జగిత్యాల కలెక్టరేట్, డిసెంబర్ 23 : ఆ నలుగురి మహిళలది ఓ ముఠా! బస్టాండ్, రద్దీ ప్రాంతాలనే టార్గెట్ చేస్తారు.. ఆ జనాల్లో కలిసిపోతారు.. అదును చూసి బంగారు ఆభరణాలు దోచేస్తారు.. ఇలా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళల దొంగల ముఠా గుట్టును జగిత్యాల టౌన్ పోలీసులు రట్టు చేశారు. పది రోజుల క్రితం ఓ మహిళ బ్యాగులోంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ముఠాలోని ఓ మహిళను తాజాగా అరెస్ట్ చేశారు. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళ అరెస్ట్‌ను చూపి డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. నాగపూర్ సిటీకి చెందిన నలుగురు మహిళలు రామేశ్వరి, హత్గాడే కాంత, హత్గాడే గుజాన, సంజన నాడే ముఠాగా ఏర్పడి బస్టాండ్, రద్దీగా ఉండే ప్రాంతాల్లో అదను చూసి చోరీలకు పాల్పడేవారు.
మహిళల బ్యాగుల్లోంచి బంగారు నగదు, నగదు దోచుకెళ్లేవారు. వీరిపై పలు ప్రాంతాల్లో కేసులు కూడా ఉన్నాయి. కాగా, జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపెల్లికి చెందిన మిట్టపెల్లి రవీందర్‌రెడ్డి-జలజ దంపతులు తమ 37 తులాల బంగారు నగలను బ్యాంకు లాకర్లో పెట్టేందుకు ఈ నెల 16న జగిత్యాలకు వచ్చారు. అయితే ఆ బంగారం లాకర్లో పెట్టడం కుదరలేదు. దీంతో రవీందర్‌రెడ్డి తన భార్యను ఇంటికి పంపించేందుకు పాత బస్టాండ్‌లో దింపి, పని నిమిత్తం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ నలుగురు ముఠా సభ్యులు జలజను గమనించి, అత్యంత చాకచక్యంగా ఆమె బ్యాగులోంచి 37 తులాల నగలను చోరీ చేసి ఉడాయించారు.
ఇంటికెళ్లిన తర్వాత నగలు పోయినట్టు బాధిత మహిళ గుర్తించింది. భర్త రవీందర్‌రెడ్డితో కలిసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసును విచారించగా, నాగ్‌పూర్‌కు చెందిన నలుగురు మహిళలు దొంగతనం చేసినట్టు నిర్దారణ చేసుకున్నారు. ముఠాలోని ఓ సభ్యురాలు హత్గాడే కాంత జగిత్యాలకు వచ్చి ఓ గోల్డ్ షాపులో దోచుకున్న నగలను విక్రయిస్తుండగా, సోమవారం జగిత్యాల టౌన్ పోలీసులు పట్టుకున్నారు.
విచారణలో సదరు మహిళ దొంగతనం చేసినట్టు ఒప్పుకొన్నదని, ఆమె వద్ద నుంచి ఏడు తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మిగిలిన ముగ్గురిని సైతం త్వరలోనే పట్టుకుని, మిగతా బంగారు నగలను సైతం స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. మహిళా దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగల ముఠాను కనిపెట్టి మహిళా దొంగను పట్టుకున్న జగిత్యాల సీఐ వేణుగోపాల్, ఎస్ఐ కిరణ్‌ను డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మరో ఎస్ఐ మన్మదరావు, పీసీలు జీవన్, మల్లేశం, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.