జ్యోతినగర్, అక్టోబర్ 19: కాంగ్రెస్ సర్కారు రైతులను గోసపెడుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను ఎత్తి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతమైన రామగుండం కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామ రైతుల పంట పొలాలు సాగునీరు లేక ఎండుతుండడంతో నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం గ్రామ శివారులోని గోదావరి ఒడ్డున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.
కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై గోదావరి నదిని పరిశీలించారు. రైతులతో కలిసి వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో గోదావరి పరీవాహక ప్రాంతాల రైతులు పంపు మోటర్లు పెట్టుకుని సాగు చేశారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు గోదావరిలో నీరులేక కోతకు వచ్చే సమయంలో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు ఉందని, సుందిళ్ల, అన్నారం, కన్నెపల్లి బ్యారేజీలు నింపితే ఈ ప్రాంత రైతులు పంట సాగు చేస్తారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బ్యారేజీల మరమ్మతుల పేరిట పంపింగ్ చేయడం లేదని విమర్శించారు.
ఆరు గ్యారెంటీల అమలు లేదుగానీ.. ఎవరు అడిగారని మూసీ ప్రక్షాళన చేపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో అమాయక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేసీఆర్‌ను బద్నాం చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని, డైవర్షన్‌కు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఇప్పటికైనా రైతుల బాధలు తెలుసుకొని వెంటనే ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరిచి నీళ్లందించాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏడాది పొడవునా గోదావరి నిండుకుండను తలపించేదని గుర్తు చేశారు. దీంతో పరీవాహక ప్రాంత గ్రామమైన ఒక్క జనగామలోనే దాదాపు 400 ఎకరాల్లో రైతులు పంటలు పండించారని చెప్పారు.
ప్రస్తుతం గోదావరిలో నీళ్లు లేక పంటలు చివరి దశలో ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. వెంటనే ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నిరసనలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, జనగామ కవిత, సరోజని, కృష్ణవేణి, మాజీ జడ్పీటీసీ ఆముల నారాయణ, నాయకులు అచ్చెవేణు, తోకల రమేశ్, జనగామ బొడ్డు నర్సయ్య, నూతి తిరుపతి, సంధ్యారెడ్డి, జక్కుల తిరుపతి, చల్ల రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.