రదీప్ తెలిపారు. కాగా, ఎత్తిపోతల ద్వారా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో మధ్యమానేరులో నీటి మట్టం గంట గంటకు పెరుగుతున్నది. పూర్తి నీటి సామర్థ్యం 27.054 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 10.22 టీఎంసీలు ఉంది.