wage rates | రాజన్న సిరిసిల్ల, మే 7, నమస్తే తెలంగాణ : వార్పిన్ కార్మికుల పట్ల పాలిస్టర్ యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం వార్పిన్ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్ లోన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోసం రమేష్ మాట్లాడుతూ పాలిస్టర్ వస్త్ర యజమానులు వార్పిన్ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరిస్తున్నారన్నారు.
వార్పిన్ కార్మికులకు గత బతుకమ్మ చీరల పనికంటే రెండింతలు పని బారం పెరిగిందని, పనికి తగ్గ వేతనం ఇవ్వడానికి యజమానులు ముందుకు రావడం లేదన్నారు. యజమాల వైఖరికి నిరసనగా ఈరోజు నుండి నుండి కార్మికులు సమ్మెబాట పట్టినట్లు తెలిపారు. కార్మికుల కూలీ నిర్ణయం చేయవలసిన అధికారులు యజమానులకు అప్పజెప్పడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు.
స్థానిక చేనేత జౌళి శాఖ అధికారులు కార్మికుల విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బట్ట ఉత్పత్తి చేసేది కార్మికులైతే, వారితో మాట్లాడడానికి కూడా అధికారులు సమయం ఇవ్వడం లేదని, కార్మికుల కోసం ప్రవేశపెట్టిన పథకం యజమానుల పథకముగా మారిందన్నారు. యజమానులు తమ లాభాల గురించి ఆలోచిస్తున్నారే తప్ప కార్మికుల కు మెరుగైన వేతనం అందించాలన్న ఆలోచన ఏ మాత్రం చేయడం లే దన్నారు.
ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కార్మికులకు న్యాయమైన కూలీ నిర్ణయించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు సమస్యను పరిష్కరించని పక్షంలో గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్మికులందరూ పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, యూనియన్ అధ్యక్షులు సిరిమల్లె సత్యం, వైపనీ యూనియన్ అధ్యక్షులు కుమ్మరి కుంట కిషన్, ఉడుత రవి, మచ్చ వేణు, వై పని, యూనియన్ జిల్లా నాయకులు ఒగ్గు గణేష్, ఎలికేటి శ్రీనివాస్, ప్రవీణ్ బూట్ల వెంకటేశ్వర్లు, దోమల రమేష్, చింత కింది సుధన్, తదితరులు పాల్గొన్నారు.