జగిత్యాల, ఫిబ్రవరి 24 : ఈనెల 27న జరిగే మెదక్ -నిజామాబాద్ -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేందుకు ఈ ప్రత్యేక సెలవు వర్తిస్తుందని తెలిపారు.
వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేజ్మెంట్, అథారిటీలలో పని చేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు సైతం వారి ఓటు హక్కును వినియోగించు కునేందుకు యాజమాన్యాలు అనుమతి, వెసులుబాట్లు ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు షిఫ్టుల సర్దుబాటు, డ్యూటీ గంటల తగ్గింపు, ఆలస్యంగా హాజరుకావడానికి అనుమతి వంటి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక సాధారణ సెలవు, వెసులుబాట్లను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.