పెగడపల్లి, మార్చి19: ప్రేమపేరుతో ఇద్దరు ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ బాలిక పురుగుల మందు తాగి తనువు చాలించిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బుధవారం జరిగింది. ఎస్ఐ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రాంబద్రునిపల్లి గ్రామానికి చెందిన బాలిక మండలంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అయితే రాంబద్రునిపల్లికి చెందిన బాస రాముతోపాటు రంగదామునిపల్లికి చెందిన ఓ బాలుడు ఇద్దరూ కలిసి ప్రేమపేరుతో బాలికను కొంతకాలంగా వేధిస్తున్నారు.
ప్రేమించకపోతే పరువు తీస్తామని భయబ్రాంతులకు గురిచేసారు. బాలిక వేధింపులు భరించలేక ఈ నెల 15న తన ఇంట్లోనే పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తల్లిదండ్రులు గమనించి, జగిత్యాల దవాఖానకు తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్, ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెగడపల్లి ఎస్ఐ రవికిరణ్ వివరించారు.