Jagityal | జగిత్యాల, జూలై 28 : గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక వాగ్ధానాలు మొదటి సంవత్సరం 2లక్షల ఉద్యోగాలు, తదుపరి ఏటా లక్ష చొప్పున ఉద్యోగాల కల్పనతో పాటు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, రెవెన్యూ కార్యాలయాలలో తొలగించిన 600 మంది కంప్యూటరు ఆపరేటర్ లను విధుల్లోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి స్పష్టం డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత సాధారణ శాసన సభ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వంలో ఖాళీలుగా ఉన్నటువంటి ఉద్యోగాలన్ని నిర్ణీత కాల వ్యవధిలో సంవత్సర కాలంలో భర్తీ చేసే విధంగా, తదుపరి ఏర్పడే ఖాళీలన్ని ఏ సంవత్సరానికి, ఆ సంవత్సరం భర్తీ చేయబడేవిధంగా, జాబ్ క్యాలెండర్ విడుదల చేయబడటంతోపాటు, ప్రస్తుతం ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో ఉన్న కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా సేవలందిస్తున్న వారినందరిని ప్రాధాన్యత క్రమంగా శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రకటనలో గుర్తు చేశారు.
దాదాపు రెండున్నర సంవత్సరాలపైగా కాలం గడిచినప్పటికి ఇంతవరకు, ఎన్నికల సమయంలో పేర్కొన్న విధంగా, మొదటి సంవత్సరం 2లక్షల ఉద్యోగాల భర్తీగాని, తదుపరి ప్రతీ సంవత్సరం లక్ష ఉద్యోగాల భర్తీ చేయబడేవిధంగా కార్యక్రమం అమలు చేయలేకపోవటంతోపాటు, జాబ్ క్యాలెండర్ విడుదలకు సంబంధించి గాని, ఏ వాగ్దానం అమలు చేయలేదన్నారు. వీటికి తోడు, కనీసం రాజీవ్ యువ వికాసం లాంటి కార్యక్రమాల ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాల కల్పనకు సంబంధించి ఈ 30 మాసాల కాలంలో ఏ ఒక్కరికి కూడా అవకాశం కల్పించ లేదన్నారు. వీటికి తోడు, ఈ మధ్య గత దశాబ్దకాలంపై నుండి రెవెన్యూ కార్యాలయాలలో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ, ఉపాధి పొందుతున్నటువంటి దాదాపు 600పైగా కంప్యూటర్ ఆపరేటర్ లను, ఏ కారణం లేకుండ, విధుల నుండి తొలగించారన్నారు. రాష్ట్ర స్థాయిలో 600పైగా కుటుంబాలు రోడ్డున పడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. నిరుపేదలకు, ప్రత్యేకంగా యువతకు అండగా నిలుస్తుందని భావించిన ప్రజా ప్రభుత్వంగా భావించే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపట్ల, ఏవిధమైన కార్యాచరణ అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటానికితోడు, భవిష్యత్ ప్రణాళిక సూచించే జాబ్ క్యాలెండర్ విడుదల చేయబడలేకపోవటం, నిరుద్యోగ యువతకు కనీసం ప్రైవేట్ రంగంలో స్వయం ఉపాధి కల్పనకు రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు నోచుకోవడం లేదన్నారు. నిరుద్యోగ యువత పూర్తిగా నిరాశ, నిస్పృహలకులోనవుతున్న పరిస్థితులకు తోడు, దశాబ్ద కాలం నుండి రెవెన్యూ కార్యాలయాలలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను ఏకపక్షంగా తొలగించడం ప్రభుత్వ నియంతృత్వ విధానానికి అద్దం పడుతుందన్నారు.
ఈ పరిస్థితులలో, ప్రజా ప్రభుత్వంగా భావించే కాంగ్రెస్ పార్టీ 2023 సాధారణ శాననసభ ఎన్నికలలో చేసిన వాగ్ధానాలు, ఎన్నికల ప్రణాళికలకు అనుగుణంగా, భర్తీ చేయాల్సిన మొదటి సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, 2025-26కు సంబంధించి లక్ష ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందటానికి ఉపయోగపడే రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి కార్యక్రమాల అమలు తక్షణమే చేసే విధంగా, కార్యాచరణ అమలు చేయటంతో పాటు, ఇంతవరకు రెవెన్యూ కార్యాలయాల్లో తొలగించిన 600పైగా కంప్యూటర్ ఆపరేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.