జగిత్యాల రూరల్, డిసెంబర్ 13 : ‘బీజేపీతో ఉంటే నీతి, ఆ పార్టీని విభేదిస్తే అవినీతా..?’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీడీ కార్మికులకు రూ.2వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో బీడీ కార్మికులకు ఏమిచ్చారో చెప్పాలన్నారు. దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడే బీజేపీ నాయకులు ఏ గుడికి ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత నిజంగానే పులి బిడ్డనే అని, కేసీఆర్ పులి లాగానే మొదట ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసి, కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడని కొనియాడారు. ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, సీబీఐ విచారణకు కవిత సహకరించారన్నారు.
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, బతుకమ్మను ప్రపంచ వ్యాప్తంగా పండుగ చేసిన ఘనత కవితదన్నారు. ఎమ్మెల్సీ కవిత ఆడే విధానం, ఆటలు, పాటల్లో ఆశ్లీలత, అసభ్యత ఎక్కడైనా కనిపించిందా? అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా చేసిన వ్యాఖ్యలు కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య పాలకులు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువుల పునరుద్ధరణ, బతుకమ్మ ఘాట్లు ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుజనా చౌదరి, రమేశ్ ఇద్దరికీ ఈడీ నోటీసులు వచ్చాయని, వారు బీజేపీలో చేరగానే నోటీసులు వెనక్కి వెళ్లాయని గుర్తుచేశారు. దేశంలో అత్యధిక ధనిక పార్టీ బీజేపీ అని, 60 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ కంటే నిధులు బీజేపీకే ఎక్కువగా ఉన్నాయన్నారు. బండి సంజయ్ అసభ్యంగా, వ్యంగ్యంగా మాట్లాడడం మానుకోవాలని, కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
జగిత్యాలకు ఎన్ని నిధులిచ్చారో నిన్నటి రోడ్డు షోలో ఎందుకు చెప్పలేదని బండి సంజయ్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం, 24 గంటల కరెంటు, అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అనంతరం నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు నాయకులు స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గట్టు సతీశ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముజాహిద్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల ముకుందం, కత్రోజు గిరి, నాయకులు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.