సారంగాపూర్, మే 3: విద్యా, వైద్య రంగాల్లో దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ విద్యార్థిని కే అమూల్య 580 మార్కులు సాధించింది.
కాగా అమూల్యతో పాటు ఉత్తమ మార్కులు సాధించిన అశ్విత 561, ఎం శ్రీహిత 551 మార్కులు సాధించగా ఎమ్మెల్యే క్వార్టర్ లో సంజయ్ కుమార్ ను వారు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసి సౌకర్యాలు కల్పించారని, ఎన్నో ఏళ్లుగా పాఠశాలలో సమస్యతో ఉన్న స్కావెంజర్ లను కూడా నియమించినట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందిస్తున్నట్లు, మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు సరైన ఏక రూప దుస్తులు తయారీకి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయ నియామకాలతో విద్యార్థులకు సరైన బోదన సిబ్బంది ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణతే సాక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సంగనబట్ల నరసింహమూర్తి, మాజీ ఎంపీటీసీ సృజన సుశీన్, మాజీ ఉప సర్పంచ్ హరీష్, ఉపాధ్యాయులు ధరణి, రఘుపతి, మంజునాథ్, ప్రజుల, గౌతమి, గంగారాం, మంగ, ఉమ పాల్గొన్నారు.