కేటీఆర్ సవాల్‌కు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. కాళేశ్వరం పంపులను ఆగస్టు 2 లోగా ఆన్ చేయకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే ఆన్ చేస్తామని ఇచ్చిన అల్టిమేటానికి తలొగ్గింది. 24 గంటల్లోనే మధ్యమానేరు (శ్రీ రాజరాజేశ్వర) ప్రాజెక్టుకు ఎత్తిపోతలను ప్రారంభించింది. శనివారం ధర్మారం మండలం నంది పంప్‌హౌస్‌లో 4, రామడుగు మండలం గాయత్రీ పంప్‌హౌస్‌లో 4 బాహుబలి మోటర్లను ఆన్ చేసింది. మొత్తంగా 12,600 క్యూసెక్కులను ఎత్తిపోస్తుండగా, రైతాంగం ఆనందపడుతున్నది. అన్నీ మంచిగానే ఉన్నాయని, కాంగ్రెస్ కావాలనే నీళ్లియ్యకుండా తమ పొలాలు ఎండబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
కరీంనగర్, 27 జూలై (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ పెద్దపల్లి, (నమస్తే తెలంగాణ/ ధర్మారం, జూలై 27: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో సాగిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పర్యటన విజయవంతమైంది. గురువారం సాయంత్రం ఎల్ఎండీని పరిశీలించి, శుక్రవారం లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్, లక్ష్మీ (కన్నెపల్లి) పంప్‌హౌస్‌ను పరిశీలించింది.
ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెం ట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయడంలో సర్కారు చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే ఆగస్టు 2 వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని, అప్పటికీ లక్ష్మీ పంపుహౌస్ నుంచి నీటిని పంపింగ్ చేయకపోతే, 50 వేలమంది రైతులతో వచ్చి తామే ప్రారంభిస్తామని అల్టిమేటం జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ సర్కారు కేటీఆర్ సవాల్‌కు దిగొచ్చింది. రైతులతో కలిసి వచ్చి మోటర్లు ఆన్ చేస్తే తమకు చెడ్డ పేరొస్తుందని భావించి దిద్దుబాటు చర్యలకు పూనుకున్నది. ఈ మేరకు అల్టిమేటం ఇచ్చిన 24 గంటల్లోనే ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది.
ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు జలాలు
కేటీఆర్ సవాల్‌తో దిగొచ్చిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి బరాజ్ నుంచి సిరిసిల్ల జిల్లా మధ్యమానేరుకు నీటిని తరలిస్తున్నది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపుహౌస్‌లో నాలుగు (4, 5, 6, 7 నంబర్లు) మోటర్లు ఆన్ చేసింది. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 12,600 క్యూసెక్కులను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు ఎత్తిపోస్తున్నది.
అక్కడ నాలుగు బహుబలి మోటర్లు ఆన్‌చేసి జలాలను వరదకాలువ ద్వారా మధ్యమానేరు ప్రాజెక్టుకు పంపిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న మోటార్ల ప్రకారం చూస్తే.. రోజుకు 1.2 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నారు. నిజానికి నందిమేడారం, అలాగే గాయంత్రి పంపుహౌస్ వద్ద ఏడు మోటార్లు ఉన్నాయి. మొత్తం పంపులను ఆన్‌చేస్తే రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోవచ్చు.
కాంగ్రెస్‌పై మండిపడుతున్న రైతులు
బీఆర్ఎస్ పాలనలో నిండుగా దర్శనమిచ్చిన జలాశయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. 90 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఎస్సారెస్పీలో 25 టీఎంసీల కంటే తక్కువగా నీళ్లు ఉండగా, 24 టీఎంసీల ఎల్ఎండీలో 5 టీఎంసీలు, 26 టీఎంసీల కెపాసిటీ ఉన్న మిడ్ మానేరులో సైతం 6.87 టీఎంసీల వరకు ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే సాగు, తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి.
గతంలో ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం మోటర్లు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోసుకున్నా.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. నేషనల్డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పారని, అందుకే తాము లక్ష్మీ పంపుహౌస్ నుంచినీటిని ఎత్తిపోసేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వాదిస్తున్నది. అయితే మేడిగడ్డ వద్ద 5,39,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. దాదాపు రోజుకు 50 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది. ఇటు ఎల్లంపల్లి నుంచి నీటికి ఎత్తిపోసే అవకాశమున్నా మొన్నటి దాకా ప్రభుత్వం ముందుకు రాలేదు. 20.175 టీఎంసీల సామర్థ్యమున్న ఎల్లంపల్లిలో ప్రస్తుతం 17.3969 టీంఎసీలు ఉండగా.. ఇన్ ఫ్లో 12,931 క్యూసెక్కులు ఉన్నది.
ఇప్పుడు కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటంతో ప్రభుత్వం నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు తీసుకున్నది. అయితే ఇదే పని ముందే చేస్తే బాగుండేదని రైతులు మండిపడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కుట్రలు బయటపడ్డాయని, ఇన్నాళ్లూ నీళ్లిచ్చే అవకాశమున్న ఎందుకివ్వలేదంటున్నారు. తమ తరఫున కేటీఆర్ వచ్చి నిలదీసే దాకా ప్రభుత్వానికి పరిస్థితి అర్థం కాలేదా..? అని ప్రశ్నిస్తున్నారు.
అయితే లోయర్‌మానేరు డ్యాం, అన్నపూర్ణ జలాశయం, ఎగువమానేరు, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నింపుకోవాలంటే.. దాదాపు 200లకుపైగా టీఎంసీల వరకు నీళ్లు అవసరం పడుతాయని, దీనికి కన్నెపల్లి నుంచి ఎత్తిపోతలే శాశ్వత పరిష్కారమని చెబుతున్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నామంటూ గొప్పలు చెప్పకుండా శాశ్వత పరిష్కారానికి చొరవ చూపితేనే తమ ప్రయోజనాలు నెరవేరుతాయని స్పష్టం చేస్తున్నారు.