ఐదారేండ్లుగా పుష్కలమైన చెరువు నీళ్లు, భూగర్భ జలాలతో బంగారు పంటలు పండించిన చింతకుంట, రాజారాంతండా మళ్లీ పదేళ్ల కిందటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రధాన ఆధారంగా ఉన్న చెరువు, వరదకాలువలోకి నీళ్లు రాకపోవడంతో సాగునీటికి తండ్లాడుతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాయి. పదిహేను రోజుల్లో వందకు పైగా బోర్లు వేయిస్తే 90శాతం విఫలం కాగా, ఈ రెండు ఊర్లు ‘బోరు’మంటున్నాయి. దాదాపు 70 లక్షలకు పైగా ఖర్చు చేసినా ప్రయోజనం దక్కకపోవడంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నాయి.
జగిత్యాల, మార్చి 4, (నమస్తే తెలంగాణ) / కథలాపూర్ : ఎస్సారెస్పీ తొలి ఫలాలను అందుకునే ప్రాంతం జగిత్యాల జిల్లా.. వరద కాలువ ఫలాలు సైతం అందుకునే తొలి జిల్లా కూడా ఇదే. అయితే, ఈ జిల్లాలోనూ కొన్ని నాన్ కమాండ్ మండలాలు ఉన్నాయి. కాకతీయ ప్రధాన కాలువతోపాటు వరద కాలువ ఆయా మండలాల నుంచే వెళ్తున్నా పెద్దగా ప్రయోజనం మాత్రం దక్కడం లేదు. మెట్పల్లి, కథలాపూర్, మేడిపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాలు నాన్ కమాండ్ ఏరియాలో ఉన్నాయి. ఈ మండలాల్లోని పంటలను సైతం సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వరద కాలువను బేస్ చేసుకొని ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని ప్రారంభించారు. వరద కాలువను ఏడాది పొడవునా ఒక్క టీఎంసీ నీటితో నింపి ఉంచే ప్రక్రియ మొదలు బెట్టారు. అలాగే, వరద కాలువకు తూములు పెట్టి, నాన్ ఆయకట్టు పరిధిలో ఉన్న మండలాల్లోని చెరువులను నింపే ప్రక్రియ చేపట్టారు. చెరువులను ఏడాది పొడవునా నింపి ఉంచడం, చెరువుల్లో నీళ్లు తగ్గితే మండు వేసవిలోనూ కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి, వరద కాలువ తూముల ద్వారా నింపే ప్రక్రియ కొనసాగించారు. వరద కాలువలో ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండడం, తూముల ద్వారా చెరువులను నింపడంతో నాన్ ఆయకట్టు మండలాల్లోని గ్రామాల్లోనూ భూగర్భజలాలు పెరిగాయి. నాన్ ఆయకట్టు మండలాల్లో ఒకటైన కథలాపూర్ జిల్లాలోనే సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్న మండలంగా గుర్తింపు పొందింది.
అలాంటి మండలం సైతం ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో తన దశను మార్చుకొని, సేద్యానికి అనుకూలమైన మండలంగా మారిపోయింది. భూగర్భజలాల మట్టం కూడా 2018 నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. అదే ఏడాది మార్చిలో మండలంలో 11.60 మీటర్ల లోతున భూగర్భజలాలు ఉండగా, 2020 మార్చిలో 3.75 మీటర్లపైకి నీటి ఊటలు వచ్చాయి. 2022లో 2.02 మీటర్ల లోతులోకి భూగర్భ నీటి మట్టం పెరిగింది. మండువేసవి అయిన ఏప్రిల్, మే నెలల్లో 2018లో 13.65 మీటర్ల లోతున జల ఊటలు ఉండగా, 2020లో 4.65 మీటర్ల పైకి, 2022లో 4.03 మీటర్ల పైకి నీటి ఊటలు చేరాయి. భూగర్భ జలాలు పెరగడంతో సాగు విస్తీర్ణం సైతం పెరిగిపోయింది. 2018లో కథలాపూర్ మండలంలో 7,975 ఎకరాల్లో పంటలు సాగు కాగా, 2022లో 11906 ఎకరాలకు చేరింది. మూడేండ్ల వ్యవధిలోనే ఒక్క కథలాపూర్ మండలంలోనే దాదాపు 4 వేల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. పంట విస్తీర్ణం, దిగుబడి పెరగడంతో రైతులు ఆనందోత్సాహాలతో పొంగిపోయారు. అయితే, ఈ యేడాది పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. రైతులు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు మళ్లీ బోరుబావులు వేసుకునే దుస్థితికి వచ్చారు. మండలంలోని చింతకుంట, రాజారాంతండా గ్రామాలకు చెందిన రైతులు పదిహేను రోజుల వ్యవధిలోనే వందకు పైగా బోర్లు వేసి, నీటి చుక్క జాడ కానరాక బిక్కముఖం వేసుకొని దిగాలుపడుతున్నారు.
