జగిత్యాల, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): నిబద్ధత గల సీనియర్ నాయకుడు, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవమున్న నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి లాంఛనంగా బీఆర్ఎస్లో చేరారు. సోమవారం జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత, ఉద్యమకారుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు.
ఇదే సభా వేదికగా జీవన్‌రెడ్డి గుండె ధైర్యం ఉన్నోడని, ఉన్నది ఉన్నట్టు నిఖార్సుగా మాట్లాడుతాడంటూ జీవన్‌రెడ్డిపై కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం జీవన్‌రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్లో చేరుతున్నడని, ఆయనతోపాటు పార్టీలో చేరిన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అంటూ హృదయపూర్వక స్వాగతం తెలిపారు. జీవన్‌రెడ్డి గురించి నేను ఎక్కువ చెబితే మాది మేం ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అయితని, ఇక్కడ ఆయన గురించి తెలియనోళ్లు ఎవరూ లేరని చెప్పారు. నలభై ఐదేళ్ల నుంచి తాము స్నేహితులమని, భిన్న రాజకీయ సిద్ధాంతాల వల్ల విడివిడిగా పనిచేశామన్నారు. ఆయన నిబద్ధత, ధైర్యంతో ప్రజాజీవితంలో పనిచేశాడని, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడని కితాబిచ్చారు.
ఆయన మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా మరే హోదాలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేశాడని, తన ఏరియా అభివృద్ధిని ఏనాడూ విస్మరించలేదని ప్రశంసిచారు. గతంలో బోర్నపల్లి బ్రిడ్జి కావాలని అడిగారని, వెంటనే నిధులు మంజూరు చేసి బ్రిడ్జి కట్టించామని గుర్తు చేశారు. ఆయన అనేక పదవులు అలంకరించారని, అనేక రంగాల్లో పనిచేశారని చెప్పారు. జీవన్‌రెడ్డి తనను మొన్న కలిసినప్పుడు మేం ఒక మాట అనుకున్నామని, ఒక కుటుంబంలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని, పార్టీకి పిల్లర్ల లాగా కలిసి పనిచేసి ముందుకు తీసుకుపోదామని అనుకున్నామని వివరించారు. పార్టీలో జీవన్‌రెడ్డి చేరడంతో చాలా బ్రహ్మాండమైన ఊపు వచ్చిందని చెప్పారు.
తాను జీవన్‌రెడ్డిని ఒకటే కోరుతున్నానని, ఆయన ఒక్క జగిత్యాల కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు ఆదిలాబాద్ చూడాలని, నిజామాబాద్ చూడాలని. పరిసర జిల్లాలు చూడాలని చెప్పారు. జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేని, తమ ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలో సేవలందించే పార్టీలో ఉంటారని ప్రకటించారు. ఆరునూరైనా ఏది ఏమైనా నూటికి నూరు శాతం మళ్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తదని, రేపు భవిష్యత్‌లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక జీవన్‌రెడ్డి బ్రహ్మాండమైన పదవిలో ఉంటారని చెప్పారు.
అద్భుతమైన సేవలు మీ జిల్లాకు, తెలంగాణ రాష్ర్టానికి అందిస్తాడన్నారు. బయట పనిచేయడానికి జీవన్‌రెడ్డిని తనకు అప్పజెప్పాలని, ఇక్కడ మీ వంతు యుద్ధం చేస్తే.. తెలంగాణ యుద్ధం తమ వంతని చెప్పారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో జగిత్యాల పట్టణానికి చెందిన నాయకుడు జీవన్ పర్వాన్ మున్నా, కౌన్సిలర్లు అల్లాల సరిత రమేశ్‌రావు, గాజుల రాజేందర్, రాగుల ప్రదీప్, సిరికొండ పద్మ నర్సింగరావు, బైరినేని భాగ్యగోపీరావు, తోపారపు లావణ్య రజినీకాంత్, సామల జమున రాజశేఖర్, బత్తిని మహేశ్వరి నాగరాజు, కల్లెపల్లి దుర్గయ్య, మున్సిపల్ మాజీ లీడర్ అప్పాల అశోక్, మున్సిపల్ కౌన్సిలర్ చెట్పల్లి సుధాకర్, పద్మశాలి సంఘం నాయకులు, జగిత్యాల మైనార్టీ నాయకులు నెహాల్తోపాటు పెద్ద సంఖ్యలో సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.