జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభతో అంతటా ఫుల్ జోష్ కనిపిస్తున్నది. పల్లెపల్లెనా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీచ్పైనే జోరుగా చర్చ సాగుతున్నది. ఏకధాటిగా యాభై నిమిషాలపాటు చేసిన ప్రసంగాన్ని టీవీల్లో తిలకించిన ప్రజానీకం, ఉద్యమ కాలం నాటి చైతన్యస్ఫూర్తి ప్రసంగాలను గుర్తుకు తెచ్చుకున్నది. అలాగే, బీఆర్ఎస్ పదేళ్ల పాలన గురించి వివరిస్తూనే.. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎక్కడికక్కడ ఏకిపారేయడంతో ఆలోచనలో పడింది. మంగళవారం ఏ ఊరిలో చూసినా కేసీఆర్ మాటల తూటాలపైనే చర్చించుకోవడం కనిపించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతి మాటా నిజమేనంటూ మద్దతు తెలుపుతూనే.. ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అంటూ ఆకాంక్షించింది. రాబోయేది నూటికి నూరు శాతం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ స్పష్టం చేయడంతో భవిష్యత్ గులాబీదేన్న ధీమా వ్యక్తం చేసింది. ఇది చూసిన గులాబీ సైన్యంలో నూతనోత్సాహం కనిపిస్తున్నది.

జగిత్యాల, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : ‘పాలిచ్చే బర్రెను పోగొట్టుకొని ఎగిరెగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నం. దీనికి మేతేసి సచ్చుడు తప్ప మరోటి లేదు’ అంటూ పల్లె జనం వాపోతుంటే.. ‘తప్పు చేశాం. మేధావి పాలనాదక్షుడైన వ్యక్తి పరిపాలనను కాదనుకొని, కనీస ఇంగితజ్ఞానం లేని మనిషిని నెత్తిన తెచ్చి పెట్టుకున్నం’ అంటూ పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జగిత్యాల ప్రజాశీర్వాద సభకు లక్షలాదిగా తరలివచ్చారు. ఇటు ఇదే సమయంలో టీవీలకు అతుక్కుపోయారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకధాటిగా యాభై నిమిషాలు ప్రసంగించడం, బీఆర్ఎస్ పదేళ్ల పాలనను వివరిస్తూనే కాంగ్రెస్ అరాచకాలు, దోపిడీలు, స్కాంలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీలు అమలు చేయని తీరు ఎండగట్టడంతో ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడిపోయారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ఉన్న భ్రమలు తొలిగిపోయాయని చెబుతున్నారు. తెలంగాణ సాధకుడు కేసీఆరే తమ రక్షకుడు అన్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగారు. పల్లె నుంచి మొదలుకొని పట్నం వరకు కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అన్న అభిప్రాయానికి వచ్చేశారు. సభకు వచ్చిన వాళ్లే కాదు.. ప్రసంగం విన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటా నిజమేనని స్పష్టం చేస్తున్నారు.

‘మోసపడితే గోసపడ్తం’ అని చెప్పానా.. లేదా..? ఇప్పుడేమైంది? అందరి పరిస్థితి ఆగమైంది. ఎవరిని కదిలించినా ఏడుపే’ అని చెప్పడంతో నిజమేనంటున్నారు. ‘కేసీఆర్ రావాలి.. రేవంత్ పోవాలి’ అప్పుడే తమ బతుకులు బాగుతుపడుతాయని ఆశపడుతున్నారు. ఇదే తమ నినాదమని స్పష్టం చేస్తున్నారు. ఏదైనా కట్టే ముచ్చట, మనిషికి అన్నం పెట్టే ముచ్చట కేసీఆర్ సార్‌కు తెలుసని, ఈ సార్ (సీఎం)కు మాత్రం అంతా ఇచ్చగొట్టుడు.. పడగొట్టుడు.. ఇచ్చిన మాటలను ఎగొట్టుడు తెలుసని ఎద్దేవా చేస్తున్నారు.