పదెకరాల్లో ఎవుసం చేస్తా అని మొదలు పెట్టిన. నిరుడు, మోయడు లెక్కనే నీళ్లు అత్తయి. ఉన్న రెండు బోర్లు పనిచేస్తయని అనుకున్న. నారు పోసి ఎవుసం మొదలువెట్టినంక నీళ్లు అచ్చుడు బంద్ అయ్యింది. బోర్లు మొత్తం ఎండుకపోవుడు షురువైంది. నీళ్ల జాడ లేకపోవడంతో పదెకరాల పంట దెబ్బతినే పరిస్థితి కనిపించింది. పంటను కాపాడుకునేందుకు పది రోజులల్ల ఐదు బోర్లు వేసిన. అయినా పాయిదా లేకుండా పోయింది. దాదాపు మూడు లక్షల రూపాయల ఖర్చయింది. కానీ, నీటి చుక్క జాడ లేదు. ఈసారి మా తండా వాసుల పంటలు గంగల కలిసినట్లే అనిపిస్తుంది.
నేను ఆరెకరాల 29 గుంటల్లో వరి వేసిన. రెండెకరాలకే నీరు సరిపోతుంది. మిగతా నాలుగెకరాలకు సరిపోయే పరిస్థితి లేదు. పది రోజుల వ్యవధిలోనే మూడు బోర్లు వేయించిన. అయినా, ఒక్క చుక్క రాలే. రెండు బోర్లకు కేసింగ్ వేయిస్తే పనిచేస్తయ్ అంటే రెండింటికీ వేయించిన. అయినా చుక్క రాలే. పదేండ్ల కిందట మూడు బోర్లు వేయించిన. అందులో రెండు పడ్డయ్. ఎవుసం సాగింది. 2018 తర్వాత మా పొలాలకు నీటి ఇబ్బందులు రాలే. వరద కాలువ ఎప్పుడూ నిండుగా ఉండేది. దీనికి తోడు సూరమ్మ చెరువులో నీళ్లు ఉండడంతో భూగర్భజలాలు పెరిగినయ్. 2020 నుంచి నీటికి తిప్పలు రాలే. బోర్లు వేయాల్సిన అవసరం ఏర్పడలే. ఇప్పుడు మళ్లీ బోర్లు వేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. మా చింతకుంటతో పాటు పక్కనే ఉన్న రాజారాంతండాలో మస్తుమంది బోర్లు వేయిస్తున్నరు. అయినా ఒక్కదాంట్లో నీటి ఊట వస్తలేదు.. నాకు ఒక్కో బోరుకు 70 వేల చొప్పున ఇప్పటికే 2.10 లక్షలు ఖర్చయింది. అయినా, నీళ్లు పడలే. ఇక పడతయన్న నమ్మకం లేకుండా పోయింది. మళ్లీ మాకు తిప్పలు తప్పేలా లేవు.
నాలుగు బోర్లు వేసినం సార్. అయినా, నీళ్ల చుక్క పడలే. నాకు మొత్తం ఆరెకరాలు ఉంది. నాలుగెకరాల్లో వరి సాగు చేస్తున్న. మొన్నటి వరకు మొత్తం భూమి సాగు చేసిన. ఇప్పుడు పరిస్థితులు మంచిగా కనిపిస్తలేవని నాలుగెకరాల్లోనే వేసిన. పాత బోర్లలో నీళ్లు రాలే. దీంతో పంట కాపాడుకోవాలన్న ఆతృతతో నాలుగు బోర్లు వేయించిన. అయినా లాభం లేకుండ పోయింది. దాదాపు రూ.3 లక్షలు ఖర్చయినయ్. కానీ, నీటి చుక్క మాత్రం రాలే. 2019 నుంచి 2023 వరకు ఢోకా లేకుండా పంటలు పండినయ్. వరద కాలువల ఎప్పుడూ నీళ్లుండడం వల్ల మస్తు లాభమైంది. ఇప్పుడు వరద కాలువను నింపకపోవడంతో మా ఊళ్లె నీటి ఊటలు వస్తలేవ్. ఏదేమైనా మళ్లా మా కథలాపూర్ మండల రైతులకి కట్టపడే రోజులు వచ్చినయ్.
