న్యూఢిల్లీ, జూలై 23 : నీట్ పేపర్ లీక్పై నిరసనలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో పార్లమెంట్ ఉభయ సభలు గురువారం వరుసగా నాలుగవ రోజు కూడా స్తంభించిపోయాయి. ఎటువంటి కార్యకలాపాలు జరగకుండానే లోక్సభ, రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. సభ వెలుపల ప్రతిపక్ష, అధికార పక్ష ఎంపీలు పరస్పర నిరసనలు తెలిపారు. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనపుడు నీట్ పేపర్ లీక్ అంశం, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల చర్యకు నిరసనగా విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు.
దీంతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడిన సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ్యుల నిరసనలు ఆగకపోవడంతో లోక్సభ శుక్రవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా నినాదాలు పెరిగాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. చర్చకు విపక్షం సిద్ధంగా ఉందని, ప్రధాన్ ముందుగా రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు. పలుమార్లు సభ వాయిదాపడి తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితి సద్దుమణగకపోవడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న హరివంశ్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.