‘మరో యుద్ధం మొదలవ్వాల్సిందే.. కాంగ్రెస్‌ను నిలదీయాల్సిందే.. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మొదలు కావాల్సిందే’నంటూ కేసీఆర్ పిలుపు నివ్వగా.. తామంతా సై అంటున్నారు. సోమవారం రాత్రి నుంచే జరుగుతున్న చర్చలను చూస్తే ఒక పాలకుడు తన సంస్కరణలతో ప్రజల మనసుల్లో ఇంతగా ముద్రించుకుపోతాడా..? అనిపించింది. వృద్ధులను కదిలిస్తే.. రెండువందలు ఉన్న పెన్షన్‌ను రెండువేలకు పెంచి, ముసలోళ్లకు కొడుకు అయ్యాడన్న మాటలు వినిపిస్తే.. ఐటీ రంగంలో సంస్కరణలు, ఉపాధి, ఉద్యోగ కల్పనతో యువత జైకొట్టింది. ఇక రైతులతో మాట కలిపితే.. తమ ప్రత్యక్షదైవం కేసీఆరే అన్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
విద్యార్థులతో మాట్లాడిన సందర్భంలో సార్ పెట్టిన గురుకులాలు, బెస్ట్ అవలెబుల్ స్కూల్స్‌లో చదువుకునే పెద్దవాళ్లం అయ్యామన్న సంతోషం వ్యక్తమైంది. మహిళలను కలిస్తే.. కేసీఆర్ కిట్ నుంచి మొదలు కొని కల్యాణలక్ష్మి వరకు అందించి ఆడబిడ్డల పాలిట దేవుడిచ్చిన అన్నగా కేసీఆర్ ఎలా మారాడో వివరించడం కనిపించింది. ఏం జరిగిందో.. ఏమైందో కానీ, అనవసరంగా చెప్పుడు మాటలు విని నష్టపోయామని, మనుషుల్లో ఉన్న సహజ సిద్ధమైన బలహీనతలు తమ పుట్టిముంచాయని వాపోవడం కనిపించింది. రెండున్నరేండ్లకే పచ్చగున్న తెలంగాణ రాష్ట్రం పాడుపడిందని, ఎంత తొందరగ వీలైతే అంత తొందరగా, కేసీఆర్ సార్ పాలన రావాలన్న ఆతృత, ఆకాంక్ష ప్రజల మనసుల్లో వ్యక్తమైంది.

జగిత్యాల సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్లో జోష్ పెంచింది. కేసీఆర్ మళ్లీ కమ్‌బ్యాక్ ప్రసంగంతో శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. సీనియర్ నాయకుడు మాజీమంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిక సందర్భంగా మినీస్టేడియంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అంచనాలకు మించి రావడం, కేసీఆర్ తన ప్రసంగంతో కట్టిపడేయం చూసి నూతనోత్సాహంలో మునిగిపోయారు.
