Journalists protest | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 21 : అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న జాప్యంపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టులు మరోసారి గళమెత్తారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-H143) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జర్నలిస్టులు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొని నిరసన తెలిపారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సామల గట్టు నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో నెలల తరబడి ఆలస్యం చేయడం వల్ల అర్హులైన జర్నలిస్టులు ప్రభుత్వ గుర్తింపు, సంక్షేమ పథకాలు, రవాణా సౌకర్యాలు వంటి అనేక ప్రయోజనాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతీ ఆరు నెలలకు బస్సు పాస్‌లను తాత్కాలికంగా పునరుద్ధరించుకోవాల్సిన పరిస్థితి జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులు తమ హక్కుల కోసం వర్షంలో రోడ్డెక్కాల్సి రావడం బాధాకరమని విమర్శించారు. ధర్నా విషయం తెలుసుకున్న కలెక్టరేట్ అధికారి ఆందోళన స్థలానికి చేరుకుని నాయకుల నుంచి వినతిపత్రాన్ని స్వీకరించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.