PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్ 10( నమస్తే తెలంగాణ): ప్రభుత్వం హామీ ఇచ్చిన జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డెమక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డీజేఎఫ్) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా, రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మోట పలుకుల వెంకట్ మాట్లాడుతూ జర్నలిస్టుల పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు.
వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ప్రయోజనాలు చేకూర్చాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని, ప్రైవేటు స్కూళ్లలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాలని, జర్నలిస్టుల పైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
డీజేఎఫ్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మోట పలుకుల వెంకటి, వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కల్లేపల్లి కుమార్, నాయకులు పిల్లి రాజమౌళి, కంది కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కన్నురి రాజు, బోయిని ప్రసాద్, సహాయ కార్యదర్శి మహంకాళి సంపత్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కళ్లపెల్లి కుమార్, జాతీయ కార్యదర్శి సభితం లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు పోలు దాసరి రజిత, ఒడ్నాల లత, మంథని లక్ష్మణ్, మహేందర్, శంకర్లతో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.