కథలాపూర్ మండలంలో పెద్దగా నీటి వసతి లేని గ్రామం చింతకుంట. మొన్నటి వరకు రాజారాంతండా సైతం ఈ గ్రామ పరిధిలోనే ఉండేది. ఇటీవలే ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. చింతకుంటలో 2400 ఎకరాల సాగు భూమి ఉండగా, 2800 మంది జనాభా ఉన్నారు. అందులో దాదాపు 1500 మంది వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. ఇక రాజారాంతండాలో 370 జనాభా ఉంది. ఇక్కడ 160 మంది రైతులు 500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ రెండు గ్రామాలకు చింతకుంట గ్రామ చెరువే ఆధారం. అయితే, కాలువ ద్వారా ఈ చెరువు నింపుకునే అవకాశం లేదు. వర్షాలు పడినప్పుడే సహజంగా నిండాల్సిందే. అయితే, చింతకుంట, రాజారాంతండాకు సమీపంలో కలికోట సూరమ్మ చెరువు ఉంటుంది. అందులో నీళ్లున్నన్ని రోజులు ఈ రెండు గ్రామాల్లో నీటి ఊటలు పెరుగుతాయి. అలాగే, వరద కాలువ సైతం ఈ రెండు గ్రామాలకు సమీపంలోనే ఉంటుంది.
అందులో ఏడాది పొడవునా నీటితో నింపినన్ని రోజులు రెండు గ్రామాల్లో భూగర్భజలాలతో బంగారు పంటలు పండాయి. అయితే, గతేడాది డిసెంబర్లో సూరమ్మ చెరువుకు గండిపడడంతో అందులో నీటి చుక్క లేకుండా పోయింది. నీటిని విడుదల చేసిన సమయంలో మాత్రమే వరద కాలువలో నెలలో మూడు నాలుగు రోజులు నీటి ప్రవాహం కనిపించింది. అటు వరద కాలువలో, ఇటు సూరమ్మ చెరువులో నీరు లేకపోవడంతో ఈ రెండు గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. ఈ క్రమంలో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు మళ్లీ కొత్తగా బోర్లను వేయడం మొదలు పెట్టారు. పది, పదిహేను రోజుల వ్యవధిలోనే రెండు గ్రామాల్లో వందకు పైగా బోర్లు వేశారు. అందులో కేవలం నాలుగైదింటిలో మాత్రమే కొద్దిమొత్తంలో నీళ్లు వచ్చాయి. 90కి పైగా బావులు వట్టిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 70 లక్షలకు పైగా డబ్బులు ఖర్చుపెట్టి బోర్లు వేయించినా, ప్రయోజనం లేదని వాపోతున్నారు.
నాకు ఏడెకరాలుంది. ఉన్న భూమి మొత్తం సాగు చేయాలని మొదలు వెట్టిన. అయితే, మధ్యలకు వచ్చినంక పంటకు నీళ్లు అందుడు బందయింది. ఏం చేయాలో అర్థం కాలే. ఎట్లన్న చేసి పంటను కాపాడుకోవాలని ఒక బోరు వేసిన. నీళ్లు పడలే.. అయినా ఆశతోటి మళ్లీ రెండు బోర్లు వేసిన. మూడు బోర్లలో చుక్క రాలే. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఊరు, మా పక్కన ఉన్న చింతకుంట రైతులు చింతకుంట చెరువుపై ఆధారపడే పంట సాగు చేస్తరు. ఆ చెరువులకు గూడ వానలు పడితేనే నీళ్లు వస్తయ్. మా ఊరి దగ్గరి నుంచే వరద కాలువ పోతున్నా మాకు నీళ్లు రావు.సూరమ్మ చెరువు, వరద కాలువను ఏడాది పొడువునా నింపి ఉంచితే మాత్రం మా ఊరి చెరువు నిండడంతోపాటు, మొత్తం ఊర్లళ్ల భూగర్భజలాలు పెరుగుతయ్. నాలుగైదేండ్లు మంచిగనే పంటలు పండించుకున్నం. ఇప్పుడు వరద కాలువ, సూరమ్మ చెరువుల నీళ్లు లేవు. మా ఊళ్లలో ఊటలు గంగల కలిసినయి.. బోర్లు పనికి రాకుండా పోయినయ్.. ఈ ఏడాది మా ఊరోళ్లం నిండా మునుగుడే.