పార్టీ ఏదైనా సరే ఆయనది ప్రశ్నించే గొంతు.. ప్రజలపక్షాన నిలిచే నైజం.. అధికారంలో ఉన్నా లేకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయన శైలి.. ప్రజలతో మమేకం కావడం ఆయన నిత్య కార్యక్రమం.. రాజకీయ రంగంలో ఎన్నో పదవులు వరించినా ప్రజలతో విడదీయలేని బంధం.. ఆయనే మాజీ మంత్రిజీవన్ రెడ్డి! అటువంటి నాయకుడిని అక్కున చేర్చుకొని అండగా నిలువాల్సిన కాంగ్రెస్ కక్ష గట్టింది. పార్టీలో కొనసాగితే ముఖ్యమంత్రికే ఎసరు వస్తుందని భయపడింది. అందుకే ఒక పథకం ప్రకారం పక్కన పెడుతూ వచ్చింది. వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను పార్టీలోకి లాగి, జీవన్‌రెడ్డి కోటాలో పోరు బీజం నాటింది. ప్రతి పనిలో వేలు పెట్టేలా ఊసిగొల్పింది. రైతు బంధు, ప్రాణహిత-చేవేళ్ల, మద్దతు ధరల వంటి అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి ఎండగడుతుంటే జీర్ణించుకోలేకపోయింది.
సూటిగా సమాధానం చెప్పలేక అతన్ని పక్కన పెట్టేందుకు పన్నాగం పన్నింది. ఫిరాయింపుదారులు, వసలవాదులకు ప్రాధాన్యం ఇస్తూ.. నాలుగు దశాబ్దాలకుపై జెండా మోశారన్న కనికరం లేకుండా అడుగడుగునా అవమానాలకు గురిచేసింది. రెండున్నరేళ్ల పాటు వీటన్నింటినీ భరించిన జీవన్‌రెడ్డి, తన వ్యక్తిత్వాన్ని చంపుకోలేకపోయారు. తనను నమ్ముకున్న నాయకులకు ఆ పార్టీలో న్యాయం చేసే అవకాశం లేక.. వలస కాంగ్రెస్ వాదుల మధ్య పనిచేయలేక ఇటీవలే ఆ పార్టీని వీడారు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అవుతున్నారు. బీఆర్ఎస్లో చేరేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ జెండా మోసిన జీవన్‌రెడ్డికే ఇటువంటి చేదు అనుభవాలు ఎదురైతే.. తమ పరిస్థితి ఏంటన్న చర్చ ప్రస్తుతం కాంగ్రెస్‌లో నడువడమేకాదు, ప్రతి ఒక్కరినీ ఆత్మ పరిశీలనలోకి నెట్టింది.
కరీంనగర్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జగిత్యాల (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రోత్సహించిన ఫిరాయింపులను, ఒరిజనల్ కాంగ్రెస్ వాదులకు జరుగుతున్న అన్యాయాన్ని, వసలవాదులకు పదవులు కట్టబెట్టడాన్ని, పార్టీ ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాల వంటి అనేక అంశాలపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి.. రేవంత్ సర్కారుతోపాటు హస్తం పార్టీని నిలదీశారు. అనేక వేదికలపై ప్రశ్నించారు. చివరికి గాంధీ భవన్‌లోనూ ఆయన గొంతువిప్పారు. దేశంలో రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని రక్షించాలన్న ఆతృతతో కాలుకు బలపం కట్టుకొని తిరుగుతుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు యత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. ఫిరాయింపుదారులను, వలసదారులను ప్రోత్సహించడమేనా..? రాహుల్‌గాంధీకి మీరిచ్చే బహుమతి అంటూ నిలదీశారు. నలభై ఏండ్లుగా పనిచేస్తున్న తమను కాదని, ఫిరాయింపుదారుల మాటకు విలువ ఏంటని, వారు ప్రతిపాదించిన వారిని అందలం ఎక్కించడం ఏంటని ప్రశ్నించారు.
అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల హక్కులు గుంజుకోవడం ఏంటని, దీనికి ప్రభుత్వం సహకరించడం ఏంటని నిప్పులుగక్కారు. రాష్ట్ర ప్రభుత్వం వలసదారులపై, ఫిరాయింపుదారులపై ఆధారపడి ఉన్నదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ కంటే అధికంగా పాతిక మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అయినా వలసదారులు, ఫిరాయింపుదారులను చేర్చుకోవడం ఎందుకని, వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గంగాధరకు వచ్చిన సమయంలో పూర్వ కాంగ్రెస్ వారికే ప్రాధాన్యత ఇస్తామని, 2017 కటాఫ్ డేట్ పెడుతున్నామని, ఆ తర్వాత వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వమని ఆమె చెప్పారని, ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని గాంధీ భవన్ సాక్షిగా నిలదీశారు. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా ఫిరాయింపుదారులను, కౌలుదారులను నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెసోళ్లను మానసిక క్షోభకు గురి చేయడం ఏంటని నిలదీశారు. ఇవే కాదు, ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు, మద్దతు ధరలు, రైతు భరోసా వంటి అంశాల్లో ప్రభుత్వాన్ని తూర్పారట్టారు.
దాదాపు ఐదు దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న జీవన్‌రెడ్డికి అవినీతి మచ్చలేదు. అందులోనూ ముక్కుసూటి మనిషి. హస్తం పార్టీలో ఒరిజినల్ సీనియర్ వాదుల జాబితా తీస్తే రాష్ట్రంలో జీవన్‌రెడ్డిది దాదాపు ప్రథమ స్థానం. ఒక్క మాటలోచెప్పాలంటే ఏ పదవికైనా ఆయన అర్హుడు. వీటన్నింటినీ ఆలోచించిన రాష్ట్రంలోని కొంతమంది వలసవాదుల కాంగ్రెస్ పెద్దలు జీవన్‌రెడ్డిని పార్టీకి దూరం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారన్న చర్చ ప్రస్తుతం ఆ పార్టీలోనే సాగుతున్నది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎసరు వస్తుందనే కోణంలో కొంత మంది వలసవాద నాయకులు ఆలోచించినట్టు తెలుస్తున్నది. అందుకే కాంగ్రెస్‌లో జీవన్‌రెడ్డి ఉనికి లేకుండా చేయాలన్న కుట్రలను మొదలు పెట్టి, ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చారన్న విమర్శలున్నాయి. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవడం, ఆ తర్వాత నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు, మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫారాలు డాక్టర్ సంజయ్ కుమార్‌కే ఇవ్వడం వంటివి కూడా ఆ కుట్రల్లో ఒక భాగమే అని తెలుస్తున్నది. ఇవే కాదు, అడుగడుగునా అవమానాలు పాల్జేస్తూ వచ్చిన పార్టీ తీరుపై జీవన్‌రెడ్డి మండిపడినప్పుడల్లా.. చర్చలు, సంప్రదింపులు అంటూ మంత్రులను పంపి, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాన్ని చేపట్టారన్న చర్చ ప్రస్తుతం హస్తం పార్టీలో సాగుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే.. కుట్రలు, కుతంత్రాలతో జీవన్‌రెడ్డి పార్టీని వదిలివెళ్లేలా ప్లాన్ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జెండా మోశారన్న కనీస సానుభూతి లేకపోవడం, నిన్నగాక మొన్న చేరిన వారికి రాజ్యసభతోపాటు అనేక నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం, జీవన్‌రెడ్డి పేరును కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం, అతని ఆత్మాభిమానంపై దెబ్బకొడుతూ పార్టీకి దూరం చేయడం వంటి అన్నీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో జరిగాయన్న చర్చ ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరును కొన్నాళ్లుగా నిరసిస్తూ వస్తున్న జీవన్‌రెడ్డి, గత నెల 25న ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో తనను నమ్ముకున్న నాయకులకు న్యాయం చేయడంతోపాటు జగిత్యాల ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో గురువారం జగిత్యాలలో భేటీ కానున్నారు. ఆ తర్వాత అత్యంత కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది. అయితే నాలుగు దశాబ్దాలకుపైగా జెండా మోసిన జీవన్‌రెడ్డికే పార్టీని వదిలే పరిస్థితి తీసుకొచ్చారంటే.. తమ పరిస్థితి ఏంటన్న చర్చ ప్రస్తుతం ఆపార్టీలో నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో చాలా మంది అధికార హస్తం పార్టీని వీడేందుకు సిద్ధమవుతారని తెలుస్తున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ గురువారం మధ్యాహ్నం జగిత్యాలకు రానున్నారు. ఇటీవల అమెరికాలో బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొని మంగళవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన, బుధవారం మాజీమంత్రి జీవన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి ఇంటికి వస్తున్నానని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి వస్తున్నట్టు సమాచారం కాగా, మాజీమంత్రితో సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు. అనంతరం ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ధరూర్ ఎస్సారెస్పీ వంతెన వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం పలుకుతామని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.