పెద్దపల్లి, జూన్ 12(నమస్తే తెలంగాణ): కదంబాపూర్ మంచినీటి బాధ తీరింది. గ్రామంలో మానేరు మంచినీటి పథకం పాడైపోవడం, మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో గ్రామస్తులు 20 రోజులుగా పడుతున్న గోసను ‘మంచినీళ్లు మహాప్రభో!’ అనే శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’లో కథనాన్ని ప్రచురితం చేయగా, కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పందించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించగా, యంత్రాంగం కదిలింది. ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, ఎంపీవో సమ్మిరెడ్డి సూచనలతో పంచాయతీ కార్యదర్శి వినోద్ కృష్ణ, వాటర్ గ్రిడ్ ఏఈ సూర్యతేజ, ఏఈ ఇంట్రా శ్రీకాంత్ గ్రామానికి వెళ్లారు.
ఇంటింటికీ మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నా నీళ్లు సంపూర్ణంగా రాకపోవడానికి కారణాలను అన్వేషించారు. కొంత మంది పైప్లైన్లకు అక్రమంగా మోటర్లను బిగించి నీళ్లను పంపింగ్ చేస్తున్నారని, మరికొందరు నల్లా కనెక్షన్ల వద్ద ఫ్లో కంట్రోల్ లాక్ (ఎఫ్‌సీఎల్ )ను తొలగించారని గుర్తించారు. అప్పటికప్పుడు మోటర్లను తొలగించగా, సరఫరా కొంత మెరుగుపడింది. అలాగే కరీంనగర్ నుంచి ఎఫ్సీఎల్లను తెప్పించి అన్ని మిషన్ భగీరథ కనెక్షన్లకు బిగించి, ప్రతి ఇంటికి 400 లీటర్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. అయితే గ్రామంలోని రక్షిత నీటి పథకాన్ని ప్రతి వానకాలంలో మునిగిపోయే అవకాశాలతో తొలగిస్తామని చెప్పారు.
ఇప్పుడు బాగు చేయించినా ఫలితం లేదని, ఈ క్రమంలో వర్షాకాలం పూర్తయ్యే వరకు మిషన్ భగీరథ ద్వారానే ప్రతి ఇంటికీ సరిపడా నీరందిస్తామని వివరించారు. కాగా, తమ మంచినీటి గోసను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేవడంతోనే పరిష్కారమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో నల్లాలకు మోటర్లు బిగించుకున్న విషయం తెలిసినా తాము అకడికి వెళ్లి వాటిని తొలగించలేమని, వార్తా కథనం వల్లే పంచాయతీ అధికారులు తొలగించారని, సమస్య పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు, నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు తెలిపారు.