జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ తీరు ఆది నుంచి చర్చనీయాంశమవుతున్నది. గత అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి విమర్శలకు తావిస్తున్నది. ‘గడికో మాట.. పూటకో పార్టీ’ అన్నట్టు.. ఓసారి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాని, మరోసారి కాంగ్రెస్‌లో చేరలేదని, ఇంకోసారి బీఆర్ఎస్లోనే ఉన్నానని.. మళ్లీ తనది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమేనని ప్రకటిస్తుండడం విస్మయానికి గురి చేస్తున్నది. ఇంకా కాంగ్రెస్ కండువాలు వేసుకున్న నాయకుల మధ్య కూర్చొని తాను గులాబీ పార్టీలోనే ఉన్నానని.. మరోసారి కాంగ్రెస్ కండువా వేసుకొని ఇప్పటికీ తనకు పార్టీ సభ్యత్వం లేదని వ్యాఖ్యలు చేయడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని రాజీయ సీనియర్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. దాదాపు రెండేండ్లుగా జగిత్యాల ఎమ్మెల్యే ప్రకటనలు చూసి.. అసలు ఆయనది ఇంతకు ఏ పార్టీ? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 2024లో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ చేరారు. అయితే అప్పుడు ఆయన జగిత్యాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో.. సీఎం రేవంత్‌రెడ్డితో పనిచేయడానికి సిద్ధమయ్యానని ప్రకటించారు. అప్పటి నుంచే ఆయన షో ప్రారంభమైంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరడంపై గులాబీ శ్రేణులు ఆగ్రహించగా, ఇటు కాంగ్రెస్‌లోకి తీసుకోవడంపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఆయన వర్గీయులు భగ్గుమన్నారు. సంజయ్ కుమార్‌తోపాటు పార్టీ ఫిరాయించిన మరో 9 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చింది.
ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తాను కాంగ్రెస్‌లో చేరలేదని, సీఎం రేవంత్‌రెడ్డిని కలిస్తే తనకు గౌరవ సూచకంగా మూడురంగుల కండువాను కప్పారే తప్ప తాను పార్టీలో చేరలేదని ప్రకటించారు. ఒకవైపు కాంగ్రెస్‌లో చేరలేదంటూనే ఆ పార్టీ అంతర్గత కార్యకలాపాల్లో పాల్గొనడం మొదలు పెట్టారు. గాంధీభవన్‌లో జరిగిన పార్టీ అంతర్గత సమావేశానికి హాజరుకావడం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. అంతకంటే ఒక్క రోజు ముందే స్పీకర్ వద్ద పార్టీ ఫిరాయింపు అంశంపై తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని, కాంగ్రెస్‌లో చేరలేదంటూ ప్రమాణపత్రాన్ని అందించడం మరింత సంచలనం సృష్టించింది. ఒక వైపు ప్రమాణపత్రాన్ని అందజేసి, 24 గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ అంతర్గత సమావేశానికి హాజరు కావడాన్ని జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో సంజయ్‌కుమార్ తన వర్గానికి కౌన్సిలర్ టికెట్లను ఇప్పించుకునేందుకు చక్రం తిప్పడంపైనా మండిపడ్డారు.
అసలు ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ టికెట్లతో ఏం సంబంధం? నువ్వు ఏ పార్టీలో ఉన్నావో చెప్పు?’ అంటూ సవాల్ విసిరారు. అయితే, అదే సమయంలో స్పీకర్ వద్ద సంజయ్‌కుమార్ పార్టీ ఫిరాయింపు అంశంపై రూలింగ్ ఇవ్వాల్సి ఉండగా, ఎమ్మెల్యే గతంలో ఎవరు చేయని సాహసం చేశారు. కాంగ్రెస్ కండువాలతో ఉన్న తన వర్గానికి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులతో ప్రెస్‌మీట్ నిర్వహించి, తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని, పార్టీకి నెలకు 5 వేలు చెల్లిస్తున్నానంటూ ప్రకటన చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని జీవన్‌రెడ్డి ప్రకటించడం, దీనిపై హైదరాబాద్‌లో మీడియా సాక్షిగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్పందించడం, జీవన్‌రెడ్డి పార్టీ వీడిపోవాలని తాను కోరుకోవడం లేదని, ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించడం మరో సంచలనమైంది. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నా. విప్ ఇస్తే ఓటేస్తాను’ అంటూ ప్రకటించిన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డితో ఎలా పనిచేస్తారనే ప్రశ్నలు రాగా, రాజకీయ వర్గాల్లో ఎమ్మెల్యే అపరిపక్వతపై అందరినీ విస్మయానికి గురిచేసింది. చివరకు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో జీవన్‌రెడ్డి పార్టీని విడిచిపెట్టారు. ఆయనను బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా గురువారం జగిత్యాలకు వచ్చారు.
జీవన్‌రెడ్డి-కేటీఆర్ మధ్య సమావేశం నడుస్తున్న సమయంలోనే రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే రెండేండ్లుగా కాంగ్రెస్‌తోనే కొనసాగుతున్నప్పటికీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఎప్పుడూ మెడలో కాంగ్రెస్ కండువా వేసుకోలేదు. కానీ, ఆశ్చర్యంగా జీవన్‌రెడ్డి-కేటీఆర్ సమావేశం జరుగుతున్న తరుణంలో నిర్వహించిన ప్రెస్మీట్లో మొదటిసారిగా ఎమ్మెల్యే మెడలో కాంగ్రెస్ కండువా వేసుకొని మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి గెలిచినా.. తనది మొదటి నుంచి కాంగ్రెస్ కుటంబమేనని ప్రకటించి పూర్తిగా తన అసలు రంగును బయటపెట్టారు. తాను కాంగ్రెస్‌లో చేరకున్నా.. చేరాను అన్నారని, ఇప్పటికీ కూడా తనకు కాంగ్రెస్ సభ్యత్వం లేదంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండేండ్లుగా వివిధ సందర్భాల్లో జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మార్పు, బీఆర్ఎస్లో కొనసాగుతున్నానంటూ పొంతన లేని ప్రకటనలు చేస్తుండడం చూసిన జనం.. అసలు ఈయన ఏ పార్టీలో ఉన్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఒక ప్రజాప్రతినిధి, రాష్ట్ర భవిష్యత్తుకు మార్గం వేసే చట్టసభ ప్రతినిధి ఇలా అర్థంపర్థం లేని ప్రకటనలు చేస్తారా? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.