జీవన్‌రెడ్డి చేరికపై సర్వే చేయిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయంటూ కేసీఆర్ స్వయంగా సభా వేదికపై ప్రకటించడం, జీవన్‌రెడ్డి చేరడం వల్ల జగిత్యాల నియోజకవర్గంలో అటంబాంబ్ పేలబోతుందని వ్యాఖ్యానించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీమంత్రితోపాటు ఆయన అనుచరగణం చేరికతో తమ పార్టీ మరింత శక్తివంతంగా మారుతుందని చెబుతున్నారు. సభ విజయవంతం కావడం, జీవన్‌రెడ్డి లాంటి బలమైన నాయకుడు, ప్రశ్నించే గొంతుకు తోడు కావడంతో పార్టీ శ్రేణులు ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. జనంలో నెలకొన్న స్పందనను చూసి రానున్న కాలం తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల సభల కేసీఆర్ స్పీచ్‌ను అందరం ఆసక్తిగా చూసినం. ప్రజలంతా కూడా ఆస్వాదించిన్రు. ఆయన ప్రసంగంతో మళ్లీ జీవం పోసిండు. ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని ఎండగట్టిండు. కేసీఆర్ అంటే అందరికీ అభిమానమే. బీఆర్ఎస్ పాలనల అన్ని టైంకు వచ్చినయ్. సిరిసిల్ల నేతన్నలపై మాట్లాడిండు. ఇప్పుడు ఆత్మహత్యలు మొదలవుతున్నయని ఆందోళన వ్యక్తం చేసిండు. సర్కారు అన్నీ ఆర్డర్లు బంద్ చేసి, కమీషన్ల కోసం ఇంకెవరికో ఇస్తున్నదని చెప్పిండు. ఇది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. ఇంకా అన్ని వర్గాలకు జరుగుతున్న మోసాలను కండ్ల ముందు ఉంచిండు. కాంగ్రెసోళ్లు పొద్దునలేత్తె కేసీఆర్ చావాలె మాట్లాడుతున్నరు. కానీ, నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ కొడుకా.. అంటూ ఉద్వేగంగా మాట్లాడిండు. అన్ని వర్గాలను కదిలించిండు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ మాటలపై ఆలోచన చేస్తరు.
– ఆడెపు మోహన్ (సిరిసిల్ల)
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే గోసపడుతం అని కేసీఆర్ సారు చెప్పినా వినకుంట ఇప్పుడు నిజంగానే అరిగోస పడుతున్నం. నీళ్లు లేవు, రైతుబంధు లేదు, వడ్లు కొనేటోళ్లు లేరు. మా రైతుల పరిస్థితి అధోగతి పాలైంది. నిన్న జగిత్యాలలో కేసీఆర్ సార్ మాట్లాడినప్పుడు అయ్యో పెద్దాయన చెబితే వినకపోతిమే అని బాధేసింది. ఆయన చెప్పింది అక్షరాలా నిజమైంది. మా రైతులకే కాదు, ఏ ఒక్క వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఇట్ల లేకుండేది. మా ఊరి చెరువుల ఎప్పుడూ నీళ్లు ఉండేటివి, పొలాలు దున్నుతున్న టైంలోనే రైతుబంధు ఇచ్చెటోళ్లు, యూరియా బస్తాలు ఎన్నంటే అన్ని దొరికేటివి. వరి కోతలు కోసినంక, సెంటర్లను ఏర్పాటు చేసి వడ్లు కొన్నరు. కేసీఆర్ సారు మా రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నడు.
ఈ కాంగ్రెస్ సర్కారు అచ్చినంక మల్ల కష్టాలు మొదలైనవి. రేవంత్‌రెడ్డి ఏమో చేస్తాడని నమ్మి ఓటేసినందుకు మా రైతులను మోసం చేసిండు. ఏ ఒక్కటి సక్కగా చేస్తలేడు. చెప్పేదొక్కటి, చేసేదొకటి లెక్క ఉంది. టైం కు రైతుబంధు వేసింది లేదు, యూరియా బస్తాలకు రోజుల తరబడి లైన్లో కట్టుడు అయితుంది. వడ్లు ఎప్పుడు కొంటారో తెలువది. బోనస్ ఎగపెట్టిర్రు. ఇంక మా రైతులను ఏం చేస్తరో తెలియదు. జీవితంలో మల్లా కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యం. కేసీఆర్ సార్ వస్తేనే మా రైతుల బతుకులు బాగుపడతయి. నిన్న జగిత్యాల సభల కేసీఆర్ సారు చెప్పిన మాటలు మా కండ్లు తెరిపించినయి. మళ్ల కేసీఆర్ సార్ రావాలి. మా బతుకులు బాగుపడాలె.
– గడ్డం నర్సయ్య, రైతు, బూరుగుపల్లి (గంగాధర)