జగిత్యాల, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు గుర్తుకు వచ్చేందుకు రేవంత్ తన కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సామాజిక న్యాయం చేయడంలో కేసీఆర్‌దే దార్శనికత అని కొనియాడారు.
రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిపాలన సాగుతున్నదని, ఈ కంపెనీకి సీఎండీగా రేవంత్ ఉంటే.. డైరెక్టర్లుగా ఆయన సోదరులు తిరుపతి రెడ్డి, భూపాల రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, ఆయన నేతృత్వంలోనే దశాబ్ద కాలం సామాజిక న్యాయం ఆధారంగా పరిపాలన సాగిందని గుర్తు చేశారు. కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేశారని, కులవృత్తులకు ప్రోత్సాహం అందించారని చెప్పారు. రేవంతళ్రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో ఏ ఒక్క మంచిపనైనా చేసినవా అని ప్రశ్నించారు. 58 ఏళ్ల సమైక్య పాలనలో కేవలం 261 గురుకులాలు ఏర్పాటు చేస్తే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అదనంగా 652 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారని ప్రశంసించారు.
ఆ గురుకులాలన్నీ నేడు జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయన్నారు. సామాజిక న్యాయంపై ఇది కేసీఆర్ విజన్ అన్నది రేవంత్‌రెడ్డి గుర్తించాలన్నారు. రేవంత్ తన 33 నెలల పాలనలో ఒక కొత్త రెసిడెన్షియల్ సూల్నైనా ఏర్పాటు చేశారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రారంభించిన విద్యాలయాలను కనుమరుగు చేయాలన్న కుట్రతోనే యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట కేంద్రీకరిస్తున్నారన్నారు. రేవంత్‌కు ఎప్పుడూ కమీషన్ల ధ్యాసేనని, రూ.20వేల కోట్ల కాంట్రాక్ట్‌లో రూ.2వేల కోట్లు దండుకునేందుకే యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణాన్ని మేఘా కంపెనీకి కట్టబెట్టారని ఆరోపణలు చేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని, అధికారంలోకి వచ్చాక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్య, ఉద్యోగాల్లో సైతం అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డికి ఇప్పటికైనా జ్ఞానం రావాలని, గురుకులాలు యథావిధిగా కొనసాగిస్తూ, అవి నడుస్తున్న చోటనే వాటికి శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వొద్దినేని హరిచరణ్‌రావు, మున్నా, కోరుకంటి రాము, తోట హరీష్, శీలం ప్రవీణ్ కుమార్, ఆయిల్నేని వెంకటేశ్వర రావు, జున్ను రాజేందర్, కళ్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, నేహాల్, శీలం సురేందర్, పోనిశెట్టి మహేశ్, ధర రమేశ్ బాబు, ఆనంద్ రావు,అబ్దుల్ బారి, నరేశ్ గౌడ్, సాయి, గుండా మధు, సన్నిత్ రావు,నక జీవన్, హరి, శివ ఉన్నారు.