మేలైన పంట దిగుబడులను సాధించాలంటే భూమి సారవంతంగా ఉండాలి. కావాల్సిన పోషకాలన్నీ సహజంగా నేలలోనే ఉంటాయి. భూమిలోని సహజ పోషకాలు నేల భౌతిక, రసాయనిక లక్షణాలు, సూక్ష్మ జీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి పనిచేస్తాయి. పంటకు అందిస్తాయి. అయితే.. పంటలు వేసే సమయంలో భూమి స్వభావం, అందుకు అనువైన పంట, సమతుల ఎరువుల వాడకం, తదితర అంశాలు రైతులకు తెలియాలి. వీటన్నింటికీ పరిష్కార మార్గం భూసార పరీక్షలతోనే సాధ్యమని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగ శాస్త్రవేత్త కే విజయ్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం భూములు ఖాళీగా ఉన్నాయని, భూసార పరీక్షలకు ఇదే సరైన సమయని పేర్కొంటున్నారు. భూసార పరీక్ష, ఆవశ్యకత, మట్టి నమూనాల సేకరణ, తదితర అంశాలను ఆయన ఇలా సూచిస్తున్నారు.
– జమ్మికుంట, మే 21
మట్టి నమూనా సేకరణ
పొలంలో ‘వీ’ ఆకారంలో 15 సెంటి మీటర్ల వరకు పారతో గుంట తీయాలి. అందులో పైపొర నుంచి కింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో 8 నుంచి 10 చోట్ల మట్టిని సేకరించాలి. ఆ మట్టిని ఒక చోట చేర్చాలి. తర్వాత మట్టిని బాగా కలుపాలి. 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలను తీసుకుని, మిగతా భాగాలు తీసేయాలి. ఈ విధంగా మట్టి అర కిలో వచ్చే వరకు చేయాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు, పంట వేర్ల మొదళ్లు లేకుండా చూసుకోవాలి. నీడలో ఆరనివ్వాలి. మట్టి నమూనా సేకరణకు రసాయనిక/సేంద్రియ ఎరువుల సంచులను వాడకూడదు.
సేకరణలో జాగ్రత్తలు
మట్టి సేకరణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గట్ల దగ్గరలోని, పంట కాల్వలలోని మట్టిని తీసుకోరాదు. చెట్ల కింద ఉన్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించరాదు. ఎరుపు(పశువుల పేడ, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట, తదితర)కుప్పలు వేసి ఉంచిన చోట మట్టిని తీయకూడదు. ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టి సేకరణ పనికిరాదు. పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు, దాని ఎత్తు, పల్లపు ప్రాంతాలుగా విభజించాలి. వేర్వేరుగా మట్టి నమూనాలను సేకరించాలి. పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే.. అక్కడి నుంచి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్షకు పంపాలి. అలాంటి మట్టిని బాగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపకూడదు. సేకరించిన మట్టి నమూనాలను అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారి, కేవీకే శాస్త్రవేత్తలకు అందించాలి. అంతేకాకుండా భూసార పరీక్షా కేంద్రాలకు కూడా నేరుగా పంపవచ్చు.
నేలలో ఆనేక పోషకాలుంటాయి. అయితే, పంటల దిగుబడుల కోసం రైతులు తెలిసీ తెలియక వేసిన పంటలకు అదనంగా సేంద్రియ, రసాయనిక ఎరువును వాడుతుంటారు. పోషకాలు మొక్కలకు అందుతుంటాయి. ఫలితంగా దిగుబడులకు దోహదపడుతాయి. అయితే, ఈ సాగు వల్ల అదనంగా ఖర్చులు పెరగడమే కాకుండా, నేల తన స్వభావాన్ని కోల్పోతోంది. ఇలా జరుగకుండా ఉండాలంటే ప్రతి రైతూ ముందుగా నేలల్లో ఉన్న భూసారాన్ని తరుచూ తెలుసుకోవాలి.
తద్వారా ఎరువుల వాడకానికి అనవసరపు ఖర్చులు చేయకుండా, నేలను కాపాడుకుంటూ.. అధిక, సుస్థిర దిగుబడులు పొందవచ్చు. దీనికి సంబంధించిన రైతులు పొలంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల పోషక పదార్థాల గురించి తెలుస్తుంది. అంతే కాకుండా భూమిలోని చౌడు గుణం, సున్నం శాతం, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. భూసార పరీక్షలో అన్నింటికంటే ముందు తెలుసుకోవాల్సింది మట్టి నమూనాలు సేకరించడం. మట్టి సేకరణ ఒక పద్ధతి ప్రకారం తీస్తేనే.. పరీక్షల ఫలితాలు స్పష్టంగా తెలుస్తాయి.
భూసార పరీక్ష ప్రయోజనాలు
భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల భూమిలో లేదా రైతులు పండించే పొలంలో మొక్కకు కావాల్సిన పోషకాలు అనేవి ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. సమస్యాత్మకమైన భూములు ఉన్నా కూడా వాటి గురించి తెలుసుకొని వాటిని సవరించుకునే విధానాలు అవలంబించవచ్చు. రైతులు వానకాలంలో ఏ పంటలు వేసుకుంటారు.. ఆ పంటలకు కావాల్సిన ఎరువులు, వాటిని ఎంత మోతాదులో వాడాలో కూడా భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. అది కాకుండా ఈ కాలంలో పట్టణ పరిసరాల్లో చాలా వరకు పరిశ్రమలన్నీ బాగా పెగిపోయాయి. అందులో వచ్చే విష, కాలుష్య పదార్థాలు నీటిలో, నేలలో కలిసిపోతుంటాయి. అవి కూడా పంటలకు నష్టం కలిగిస్తాయి. కాబట్టి ఈ భూసార పరీక్షలతో నేలలో ఉన్న విష పదార్థాలు, తదితర అంశాలన్నీ సులభంగా తెలుసుకోవచ్చు.